Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిట్‌ విచారణకు హాజరవుతా

సిట్‌ విచారణకు హాజరవుతా

- Advertisement -

మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి సిట్‌ తనకు ఇచ్చిన నోటీస్‌పై బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ స్పందించారు. మంగళవారం సిట్‌ కార్యాలయానికి వెళ్తాననీ, విచారణకు సహకరిస్తానని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తాననీ, పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు… ప్రతీకార పాలన : వేముల ప్రశాంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదనీ, పగ, ప్రతీకార పాలన అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. కమిషన్లు, సిట్‌ల పేరుతో పోలీసులను అడ్డం పెట్టుకుని కేసీఆర్‌ కుటుంబాన్ని వేధించడమే ఈ ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా మారిందని తెలిపారు. కక్షసాధింపు రాజకీయాలు చేసే రేవంత్‌రెడ్డికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఖండన
మాజీఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సిట్‌ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగమే ఈ నోటీసులని తెలిపారు.

టీవీ సీరియల్‌ను తలపిస్తున్న నోటీసులు : దేవీప్రసాద్‌
మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడం టీవీ సీరియల్‌ను తలపిస్తోందని కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ జి దేవీప్రసాద్‌ తెలిపారు. బొగ్గు గనుల కుంభకోణంలో లోతుగా ఇరుక్కుపోయిన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి సిట్‌ విచారణను ఉపయోగించుకోవడం వ్యవస్థలను నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల్లో బాధ్యులైన ముఖ్య అధికారులను విచారించకుండా ఎలాంటి సంబంధాల్లేని కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు సంతోష్‌ కుమార్‌కు నోటీసులివ్వడం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని తెలిపారు.

రాజకీయ కుట్రలో భాగమే నోటీసులు : పల్లె రవి, కిశోర్‌గౌడ్‌
రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సిట్‌ నోటీసులను పోలీసులు జారీ చేశారని కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కిశోర్‌గౌడ్‌ తెలిపారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నైని బొగ్గు కుంభకోణం బయటపెట్టగానే హరీశ్‌రావుకు, బొగ్గు కుంభకోణం గురించి చెప్పగానే కేటీఆర్‌కు సిట్‌ నోటీసులను జారీ చేసిందని వివరించారు. నోటీసులకు, కేసులకు, బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ నాయకులు భయపడబోరనీ, దీన్ని రాజకీయంగానే ఎదుర్కొంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -