Thursday, October 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా

- Advertisement -

లక్షలాది మంది ప్రాణాలు కాపాడా
పోరు ఆపకుంటే వాణిజ్య ఒప్పందం చేసుకోనని హెచ్చరించా
యుద్ధంలో ఏడు కొత్త విమానాలు కూలిపోయాయి
టోక్యో వ్యాపారవేత్తల విందు సమావేశంలో ట్రంప్‌
బలమైన నాయకుడంటూ ప్రధాని మోడీపై ప్రశంసలు


టోక్యో : మేలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య తానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పునరుద్ఘాటించారు. జపాన్‌ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో జరిగిన విందు సమావేశంలో ట్రంప్‌ మంగళవారం ప్రసంగిస్తూ వాణిజ్య పరమైన ఒత్తిడి ద్వారా రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించానని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయన ఓ బలమైన, ప్రశంసనీయమైన వ్యక్తి అని కొనియాడారు. ‘భారత్‌, పాకిస్తాన్‌ వైపు చూడండి. నేను భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుం టున్నాను. నాకు మోడీ అంటే గొప్ప గౌరవం, ప్రేమ’ అని ట్రంప్‌ తెలిపారు. పరస్పరం పోరాడుతుంటే వ్యాపారం చేయబోనని భారత్‌, పాకిస్తాన్‌ నాయకత్వాలకు చెప్పానని అన్నారు. ‘మీరు పాకిస్తాన్‌తో పోరాడుతున్నారు కాబట్టి ఇక నుంచి మీతో వ్యాపారం చేయనని ప్రధాని మోడీకి చెప్పాను. ఆ తర్వాత పాకిస్తాన్‌ ప్రధానికి ఫోన్‌ చేశాను. మీరు భారత్‌తో పోరాడుతున్నారు కాబట్టి మీతో ఒప్పందం కుదుర్చుకోలేనని అన్నాను’ అని వివరించారు.

250 శాతం సుంకాలు విధిస్తానని తాను హెచ్చరించిన 48 గంటల్లోగా శత్రుత్వానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు. భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధంలో ఏడు కొత్త, అందమైన విమానాలు కూలిపోయాయని అంటూ తను జోక్యం లక్షలాది ప్రాణాలను కాపాడిందని తెలిపారు. అయితే కూలిపోయిన విమానాలు ఏ దేశానికి చెందినవో ఆయన చెప్పలేదు.అమెరికాతో వాణిజ్యం నెరపడానికి, యుద్ధానికి సంబంధం లేదని భారత్‌, పాకిస్తాన్‌ వాదించాయని ట్రంప్‌ అన్నారు. ‘ఒక దానికి మరో దానితో సంబంధం లేదని వారు చెప్పారు. అయితే ఉంటుందని నేను అన్నాను. అవి రెండూ అణ్వస్త్ర దేశాలు. ఆ అణ్వాయుధాల దుమ్ము అంతటా పడుతుంది. అందరి పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి యుద్ధాన్ని కొనసాగిస్తే మీతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనని నేను చెప్పాను. అంతే… యుద్ధం అగిపోయింది. అది అద్భుతం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. భారత్‌- పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, రెండు దేశాల మధ్య కాల్పుల విర మణ ఒప్పందం కుదరడానికి తానే కారకుడినని ట్రంప్‌ చెప్పుకోవడం ఇది మొదటిసారి కాదు. మే 10వ తేదీ నుంచీ ఆయన ఇదే పాట పాడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -