Wednesday, February 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎక్కడ వెనుకబడ్డామో గుర్తించండి

ఎక్కడ వెనుకబడ్డామో గుర్తించండి

- Advertisement -

అసంతృప్త నేతలను బుజ్జగించండి
రోజువారీ రిపోర్టు ఇవ్వండి : ‘పురపోరు’పై మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి
నేడు మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‘మన పార్టీ ఏయే మున్సిపాల్టీల్లో వెనుకబడి ఉందనే విషయాన్ని వెంటనే గుర్తించండి, అక్కడ వెంటనే రంగంలోకి దిగండి, బలోపేతానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి…’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రులు, మున్సిపల్‌ ఎన్నికల బాధ్యులను ఆదేశించారు. టిక్కెట్‌ రాలేదని అలకబూనిన అసంతృప్త నేతలను బుజ్జగించాలని ఆయన వారికి సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏరోజుకారోజు రిపోర్టును తనకు అందజేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాల్టీలకు బాధ్యులుగా ఉన్న మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. జిల్లాల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

అయితే పీసీసీ చీఫ్‌కు వారు ఇదే విషయమై సమాచారమిచ్చారు. సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… పలు సర్వేల ప్రకారం పార్టీ వెనుకబడి ఉన్న మున్సిపాల్టీల్లోని పరిస్థితులపై విశ్లేషించారు. తనతోపాటు మంత్రులు ఆయా ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు పర్యటించాలనే విషయాలపై ఆయన వారితో చర్చించారు. కాంగ్రెస్‌ వీక్‌గా ఉన్న జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలంటూ బాధ్యులకు సూచించారు. విబేధాలను పక్కనబెట్టి అందరూ సమిష్టిగా పని చేయాలని, ఓట్లు చీలకుండా చూడాలని కోరారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో పని చేయటం ద్వారా కచ్చితంగా అన్ని స్థానాల్లోనూ పార్టీని గెలిపించాలంటూ దిశా నిర్దేశం చేశారు. ఈ బాధ్యత కచ్చితంగా పార్లమెంటు నియోజకవర్గ బాధ్యులదేనని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిపోయేంత వరకు ఇన్‌ఛార్జిలందరూ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉండి మానిటరింగ్‌ చేయాలంటూ సీఎం ఈ సందర్భంగా ఆదేశించినట్టు సమాచారం. ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్‌తోపాటు వార్‌ రూమ్‌ దృష్టికి తీసుకురావాలంటూ ఆయన సూచించినట్టు తెలిసింది.

సీఎంకు అభినందనలు
హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్‌లో లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల పూర్తి చేసిన సంగతి విదితమే. సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకురాగా మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌కుమార్‌తోపాటు మంత్రులందరూ సీఎంను అభినందించారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం ఆయన పర్యటిస్తారు. రూ.200 కోట్లతో అక్కడ ఏర్పాటు చేయనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన చేస్తారు. మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

90 శాతం స్థానాల్లో గెలుస్తాం : మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
భేటీ అనంతరం పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… పార్టీ తరపున పోటీ చేయబోయే 90 శాతం మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశామని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎవరితోనూ పోటీ లేదని, తమకు తామే పోటీ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం, సీపీఐ(ఎం), సీపీఐ, జన సమితి పార్టీలతో పొత్తులుంటాయని చెప్పారు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో తప్ప తమ పార్టీకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేవని స్పష్టం చేశారు. గద్వాల నేతల మధ్యనున్న సమస్యలను పరిష్కరించామని, జగిత్యాలకు సంబంధించి సీనియర్‌ నేత జీవన్‌రెడ్డితో చర్చిస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -