ఆలోచన

ideaనేను, నా అనే స్వార్థం మనిషిలో ఉన్నన్ని రోజులు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మేము, మనం అనే ఆలోచన పెరగాలి. ఎందుకంటే మనం ఈ రోజు సంతోషంగా ఉన్నామంటే సమాజం మనకు కల్పించిన సౌకర్యాల ఫలితమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. అందుకే సమాజం గురించి కూడా ఆలోచించాలి. మన చుట్టూ వున్న వ్యక్తులు బాధపడుతుంటే మనం సంతోషంగా ఉండడం అసాధ్యం.
ఒక ఐడియా(ఆలోచన) మన జీవితాన్నే మార్చేస్తుంది. ఆలోచనే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మన ఆలోచనలు ఎలా ఉంటే మనం చేసే పనులు, మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. అయితే ఆలోచన ఎలా పుడుతుంది? ఎవరికైనా మెదడు నుండే కదా! మన మనసు సంతోషంగా ఉంటే మన మెదడు ఉల్లాసంగా ఉంటుంది. అప్పుడు మనం చేసే ఆలోచనలు కూడా ఉత్సాహంగా ఉంటాయి. మనసు చిరాగ్గా ఉంటే మెదడూ చిరాగ్గా ఉంటుంది. చేసే ఆలోచనలు కూడా చిరాగ్గా ఉంటాయి. మన చుట్టూ నిరుత్సాహ వాతావరణం ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మనం చేసే ఏ ఆలోచనకైనా కారణం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే.
మనిషి ఆలోచనలు వారి జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. అందుకే ఎప్పుడూ మన ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచనా విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సానుకూల ఆలోచనలు మనల్ని మానసికంగా బలంగా ఉంచుతాయి. ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
అయితే పాజిటివ్‌ థింకింగ్‌ చేయడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలు మనల్ని భయపెడుతున్నాయి. ఇష్టమైన తిండి తినడానికి భయపడుతున్నాం. నచ్చిన బట్ట కట్టుకునేందుకు భయపడుతున్నాం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నాం. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయంలో బతుకుతున్నాం. ఇన్ని చికాకులు మెదడు నిండా ఉంటే ఇక సానుకూల ఆలోచనలు ఎలా వస్తాయి? అయితే ఈ భయాలన్నింటిని తరిమి కొట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. ఆ బాధ్యత కూడా మనదే. అది కూడా మన ఆలోచనల బట్టే ఉంటుంది.
నేను, నా అనే స్వార్థం మనిషిలో ఉన్నన్ని రోజులు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మేము, మనం అనే ఆలోచన పెరగాలి. ఎందుకంటే మనం ఈ రోజు సంతోషంగా ఉన్నామంటే సమాజం మనకు కల్పించిన సౌకర్యాల ఫలితమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. అందుకే సమాజం గురించి కూడా ఆలోచించాలి. మన చుట్టూ వున్న వ్యక్తులు బాధపడుతుంటే మనం సంతోషంగా ఉండడం అసాధ్యం. పక్కవారు బాధపడుతున్నా సంతోషంగా ఉన్నామంటే మనం ఉన్మాదులమని అర్థం.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. వారంతా తమ గురించే ఆలోచించుకుంటే ఈ రోజు మనం ఇలా స్వేచ్ఛావాయువులు పీల్చగలిగేవారం కాదు. తాము మరణించినా భావి తరాలు హాయిగా జీవించాలని వారు బలంగా కోరుకున్నారు. ఎన్ని ప్రాణాలు పోతున్నా స్వాతంత్య్రం వచ్చి తీరుతుందనే సానుకూల ఆలోచనతో త్యాగాలు చేశారు. చివరికి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి కనుమరుగయ్యారు. అలాంటి వారి ఆలోచనల్ని కదా మనం ఆదర్శంగా తీసుకోవల్సింది. వారి ఆలోచనలను కొనసాగించాల్సింది మనమే కదా! మనలోని కృతజ్ఞతా భావం కూడా మన ఆలోచనలను మెరుగుపరుస్తుంది. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి మీకు సహాయపడుతున్న ప్రతి విషయానికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పండి. కష్టాలు, అడ్డంకులు జీవితంలో ఒక భాగం. కనుక మన సమస్యలపై దృష్టి పెడదాం. సరైన ఆలోచనలతో వాటిని పరిష్కరించుకుందాం.

Spread the love