Friday, October 17, 2025
E-PAPER
Homeమానవిఎంపికలో తొందరపడను

ఎంపికలో తొందరపడను

- Advertisement -

పరిచయం అవసరం లేని మంచి నటి కీర్తి సురేష్‌. మలయాళీ అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తారు. తెలుగులో దాదాపు 17 చిత్రాలలో నటించారు. సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రలో నటించి ఆ మహానటినే మైమరిపించారు. పాత్రల విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగేయడమే ఈమె విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇటు గ్లామర్‌ పాత్రలతో పాటు అటు మహిళా ప్రాధాన్యం కలిగిన చిత్రాలతో దక్షిణాదిలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మానవిలో ఆమె పరిచయం…

కీర్తీ సురేష్‌ 1992 అక్టోబర్‌ 17న కేరళలోని తిరువనంత పురంలో పుట్టారు. తల్లి మేనక అయ్యం గార్‌, తండ్రి సురేష్‌ కుమార్‌. ఈమెకి ఒక అక్క ఉన్నారు. తండ్రి నిర్మాత కాగా, తల్లి నటి. చెన్నైలో నాలుగవ తరగతి వరకు విద్యనభ్యసించి, ఆ తర్వాత కేరళలోని పట్టమ్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు కీర్తి. తిరిగి చెన్నైకి వచ్చి పెర్ల్‌ అకాడమీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

తండ్రి మాటను గౌరవించి
బాలనటిగా 2000లో పైలట్స్‌ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 2001లో ఆచనేయనేనిక్కిష్టం, 2002లో కుబేరన్‌ చిత్రాలలో నటించి ఆ తర్వాత చదువు కోసం కొన్నేండ్లు సినిమాలకు విరామం ఇచ్చారు. దీనికి కారణం వాళ్ల నాన్న చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటే ముందు ఏదైనా డిగ్రీ పూర్తిచేయమని షరతు పెట్టారు. తండ్రి మాటను గౌరవించి నటనపై ఉన్న ఆసక్తితో ఆమె ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కోర్సు పూర్తి చేశారు. ఒక దశాబ్దం తర్వాత తిరిగి చిత్ర రంగానికి అడుగుపెట్టారు. 2013లో ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఆమె నటనకు 2014లో ఉత్తమ మహిళ అరంగేట్రం, మలయాళం ఉత్తమ నటిగా ఆసియానెట్‌ ఫిల్మ్‌ అవార్డును గెలుచుకున్నారు.

వరుస ఆఫర్లు
2015లో ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఇదు ఎన్న మాయం’ తో తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ వద్ద విజయాన్ని సాధించలేకపోయినా, ఆమె నటనకు 2016లో ఉత్తమ మహిళా అరంగేట్రం, తమిళం, ఎడిషన్‌ అవార్డు పురస్కారాలు అందుకున్నారు. ఇక తెలుగు చిత్రం పరిశ్రమలోకి రామ్‌ హీరోగా నటించిన ‘నేను శైలజ’ అనే సినిమాతో అడుగు పెట్టారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో తెలుగులో వరుస ఆఫర్లు అందుకున్నారు. ఆ తర్వాత నాని, పవన్‌ కళ్యాణ్‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

తొందరపడకుండా
‘చిత్ర పరిశ్రమలో నేను ఇంకా ఎంతో దూరం ప్రయాణించవలసి వుంది. కానీ దాని కోసం వరుసగా సినిమాల్ని ఎంచుకుంటూ తొందరపడాలను కోవట్లేదు’ అంటూ తన కెరీర్‌ పట్ల ఎంతో క్లారిటీగా ఉన్నారు ఈ మలయాళ ముద్దుగుమ్మ. కీర్తీ సురేష్‌ కెరియర్లో మహానటి సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. సావిత్రి జీవిత గాథతో తెరకెక్కిన ఈ సినిమా అనేక ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ జీవించిందని చెప్పవచ్చు. అందంతోనే కాకుండా తన అభినయంతోనే నూటికి నూరు మార్పులు కొట్టేసిన కీర్తి సురేష్‌ ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.

ఉత్తేజకరమైన అధ్యాయం
దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బాలివుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు. గతేడాది ‘బేబీ జాన్‌’ సినిమాలో నటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్‌లో మరో ఉత్తేజకరమైన అధ్యాయం. నన్ను సవాలు చేసే పాత్రలు, కథల కోసం బాలీ వుడ్‌లోకి కూడా అడుగు పెట్టాను. ఇక్కడ పని చేసే విధానం, వారి సంస్కృతి కొత్తగా ఉన్నాయి. వాటన్నింటి గురించి తెలుసుకుంటూ… కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా’ అంటూ పంచుకున్నారు.

పదిహేనేండ్ల ప్రేమ
కీర్తీ గత ఏడాది తన చిన్న నాటి స్నేహితుడైనా ఆంటోనీ తట్టిల్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ‘మా ఇద్దరి మతాలు వేరూ, ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను. అందుకే చాలా ఆలస్యంగా చెప్పాను కానీ చెప్పిన తర్వాత మా నాన్న చాలా కూల్‌గా ఒప్పుకున్నారు. నీకు ఇష్టమైతే మాకు ఓకే అన్నారు. మాది 15 ఏండ్ల ప్రేమ. అయితే ఫస్ట్‌ కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. కానీ గట్టిగా నిలబడ్డాం. అంటే మాది నిజమైన ప్రేమ అని నాకు అర్థం అయ్యింది. కీర్తీ పెండ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. త్వరలో ‘రౌడీ జనార్థన్‌’ చిత్రంలో నటించబోతున్నారు.

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -