Saturday, December 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎవరినీ వదలా !

ఎవరినీ వదలా !

- Advertisement -

ఇంటల్లుడి ఫోన్‌ ట్యాప్‌ చేయడానికి సిగ్గు లేదా?
నేను గాంధీ తాతను కాను….ఒకటి కొడితే రెండు కొడుతా
వ్యాపారులకు సహకరించడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందే
బీఆర్‌ఎస్‌ నేతల వెనుకున్న గుంటనక్కపై ఈడీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తా : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన జోలికొచ్చినా… తన భర్త జోలికొచ్చినా ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌ నేతలను హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటల్లుడి ఫోన్‌ ట్యాప్‌ చేయడానికి సిగ్గు లేదా? అని కేటీఆర్‌, హరీశ్‌రావులను ప్రశ్నించారు. తానేమీ గాంధీ తాతను కాదనీ, ఒకటి కొడితే రెండు కొడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం బాటకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటుంటే ఓర్వలేక నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టిన వారి కండ్లు ఇంకా చల్లబడలేదని భావోద్వేగానికి గురయ్యారు.

తామెప్పుడూ బీఆర్‌ఎస్‌ మాదిరిగా జనాల నుంచి డబ్బులు వసూళ్లు చేయలేదని అన్నారు. తాను ఉద్యమంలో కొనసాగాననీ, తన భర్త వ్యాపారంతో ఇల్లు గడిచిందని చెప్పారు. ఇసుమంత కూడా అక్రమాలు చేయలేదని స్పష్టం చేశారు. జనంబాట పట్టిన తనకు కాంగ్రెస్‌తో దోస్తానీ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని ఆమె ఖండించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దొందూ దొందేననీ, వ్యాపారులకు సహకరించడంలో గులాబీ బాటలోనే హస్తం పార్టీ నడుస్తున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ వేసిన దొంగ దారులను కాంగ్రెస్‌ రహదారులుగా మారుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పన్నెండేండ్లలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో తనకెప్పుడు సహకారం దొరకలేదనీ, నిజామాబాద్‌ ఎంపీగా తాను ఢిల్లీలో పోరాడుతుంటే, హైదరాబాద్‌ వారు దందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. తాను టాస్‌ మాత్రమే వేశాననీ, దానికే ఆందోళన పడితే ఎలా? అసలు టెస్ట్‌ మ్యాచ్‌ ముందుందని కవిత వార్నింగ్‌ ఇచ్చారు.

పారిశ్రామిక భూముల కోసం రాయితీతో ఇచ్చిన ప్రభుత్వ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టేందుకు బీఆర్‌ఎస్‌ కిటీకీలు తెరిస్తే, కాంగ్రెస్‌ ఏకంగా తలుపులే తెరిచిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్‌లో కేటీఆర్‌ మంత్రిత్వశాఖ నుంచి హడావుడిగా ఐదెకరాల పారిశ్రామిక భూమిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే బంధువైన వ్యాపారికి కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ వచ్చాక మిగిలిన ఆరెకరాల భూమిని అదే వ్యాపారికి అప్పగించారని చెప్పారు. కృష్ణారావు కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న నిర్మాణ కంపెనీలో 70 ఎకరాల్లో వెంచర్‌ చేపట్టి ప్రభుత్వ రోడ్డు, అసైన్డ్‌ భూములు, చెరువును కబ్జా చేశారని ఆరోపించారు. 2022లో పదెకరాలున్న చెరువు కాస్తా ఆరెకరాలకు తగ్గిందనీ, మిగిలిన నాలుగెకరాలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చెరువుల సుందరీకరణ పేరుతో ప్రయివేటుకు అప్పగిస్తే కొన్ని మినహా మిగిలినవి పలువురు వ్యక్తులు కబ్జా చేసుకున్నారని చెప్పారు. కృష్ణారావు, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిలు నిరాధార ఆరోపణలు చేయడం వెనుక ఉన్న గుంట నక్క తనకు తెలుసని హెచ్చరించారు.

అవినీతి, అక్రమాలపై కేసీఆరే చెప్పాలి
బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి కేసీఆర్‌కు తెలిసి జరిగిందా? లేక తెలియకుంటా జరిగిందా? అనే విషయాలు కేసీఆరే చెప్పాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కవిత బదులిచ్చారు.

సీఎం అవుతా…అప్పుడు చెబుతా
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కవిత హెచ్చరించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక 2014 నుంచి జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తానని తెలిపారు.

లీగల్‌ నోటీసులు
తనపై భర్త అనిల్‌ కుమార్‌ పై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డితో పాటు టీ న్యూస్‌కు లీగల్‌ నోటీసులు ఇప్పించినట్టు తెలిపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -