Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేను ఎక్కడున్నా ప్రజారవాణా వ్యవస్థకు మద్దతు

నేను ఎక్కడున్నా ప్రజారవాణా వ్యవస్థకు మద్దతు

- Advertisement -

నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఆర్టీసీతో నా నాలుగేండ్ల ప్రయాణం ముగిసింది
వీసీ సజ్జనార్‌ వెల్లడి
చివరిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్ఠలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిపి పనిచేశాం. భవిష్యత్‌లోనూ మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా.. మన టీజీఎస్‌ఆర్టీసీని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఆర్టీసీతో నాలుగేండ్ల ఈ పయనం నాకెంతో సంతృప్తినిచ్చింది. భవిష్యత్‌లో నేను ఎక్కడ ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థకు, ఈ గొప్ప సంస్థకు నా మద్దతు కొనసాగుతుంది. ప్రజలకు రవాణా సేవలందించే ఈ గొప్ప సంస్థలో వైస్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు’అని అదనపు డీజీపీ, టీజీఎస్‌ఆర్టీసీ మాజీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. తాను 2021, సెప్టెంబర్‌ మూడో తేదీన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేశారు. అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేండ్లకు పైగా ఈ బాధ్యతల్లో కొనసాగానని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించే నాటికి సంస్థ చాలా కష్టకాలంలో ఉందని పేర్కొన్నారు.

ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ గూడుకట్టుకుని ఉందని తెలిపారు. అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మేథోమథన సదస్సులను జరిపి ప్రతి ఉద్యోగినీ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. అందరి మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చామని వివరించారు. పాత వస్సుల స్థానంలో కొత్త బస్సులను తెచ్చి ఏడాదికి రూ.తొమ్మిది వేల కోట్లకుపైగా రాబడి సాధించామని తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీన జీతాలిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులునాన 2017కు సంబంధించిన 21 శాం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు ఇచ్చామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను దశల వారీగా చెల్లించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా రోజుకు సగటున 35 మంది మహిళలు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీని తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశామని తెలిపారు.

ఆర్టీసీ బస్సులో సజ్జనార్‌ ప్రయాణం
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా తన చివరిరోజున వీసీ సజ్జనార్‌ ప్రజారవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయా ణికుడిలా లక్డికాపూల్‌-టెలిఫోన్‌ భవన్‌ బస్టాండ్‌ నుంచి బస్‌భవన్‌ వరకు 113ఐ/ ఎం రూట్‌ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్‌ ద్దారా కండక్టర్‌ వద్ద టికెట్‌ను తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు.

ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ
టీజీఎస్‌ఆర్టీసీ నూతన వైస్‌ చైర్మెన్‌, ఎండీగా వై నాగిరెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. బస్‌ భవన్‌లోని ఎండీ ఛాంబర్‌లో మాజీ ఎండీ వీసీ సజ్జనార్‌ నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -