సిక్సర్లు బాదటంపై ముకుల్ చౌదరి
కోల్‌కతా : ముకుల్ చౌదరిని క్రికెటర్‌ను చేయాలని అతడి తండ్రి ఆశయం. ముకుల్ చౌదరి తండ్రి స్వప్నం సాకారం చేయటంతో పాటు ఐపీఎల్‌లో సరికొత్త ప్రకంపనలు సృష్టించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 27 బంతుల్లోనే 54 పరుగులు బాదిన ముకుల్ చౌదరి లక్నో సూపర్‌జెయింట్స్‌కు అసమాన విజయాన్ని కట్టబెట్టాడు. ‘హెలికాఫ్టర్ షాట్‌ను చిన్నప్పటి నుంచి సాధన చేశాను. ధోని ఇన్నింగ్స్‌ను ముగించే తీరు ఎంతో ఇష్టం. యార్కర్ వేసినా.. సిక్సర్ బాదితే బౌలర్ ఇంకేదో ఆలోచన చేస్తాడు.
నా శరీరం కాస్త దృడమైనది. అందుకే బలంగా సిక్సర్లు కొట్టగలను. ప్రతి రోజు ప్రాక్టీస్‌లో 100-150 సిక్స్‌లు కొడతాను. గత 5-6 నెలలుగా ఎంతో సాధన చేస్తున్నాను. ఈ రోజు మ్యాచ్‌లో ఆ సాధన ప్రతిబింబించింది’ అని ముకుల్ చౌదరి తెలిపాడు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ముకుల్ చౌదరి బ్యాట్ ఝులిపించాడు. రాజస్తాన్ తరఫున ఢిల్లీపై 26 బంతుల్లోనే 62 పరుగులు బాదాడు. అందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. గురువారం నైట్‌రైడర్స్‌పై ముకల్ ఏడు సిక్స్‌లు సంధించటం విశేషం.



