Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేనే గెలిచా.. నేనే సర్పంచ్‌ని..

నేనే గెలిచా.. నేనే సర్పంచ్‌ని..

- Advertisement -

– ఒక్క ఓటుతో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి ఫ్లెక్సీలు
– నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురంలో ఘటన
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ప్రజాస్వామ్యబద్ధంగా నేనే గెలిచా.. అధికార పార్టీ వారు అధికార దుర్వినియోగం చేసి ప్రకటించుకున్న గెలుపు గెలుపు కాదు.. గ్రామానికి సర్పంచ్‌ నేనే అంటూ.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి జంగిలి అనిత సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గెలిచిన వార్డు సభ్యుల ఫొటోలతో కలిపి పెట్టిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బీఆర్‌ఎస్‌ నాయకులపై ఒత్తిడి తేవడంతో ఘర్షణ వాతావరణ ఏర్పడింది. పోలీసులు గ్రామానికి చేరుకొని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఉపసర్పంచ్‌గా ఉన్న జంగిలి అనిత వద్ద మాజీ ఉపసర్పంచ్‌ అని ఫ్లెక్సీలో స్టిక్కర్లు అంటించారు. దాంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది.

అసలు ఎన్నికల్లో ఏం జరిగింది..
నార్కట్‌పల్లి మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్ననారాయణపురం గ్రామపంచాయతీ ఒకప్పుడు రెండు ఆవాస గ్రామాలతో కలిపి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనుగుల దోరి, కొండపాకనిగూడెం ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత చిన్ననారాయణపురం గ్రామపంచాయతీలో 516 ఓట్లు.. 8 వార్డులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి మెరుగు అనిత, బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిగా గతంలో ఉపసర్పంచ్‌గా ఉన్న జంగిలి అనిత బరిలో నిలిచారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 506 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ బలపరిచిన ఐదుగురు వార్డు సభ్యులు, గెలుపొందారు. ఇద్దరు సర్పంచ్‌ అభ్యర్థులకు సమానంగా 246 ఓట్ల చొప్పున వచ్చాయి. టాస్‌ వేయగా జంగిలి అనిత గెలుపొందారు. రీ కౌంటింగ్‌ పెట్టాలని మెరుగు అనిత పట్టుపట్టడంతో అధికారులు మళ్లీ లెక్కించారు. ఈ క్రమంలో రీకౌంటింగ్‌ ప్రక్రియలో మెరుగు అనిత ఒక్క ఓటుతో గెలిచినట్టు పోలింగ్‌ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇది ఒప్పుకునేది లేదని జంగిలి అనిత అనుచరులు అనడంతో.. ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు మెరుగు అనితనే గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. ఓటమిని అంగీకరించేది లేదని జంగిలి అనిత హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఫిర్యాదు హైకోర్టులో ఉంది. అయినప్పటికీ ”ప్రజలు మాకే పట్టం కట్టారు.. గ్రామానికి నేనే సర్పంచ్‌ని.. జంగిలి అనిత అనే నేను.. ప్రమాణస్వీకారం చేస్తున్నాను” అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గ్రామంలో కలకలం సృష్టించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -