బీసీసీఐతో విరాట్ కోహ్లి
భారత టెస్టు జట్టులో పెను మార్పులు చూడబోతున్నామా?. ఐదు రోజుల ఆటకే అందం తీసుకొచ్చిన అసమాన ఆటగాడు విరాట్ కోహ్లి. రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మూడు రోజుల్లోనే విరాట్ కోహ్లి సైతం మనసులోని మాటను భారత క్రికెట్ బోర్డుకు తెలిపినట్టు సమాచారం. టెస్టుల నుంచి తప్పుకుంటానని బోర్డుకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే, ప్రపంచ టెస్టు క్రికెట్‌కు కచ్చితంగా ఎదురుదెబ్బే!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
టెస్టుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్థాంతరంగా వీడ్కోలు పలికాడు. వరుస గాయాల సమస్యతో జశ్‌ప్రీత్ బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సెలక్షన్ కమిటీ ససేమిరా. ఈ సమయంలో టెస్టుల్లో కొత్త కెప్టెన్‌ను ఎంచుకునే పనిలో పడిన బీసీసీఐకి విరాట్ కోహ్లి గట్టి షాకిచ్చాడు!. ఐదు రోజుల ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని బీసీసీఐతో విరాట్ కోహ్లి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి సహా సెలక్షన్ కమిటీ డైలామాలో పడినట్టు సమాచారం. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా.. త్వరలోనే సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. టెస్టు జట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. రోహిత్ వీడ్కోలుతో ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తలు రాగా.. కోహ్లి ఏకంగా టెస్టు క్రికెట్‌కే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు.
14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్
టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లికి తిరుగులేని గణాంకాలు ఉన్నాయి. 14 ఏండ్లుగా అసమాన ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 68 టెస్టులకు కోహ్లి నాయకత్వం వహించాడు. కరోనా మహమ్మారి తర్వాతి కాలంలో కోహ్లి కాస్త తడబాటుకు గురయ్యాడు. వెస్టిండీస్‌పై 2023 జులైలో సెంచరీ సాధించిన కోహ్లి మళ్లీ 2024 నవంబర్‌లో ఆసీస్‌పై పెర్త్‌లో వంద కొట్టాడు. గత రెండేండ్లలో కోహ్లి టెస్టు సగటు 32.56 మాత్రమే. దీనికి తోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో భారత క్రికెట్ పెద్దలు ఇటీవల భవిష్యత్ ప్రణాళికలు, కెరీర్ కొనసాగింపులపై మాట్లాడినట్టు సమాచారం. విరాట్ కోహ్లి నిర్ణయం వెనుక ఈ ప్రభావం సైతం ఉండే అవకాశం లేకపోలేదు.
టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే యోచనను శనివారం ఉదయమే బీసీసీఐకి ఓ ఈమెయిల్ ద్వారా కోహ్లి తెలిపినట్టు బోర్డు వర్గాల సమాచారం. 68 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్సీ వహించిన కోహ్లి 40 టెస్టుల్లో విజయాలు సాధించాడు. భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన సారథిగా కోహ్లి కొనసాగుతున్నాడు. ఎం.ఎస్ ధోని (20/60), సౌరవ్ గంగూలీ (21/49) కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మకు తోడు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలకటం.. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు సెలక్షన్ కమిటీ ప్రణాళికల్లో లేకపోవటం సహా మహ్మద్ షమి ఫామ్ ఇంగ్లాండ్ పర్యటనలో భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న అంశాలు. ఈ సమయంలో విరాట్ కోహ్లి జట్టుకు దూరమైతే టీమ్ ఇండియా కోలుకోవటం కష్టమే.
పునరాలోచన చేయండి
విరాట్ కోహ్లి ఈమెయిల్‌పై అప్రమత్తమైన బీసీసీఐ.. వీడ్కోలు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలని సూచించింది. విరాట్ కోహ్లితో మాట్లాడి ఒప్పించేందుకు భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిని బోర్డు సంప్రదించినట్టు తెలుస్తోంది. కుదిరితే ఈ ఏడాది టెస్టు సీజన్ లేదంటే కనీసం ఇంగ్లాండ్ పర్యటన వరకు వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లిని బోర్డు కోరుతుంది. విరాట్ కోహ్లి మనసు మార్చుకోకుంటే.. టెస్టు క్రికెట్‌కు కింగ్ దూరమైనట్టే!.