Wednesday, April 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ను నాశనం చేస్తా

ఇరాన్‌ను నాశనం చేస్తా

- Advertisement -

‘హార్ముజ్‌’ను తెరవాల్సిందే : ట్రంప్‌ హెచ్చరిక
– ఖర్గ్‌ సహా ఇరాన్‌ వ్యాప్తంగా దాడులు ముమ్మరం
– వంతెనలు, రైల్వే మార్గాలు, ఎయిర్‌పోర్టుపై దాడులు
– తాజా దాడుల్లో 18మంది మృతి
– మేమూ రెఢీ : ఇరాన్‌
– విద్యుత్‌ ప్లాంట్ల చుట్టూ మానవ హారాలు
టెహ్రాన్‌ :
తమ డిమాండ్లను ఆమోదించకుండా పెడచెవిన పెట్టిన నేపథ్య ంలో ఇరాన్‌ నాగరికతను ఒక్క రాత్రిలో నాశనం చేస్తామని బెదిరించారు. ”ఈ రాత్రికే మొత్తం నాగరికత అంతరిస్తుంది. తిరిగి దానిని ఎన్నటికీ పునరుద్ధరించలేం. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా జరగవచ్చు.” అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. అంతకుమించి ఆయన వివరాలివ్వలేదు. కానీ, ఇరాన్‌ వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు, ఇతర పౌర సదుపాయాలే ఇక తమ లక్ష్యాలుగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే హెచ్చరించారు.

వరుస దాడులు
కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా హార్ముజ్‌ జలసంధిని తెరవాలని లేదంటే ఇరాన్‌ వినాశనం తప్పదని అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన గడువు ముగియడానికి కొద్దిగంటలే మిగిలివున్న వేళ మంగళవారం ఇరాన్‌ వ్యాప్తంగా పలు మౌలిక వసతులు, కీలక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు వరుసగా వార్తలు అందుతున్నాయి. అలాగే ఇరాన్‌ ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన ఖర్గ్‌ ద్వీపంలోని పలు మిలటరీ లక్ష్యాలపై కూడా అమెరికా దాడులు జరిపింది. గుర్తు తెలియని అమెరికా సీనియర్‌ అధికారిని ఉటంకిస్తూ మంగళవారం యాక్సిస్‌ వార్తా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. అలాగే టెహ్రాన్‌కు దక్షిణంగా, ఇరాన్‌ నగరమైన క్వామ్స్‌కు సమీపంలో గల వంతెనపై కూడా దాడులు జరిగాయని ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. కొద్ది నిమిషాల క్రితమే క్వామ్స్‌ కమ్యూనికేషన్‌ లైన్లకు సంబంధించిన వంతెనల్లో ఒక దానిపై దాడి జరిగిందని గవర్నర్‌ మోర్తెజా హైదరి తెలిపారు. అలాగే ఇరాన్‌లోని అల్బొరాజ్‌ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక దాడుల్లో 18మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖొరామాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా కూడా దాడులు జరిగాయని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలు అందాల్సి వుందని పేర్కొంది. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమంతో సంబంధమున్న మిలటరీ స్థావరమైన పర్చిన్‌కు సమీపంలోని ప్రాంతాలపై, టెహ్రాన్‌కు నట్టనడిబొడ్డున గల కొన్ని పాయింట్లపై దాడులు జరిగాయి. క్రూయిజ్‌ క్షిపణి ఒక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న వీడియో ఒకటి బాగా వైరల్‌ అయింది. టెహ్రాన్‌లోని యూదు ప్రార్ధనా మందిరం ఒకటి ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్‌ మెహర్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్‌పై వరుసగా వైమానిక దాడులతో దండెత్తామని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. అంతర్జాతీయ మధ్యవర్తుల నుంచి కాల్పుల విరమణకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ట్రంప్‌ ప్రకటించిన వెంటనే ఈ దాడులు ముమ్మరమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఐడీఎఫ్‌ దాడులను ముగించిందని, టెహ్రాన్‌లోని తీవ్రవాద మౌలిక వసతులను నాశనం చేశామని ఇజ్రాయిల్‌ మిలటరీ తన అధికారిక టెలిగ్రామ్‌ చానెల్‌లో పేర్కొంది. ఇరాన్‌ వ్యాప్తంగా డజన్ల సంఖ్యలో మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని విస్తారంగా దాడులు పూర్తి చేసినట్టు తెలిపింది. అయితే ఏ ఏ స్థావరాలు, ఇతరత్రా వివరాలను వెల్లడించలేదు. ఈ దాడులతో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. రికార్డు స్థాయిలో బారెల్‌ ధర 116 డాలర్లకు చేరింది. ఇరాన్‌ యుద్ధం అమెరికా అగ్ర నాయకత్వాన్ని స్తంభింపజేసిందని ఇటలీ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. కాగా యుద్ధాన్ని నిలుపు చేసేందుకు పాకిస్తాన్‌ చేస్తున సానుకూల ప్రయత్నాలు, కీలకమైన దశకు చేరుకున్నాయని పాకిస్తాన్‌లో ఇరాన్‌ రాయబారి రెజా అమిరి మొఘాదమ్‌ వ్యాఖ్యానించారు.

రైళ్ళలో ప్రయాణిస్తే ప్రాణాలకు ముప్పు తప్పదు : ఇజ్రాయిల్‌
ఇరాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9గంటల వరకు రైళ్ళలో ప్రయాణాలు చేయవద్దని ఇరాన్‌ ప్రజలను ఇజ్రాయిల్‌ మిలటరీ హెచ్చరించింది. రైళ్ళకు, రైల్వే లైన్లకు సమీపంలో ఉన్నట్లైతే ప్రాణాలకు ముప్పు తప్పదని స్పష్టం చేసింది. అయితే ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు తమ లక్ష్యాలనే వివరాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ కూడా అప్రమత్తమైంది. దేశంలోని మాసాద్‌ ఏరియా వ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి.

దక్షిణ లెబనాన్‌లో బలగాల మోహరింపు
దక్షిణ లెబనాన్‌లో డిఫెన్స్‌ లైన్‌ పొడవునా తమ బలగాల మోహరింపు పూర్తయిందని ఇజ్రాయిల్‌ మిలటరీ మంగళవారం ప్రకటించింది. అయితే ఎక్కడ, ఎంతమంది అనే వివరాలు ఇవ్వలేదు. లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకువెళ్ళేలా ఎంత దగ్గరలో బలగాలను మోహరించిందనే సమాచారం స్పష్టంగా ఇవ్వలేదు. ఈ దశలో ఐడీఎఫ్‌ సైనికులు తమ యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి వ్యవస్థలతో సర్వం మోహరించి వున్నారని మిలటరీ ప్రకటన పేర్కొంది.

రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఎవరు చెప్పారు?
జర్నలిస్టులను నిలదీసిన ట్రంప్‌..చెప్పకుంటే జైలుకేనని బెదిరింపు

యుద్ధంలో ఆచూకీ తెలియకుండా పోయిన పైలట్‌ కోసం జరిపిన రెస్క్యూ ఆపరేషన్‌ను తమ ప్రభుత్వంలోని వారే లీక్‌ చేశారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. అతనో ‘మచ్చ’ లాంటి వాడని, అతనిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇరాన్‌లో చిక్కుబడిపోయిన పైలట్‌ కోసం అమెరికా జరిపిన రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఆయన సోమవారం విలేకరులతో ముచ్చటించారు. ఆచూకీ తెలియకుండా పోయిన వైమానిక దళ అధికారి కోసం జరిపిన గాలింపు చర్యల గురించి ముందుగా వార్తను అందించిన పాత్రికేయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమాచారాన్ని ఇచ్చిన

రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఎవరు చెప్పారు?
వారి పేరును బయటపెట్టని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ‘గాలింపు చర్యల గురించి సమాచారం ఇచ్చిన వారి పేరు చెప్పండి. లేకుంటే జైలు తప్పదు. అది కూడా త్వరలోనే’ అని అన్నారు. అయితే జర్నలిస్టు పేరు కానీ, వార్తను అందించిన మీడియా సంస్థ పేరును కానీ ఆయన చెప్పలేదు. కాగా ఘటనపై న్యూయార్క్‌ టైమ్స్‌, ఫ్యాక్స్‌ న్యూస్‌, ఆక్సియాన్‌లు ముందుగా వార్తలు ఇచ్చాయి. కీలక సమాచారంపై ఉప్పందడంతో ఇరాన్‌ దళాలు అప్రమత్త మయ్యాయని ట్రంప్‌ వాపోయారు.

ఐఆర్‌జీసీ హెచ్చరిక
అమెరికా గనుక లక్ష్మణ రేఖను ఉల్లంఘిస్తే ప్రతిస్పందన పశ్చిమాసియా ప్రాంతాలను దాటి ఉంటుందని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) మంగళవారం పొరుగు దేశాలను హెచ్చరించింది. తమ సహనం కూడా నశించిందని, అమెరికా, ఇజ్రాయిల్‌ సహా వాటి మిత్రదేశాలపై దాడులు చేస్తామని ప్రకటించింది.

విద్యుత్‌ ప్లాంట్ల చుట్టూ మానవ హారాలు
విద్యుత్‌ ప్లాట్లు, వంతెనలు సహా మౌలిక వసతులే తమ దాడులకు లక్ష్యాలుగా ఉంటాయని ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో విద్యుత్‌ ప్లాంట్లను కాపాడుకునేందుకు దానిచుట్టూ మానవ హారాలు నిర్మించాల్సిందిగా ఇరాన్‌, యువతను కోరింది.

శాంతియుత పరిష్కారమే ఏకైక మార్గం
‘విద్యుత్‌ ప్లాంట్లు సహా ప్రజానీకం వినియోగించే మౌలిక సదుపాయాలపై దాడులు జరగకూడదు. సైనికపరమైన లక్ష్యం పరిధిలోకి వచ్చే పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులు చేయకూడదని అంతర్జాతీయ మానవతా చట్టాలు చెబుతున్నాయి. ఎందుకంటే అలాంటి వాటిపై దాడులు జరిగితే, సాధారణ పౌరులకు తీవ్ర నష్టం జరిగే ముప్పు ఉంటుంది. అందుకే ట్రంప్‌ హెచ్చరికపై ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళనగా ఉన్నారు. పశ్చిమాసియా సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే తీవ్రస్థాయికి చేరాయని, ఇక యుద్ధాన్ని ఆపేయాలని ఆయన పిలుపునిస్తు న్నారు. అంతర్జా తీయ వివాదాలకు శాంతియుత పరిష్కారం మినహా మరే అత్యుత్తమ ప్రత్యామ్నా యం లేదు అనేది ఐరాస చీఫ్‌ అబి óప్రాయం’ అని అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డ్యుజారిక్‌ తెలిపారు.

యుద్ధ నేరాలను కోర్టులే నిర్ణయిస్తాయి
విద్యుత్‌ ప్లాంట్లు సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం యుద్ధ నేరమని ఐరాస చీఫ్‌ భావిస్తున్నారా ? అని స్టీఫెన్‌ డ్యుజారిక్‌ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, అలాంటి దాడులు కచ్చితంగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ తరహా అటాక్స్‌ యుద్ధ నేరమా ? కాదా ? అనేది కోర్టులు నిర్ణయిస్తాయని తేల్చి చెప్పారు.

డెడ్‌లైన్‌పై ట్రంప్‌ చర్చోపచర్చలు
ట్రంప్‌ విధించిన డెడ్‌లైన్‌ ఇంకొన్ని గంటల్లో ముగియబోతున్న తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐరాస చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మరోపక్క ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్‌ను ట్రంప్‌ పొడిగించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు దేశాల మధ్య వర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలు జరుగుతున్నం దున, డెడ్‌లైన్‌ను పొడిగించే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. హార్ముజ్‌ జలసంధిని తెరవడంతో పాటు శుద్ధి చేసిన యురేనియంను అప్పగించేందుకు ఇరాన్‌ అంగీకరిస్తేనే కాల్పుల విరమణకు ఓకే చెప్పాలని అమెరికాను సౌదీ అరేబియా, యూఏఈ పాలకులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌ డెడ్‌లైన్‌పై తదుపరిగా ఏం చేయాలనే దానిపై తన ప్రభుత్వంలోని సన్నిహితులు, విశ్వసనీయులతో ట్రంప్‌ చర్చోపచర్చలు జరుపుతున్నట్టు సమాచారం. చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ధీటుగా బదులిచ్చిన ఇరాన్‌
ట్రంప్‌ బెదిరింపులకు ఇరాన్‌ ధీటుగా బదులిచ్చింది. తమ జోలికి వస్తే తడాఖా చూపుతామని స్పష్టంచేసింది. తమ వద్ద 15వేల క్షిపణులు, 45 వేల డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించింది. దేశంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమే! అమెరికా గడువు సమీపిస్తున్న వేళ : ఇరాన్‌ అధ్యక్షుడు
పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు కోటి 40లక్షల మంది ఇరాన్‌ ప్రజలు అవసరమైతే ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాతృభూమి రక్షణ కోసం కావాలంటే స్వచ్ఛందంగా ప్రాణాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -