ఈసారి కథ రాస్తే కుక్కలపై రాయాలని నారాయణ చాలా రోజులుగా అనుకుంటున్నాడు. కూచొని కథ రాయడం మొదలుపెట్టాడు సిస్టంలో.
వీధికుక్కల సమావేశం జరుగుతోంది. వాటికి పెద్దదిక్కుగా ఉన్న కుక్క లేచి ఇలా అంది ”తాము తరతరాలుగా స్నేహంగా, ఒకే కుటుంబంలా ఉన్న సంగతి మరచిపోయి మనుషులు మనల్ని పట్టించుకునే స్థితిలో లేరు. కొన్ని వేల సంవత్సరాలుగా వారికి ఎన్నో విధాలా సహాయం చేస్తున్నాం, పదివేల సంవత్సరాలకు పైగా కుటుంబసభ్యుల్లా ఉన్నాం. ఇప్పుడు మనది కుక్క బతుకైపోయింది” అంది కుక్కల్ని అన్న పదాన్ని ఒత్తిపలుకుతూ. పక్క వీధుల్లోని కుక్కల్ని వేటాడే ఇంకో జాగిలం లేచి ”వారు సాటి మనుషులనే పట్టించుకునే స్థితిలోనే లేరు ఇక కుక్కల్ని ఎవరు చూసేది” అని నిట్టూర్చింది. ”ఇండ్లలో జూలు కుక్కల్ని, పెద్ద పెద్ద బలిష్టమైన కుక్కల్ని చూస్తున్నారా? అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో? మనమూ ఉన్నాం అనాధల్లా…. వాటి తిండి, వాటి సోకులు చూశారా” నిట్టూర్చింది మరో శునకం. ”మటన్ షాపు కాడ కుక్కలా ఎదురుచూస్తుంటాడు అని నా మీద డైలాగు వేయడానికి అని జాతిరత్నాలులో ఒక పాత్ర అంటుంది. మనం అంతగా దిగజారిపోయాం ఈ మనుషుల దృష్టిలో, అసలు దేవదాసు సినిమా ఏ భాషలో తీసినా మన బంధువు ఎవరో ఒకరు దాంట్లో నటించాల్సిందే తెలుసా అనింది సినిమాలు చూసే ఓ కుక్క.. బక్కచిక్కిన ఓ సభ్యురాలు లేచి ”మన అడవి బంధువులు చూశారా, ఎనిమిది మంది కలిస్తే చాలు పెద్ద ఏనుగునైనా కింద పడేసి చంపేస్తాయి. చూడడానికి సన్నగా ఉన్నా పౌరుషానికి పెట్టింది పేరు అవి” అని ప్రేరేపించింది తనవంతుగా.
పర్యావరణ పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మానవులు అడవులు, చెట్లు నాటడాలు, నదుల పరిరక్షణ గురించే మాట్లాడుతారు కాని అదే పర్యావరణంలో జంతువులు కూడా ఉన్నాయని మరుస్తున్నారు. జంతువుల్లో ముఖ్యమైన మనం లేకుండా మనుషుల అభివృద్ధే లేదు అనింది మనుషుల్ని బాగా గమనించే ఓ శునకరాజం. ఇంతలో ఓ కాలభైరవుడ ిలాంటి టెర్రరిస్టు భైరవుడు లేచి మనుషులపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ”మిత్రులారా ఇక సహించకూడదు, మానవులపై పగతీర్చుకోవాలి. మనమంటే మనుషులకెంత భయమో మనకూ వాళ్లంటే అంతే భయం. అయితే చిన్నపిల్లల్ని, ముసలివారిని ఒంటరిగా చూస్తే మాత్రం వదలకండి. వారిని బాగా కరవండి. ఈమధ్య మన బంధువులు చాలామంది మనుషుల్ని పొట్టనపెట్టుకోవడం చూశారు కదా. మనమూ అలాగే చేయడం కరెక్టు. ఈ విషయంపై తీర్మానం చేస్తున్నాను” అనింది సమావేశంలో.
కలలోనుండి లేచినట్టు నారాయణ ఉలిక్కిపడి లేచాడు. తమ చిన్న మనవరాలు, అమ్మా, నాన్నా ఎక్కడున్నారో అని ఇల్లంతా వెదికి వాళ్లు క్షేమంగా ఉన్నారని ఊపిరి తీసుకున్నాడు. నారాయణ భార్య లక్ష్మి అడిగింది ఎందుకలా కంగారుగా ఉన్నారని. ఇప్పుడే కథలో కుక్కలన్నీ సమావేశమై ఎలాంటి మాటలు మాట్లాడుకుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుందీ చెప్పాడు భార్యతో. కథ రాస్తున్నారంతే కదా ఎందుకు భయపడతారని ధైర్యం చెప్పింది. లేదు లక్ష్మి ఈమధ్య వీధి కుక్కల్ని, వాటి పైన జరుగుతున్న చర్చల్ని చూసి నేనూ ఏదైనా రాయాలని కథ రాస్తుంటే అనుకోకుండా ఇలా వచ్చింది. ఇందులో నిజమూ ఉంది కదా అన్నాడు నారాయణ.
****
సీనియర్ సాహితీవేత్త నాగేశ్వరయ్య గారు వీధి కుక్కలకు ఆహారం, చికెన్ బిర్యానీలు పెట్టే విషయం కోర్టులదాకా పోవడం, సంచలనంగా మారడం చూసి నాకొక వీడియో పంపారు. దీనిమీద ఏదైనా రాయండని సలహా కూడా ఇచ్చారు. కుక్కలకు చికెన్ బిర్యానీ పెట్టడం మనం చూశాం. ఆ వార్తపై వివిధ వ్యక్తుల అభిప్రాయాలూ చూశాం. అది అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్లింది. వీధికుక్కలకు ఆహారం పెట్టే పనైతే మీ ఇండ్లకు తీసుకొనిపోయి పెట్టండి అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిజంగా మనుషుల బాధ్యతను గుర్తుచేసింది న్యాయస్థానం.
మానవుల మొదటి మిత్ర జంతువుగా కుక్కను పరిగణిస్తుంటారు. కుక్క తొందరగా మచ్చికవ్వడమే కాదు ఎంతో విశ్వాసం కల జంతువు కూడా. కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదని తిట్లు తినేవాళ్లూ ఉన్నారు, తిట్టే వాళ్లూ ఉన్నారు. బర్రెలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, తరువాత వ్యవసాయానికి రవాణాకు ఉపయోగంలోకి వచ్చాయి. అన్నట్టు గాడిదలు కూడా మనుషులకు మిత్రులే వాటికి కోపం రావచ్చునేమోనని ప్రత్యేకంగా రాయవలసి వచ్చింది. గాడిద మీద కథలు, నవలలు అంటే మనకు రచయిత కిషన్ చందర్ గుర్తొస్తారు. గాడిద ఆత్తకథ ద్వారా అప్పటి సమాజాన్ని ఏకిపారేశారాయన. అలాగే కుక్కలపై కూడా రాయవలసిన సమయమొచ్చింది.
ఏ విషయంలోనైనా చట్టాలను అమలు పరుస్తున్నారా లేదా అని చూసుకునే అధికారం, హక్కు, బాధ్యత ప్రజల మీద ఉంటుంది. కాని అది ప్రజలకు తెలియదు. ఈ వీధి కుక్కల విషయంలోనూ అదే జరుగుతోంది. వీధికుక్కల సమ్రక్షణ, వాటి ఆరోగ్యం, వ్యాక్సిన్లు వేయడం ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలు వీటిని ఎంతవరకు చేస్తున్నాయో ప్రజలే చూడాలి. ఆ పని ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలదని అనుకోకూడదు. ఇక వీధి కుక్కలకు ఆహారం, చికెన్ బిర్యానీలు పెట్టే విషయం తీసుకొని విమర్శించే జనాలూ ఉన్నారు మనలోనే. ఉదయం లేచినప్పటినుండి తాను తన కుటుంబం గురించి మాత్రమే చూసుకునే మనుషులు సాటి మనుషులకు కొన్ని సదుపాయాలు, సబ్సిడీలు కల్పించినా సహించలేరు. ఉచిత పథకాలు వద్దంటే వద్దంటారు. పెద్ద పెద్దవాళ్లకు ఇచ్చే సదుపాయాల్ని, వారు బ్యాంకులకు ఎగ్గొట్టే అప్పులు వీళ్లకు కానరావు. మనుషులందరినీ సమానంగా చూసుకునే రోజులే ఇంకా రాలేదు. ఇక వీధుల్లో తిరిగే గ్రామ సింహాల్ని ఈ ప్రపంచం సరిగా చూస్తుందా? అది మరో ప్రపంచంలోనే సాధ్యమేమో మరి.
జంధ్యాల రఘుబాబు
9849753298
నేను… గ్రామసింహాన్ని…!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES