Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంఆదర్శప్రాయం !

ఆదర్శప్రాయం !

- Advertisement -

అత్యధిక ఆదాయార్జనలో ఒకటిగా నిలిచిన కేరళ
అంతర్జాతీయ సదస్సలో అమర్త్యా సేన్‌ కితాబు
కేరళపై మణిశంకర్‌ అయ్యర్‌ ప్రశంసలు

తిరువనంతపురం : అధిక ఆదాయం ఆర్జించే రాష్ట్రాల్లో ఒకటిగా కేరళ పరివర్తన చెందిందని ప్రముఖ నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్‌ అమర్త్యా సేన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘విజన్‌ 2031’ అంతర్జాతీయ సమావేశంలో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఆయన, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతా రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించడమనేది రాష్ట్ర అభివృద్ధి దార్శనికతకు గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. దారిద్య్ర నిర్మూలన, జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయంలో దేశానికి కేరళ ఒక నమూనాగా మారిందని అన్నారు. ”1957లో తొలిసారి ఎన్నికల సమయంలోని ఉద్విగత నాకు ఇంకా గుర్తుంది.

కేరళలోని వామపక్ష రాజకీయాలు ప్రజలను సాంప్రదాయ విరుద్ధమైన, భిన్నమైన పంథాలో ముందుకు నడిపించగలవా? లేదా అనే విషయమై కాలేజీ స్ట్రీట్‌లో కాఫీ హౌస్‌లో ఆనాడు ముమ్మరంగా చర్చలు జరిగేవి. ఆనాడు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన కేరళకు అభివృద్ధికి అవసరమైన నిధులు అందుబాటులో వుండవని నాతో చాలామంది వాదించేవారు. కానీ ఈనాడు, కేరళ ప్రతీ రంగంలోనూ అగ్ర భాగాన నిలిచింది. ఆ పాత వారందరికీ ఉచితంగా కాఫీ కొనేందుకు నేను సిద్ధంగా వున్నాను. కేరళ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి నా భావనలు, ఆలోచనలు తప్పు కాలేదు.” అని అమర్త్యాసేన్‌ పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితులు క్షీణించినప్పటికీ కేరళలో లౌకిక వాదానికి ఎలాంటి సవాళ్ళు లేవని అన్నారు.

దేశంలో చాలా ప్రాంతాల్లో లౌకిక విలువలు దాడులకు గురవుతున్నాయన్నారు. కానీ కేరళ అందించే ప్రజాస్వామ్య చైతన్యం మనకు గొప్ప ఆశను కలిగిస్తోంది. వ్యవస్థీకృతమైన, సంకుచిత రాజకీయాలను ఎలా ప్రతిఘటిస్తుందనే అంశంపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి వుంటుందన్నారు. శతాబ్దాల క్రితమే మహిళల స్వేచ్ఛ, హక్కులు వంటి విషయాల్లో కేరళ అత్యున్నత ప్రమాణాలు అందుకుందని యావత్‌ ప్రపంచం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లోని విజ్ఞానాన్ని, సంస్కృతులను స్వాగతించడం ద్వారా కేరళ, భారత్‌కు ఒక గేట్‌వేగా పనిచేస్తోందన్నారు. కేరళ యొక్క అసలైన గుర్తింపులో లౌకికవాదం, బహుళవాదం ఒక భాగమని అమర్త్యాసేన్‌ వ్యాఖ్యానించారు.

రికార్డు స్థాయిలో పర్యాటకులు
గతేడాదిలో కేరళకు అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేసారు. దీంతో పర్యాటక రంగంలో కేరళ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కొజికోడ్‌లో పర్యాటక శాఖ మంత్రి పి.ఎ.మహ్మద్‌ రియాజ్‌ విలేకర్లతో మాట్లాడుతూ, తాజా అధికార గణాంకాలను వెల్లడించారు. 2025లో మొత్తంగా 2.58కోట్ల మంది అతిథులు రాష్ట్రానికి విచ్చేశారన్నారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 2.29 కోట్లుగా వుందన్నారు. అంటే 12.46శాతం మంది పెరిగారన్నారు. కోవిడ్‌ ముందు నాటి స్థాయిలో పోల్చుకుంటే దేశీయ పర్యాటకుల సంఖ్య 36.3శాతం పెరిగిందన్నారు. గతేడాది 8,21,999మంది విదేశీ అతిథులు కేరళను సందర్శించారన్నారు. ఇది, గతేడాదితో పోలిస్తే 11.3శాతం ఎక్కువన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -