వాళ్లు ఫ్యాంటు విప్పమన్నారు
నేను మనసు విప్పి చూశాను..
నీది, ఏ మతమని అడిగారు?
అప్పుడే తెలిసిపోయింది!
వారు ఏ మతస్తులూ కాదని..
భూమ్మీద అర్హతలేని మనుషులని,
వాళ్లకేవాదం లేదు, నరమేధం తప్ప!
తుపాకీ వాదానికి మతం ఉందంటే
మనిషన్న వాడెవడూ నమ్మడు
నువ్వు హిందువా? ముస్లిమా?
అని అడిగినపుడే,
నువ్వు మనిషివా, జంతువా?
అని, అడగాలనిపించింది..
నేను మనిషినని నాకు తెలుసు
వాడు మృగమని వాడికీ తెలుసు
అందుకే తుపాకీ గర్జించింది..
నా కుటుంబం ఆక్రోశించింది!
గుండె చెప్పలేనంత బాధతో రగిలింది
ఏ పాపం చేశామని
వారిని, అడగాలనిపించింది?
కొండలే గుండెలు బాదుకొనేలా
మంచే మండిపోయేలా
ఆరిపోయాయి జీవితాలు..
మానవత్వం నిస్సిగ్గుగా దాక్కుంది!
వెతికి తీసుకురావాలి
విచారించి వివరాలడగాలి..
ప్రాణాలు తీసినా సమానత్వమే
మా మతసామరస్యమని చాటిచెప్పాలి…
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253