– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నవతెలంగాణ – కామారెడ్డి
ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్‌పైనే ధ్యాస ఉంటే, తనకు మాత్రం అభివృద్ధే లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం కోసం గతంలోనే 120 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను పట్టణానికి తీసుకొచ్చానని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ నీటి వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్లీ కామారెడ్డికి తాగునీటి కష్టాలు తెచ్చిందని విమర్శించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమృత్ పథకం కింద రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. దీని ద్వారా రాబోయే 25 సంవత్సరాల వరకు కామారెడ్డి పట్టణానికి తాగునీటి సమస్యలు ఉండవని భరోసా ఇచ్చారు.
తాను ఎప్పుడూ పేరు కోసం పనిచేయలేదని, ప్రజల కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రోటోకాల్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డిపై ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే సహకారం కోరినా స్పందన లేదని, అభివృద్ధి కంటే ప్రోటోకాల్‌పైనే ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉందని ఆరోపించారు. అభివృద్ధి జరుగుతున్న 14 గ్రామాలపై విజిలెన్స్ విచారణకు ఫిర్యాదు చేయడం అదే వైఖరికి నిదర్శనమని అన్నారు. అధికారులు శంకుస్థాపనల కోసం సమయం అడిగితే మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నానని చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, ఆయన నియోజకవర్గం కొడంగల్‌కు ఇచ్చే నిధుల్లో కనీసం సగం అయినా కామారెడ్డికి ఇవ్వాలని కోరానని, దానికి సీఎం సానుకూలంగా స్పందించి కొడంగల్‌తో సమానంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ వెల్లడించారు.
ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయన్నారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని రూ.9 కోట్లతో ఆధునీకరించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డుకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.26 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. 15వ వార్డులో రూ.1.35 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులకు ఈరోజు ప్రారంభం ఇచ్చామని వెల్లడించారు. ఇక్కడ ప్రజలు మాజీ సీఎం కేసీఆర్‌ను ఓడించారు, ప్రస్తుత సీఎంను మూడో స్థానంలో నిలిపారు. అయినా కామారెడ్డి అభివృద్ధి ఆగదన్నారు. శిలాఫలకాలు వేయనివ్వకపోయినా, అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేసి తీరుతా” అని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ, తన సొంత గడ్డ అయిన కామారెడ్డి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని షబ్బీర్ అలీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు పండ్లరాజు, బీబీపేట్ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, లోయపల్లి నర్సింగరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్ నాయక్, రానా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.



