బత్తుల హైమావతి… ఓ సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉద్యమమంటే తెలియకుండా పెరిగారు. కానీ పోరాట వీరుడుని పెండ్లి చేసుకున్నారు. భర్తను కోల్పోయినా.. పేదల కోసం ఆయన చూపిన బాటలోనే నడిచారు. మామూలు గృహిణి నుండి అంచలంచలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐద్వాకు మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఐలమ్మ ట్రస్ట్ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నారు. జనవరి 25 నుండి 28 వరకు జరగబోయే ఐద్వా అఖిల భారత మహాసభలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నందుకు గర్వపడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఐద్వా చేపట్టిన ఉద్యమాలు, సాధించిన విజయాలను మానవి పాఠకులతో పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత సమస్యలు మరింత పెరిగాయి. 2015లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఆదాయం కోసం గ్రామంలో చీప్‌లిక్కర్ ప్రారంభించాలనే కుట్ర పన్నింది. అయితే అప్పటికే గ్రామాల్లో తాగుడుకు బానిసైన మగవాళ్లు మహిళలను హింసిస్తున్నారు. కుటుంబాలను పోషించుకోలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చీప్‌లిక్కర్ వస్తే పరిస్థితి మరింత దారుణమవుతుంది. ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి ఐద్వా ఆధ్వర్యంలో అప్పటి పది జిల్లాలలో పన్నెండు రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టాము. పత్రికల్లో మంచి ప్రచారం జరిగింది. అది చూసిన మహిళలు ఎక్కడికక్కడ బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికారు. అలాగే హైదరాబాద్‌లో జరిగిన ముంగిపు సభకు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళల్లోని ఈ వ్యతిరేకతను చూసి భయపడ్డ ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఐద్వాగా మేము సాధించిన గొప్ప విజయం ఇది.
ఆస్పత్రుల్లో సౌకర్యాలకై…
2016 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక బాలింత మరణాలు బాగా ఉండేవి. విపరీతమైన అవినీతి. ఆ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐద్వా ఆధ్వర్యంలో సుమారు 6 నెలల పాటు 375 ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి సర్వే చేశాము. ఉదయాన్నే అక్కడకు వెళ్లి సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడటంతో పాటు రోగులతో కూడా మాట్లాడే వాళ్లం. మారుమూల ప్రాంతాలలోని చెంచుపెంటలకు సైతం వెళ్లాం. మా సర్వేలో భయంకరమైన సమస్యలు బయటకు వచ్చాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు కూడా పెట్టాం. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమయింది. మేము గుర్తించిన సమస్యలపై పత్రికల ద్వారా ప్రచారం చేశాం. అవి చూసి అధికారులు స్పందించి కొన్ని సౌకర్యాలు కల్పించారు. కొంత బడ్జెట్ కూడా కేటాయించారు. మా పోరాటం తర్వాతనే బేబీ కిట్‌లు కూడా అందించడం మొదలుపెట్టారు. ఇది ఐద్వా పోరాట ఫలితమే అని చెప్పుకోవచ్చు.
ఒంటరి మహిళలకు అండగా…
2016లోనే ఒంటరి మహిళల సమస్యలపై ఓ పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీరికి రెండు వందలు మాత్రమే పెన్షన్ ఉండేది. కనీసం రెండు వేలు ఇవ్వాలని డిమాండ్‌తో సదస్సులు పెట్టాం. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేలకు పెంచారు. అయితే ఇది అందరికీ వర్తించడం లేదు. భర్త చనిపోయి డెత్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకే ఇచ్చేవారు. అలా కాకుండా భర్త వదిలేసిన వాళ్లు, ప్రేమ పేరుతో మోసపోయిన మహిళలు ఎంతో మంది ఒంటరిగా కుటుంబాలను పోషిస్తున్నారు. వీరికి కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. దీనిపై సర్వే చేస్తే రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది ఒంటరి మహిళలు ఉన్నట్టు తేలింది. ఐద్వా పోరాటల ఫలితంగా మూడు లక్షల యాభై వేల మందికి పెన్షన్ శాన్షన్ చేశారు. అయితే ఇంకా అందాల్సిన వాళ్లు కూడా ఉన్నారు.
డ్వాక్రా మహిళ సమస్యలపై…
ఉపాధి కల్పనపై కూడా ఓ సదస్సు నిర్వహించాం. చాలా జిల్లాలలోని యువ మహిళలు తమ భర్తలు చిన్న చిన్న పనులకు వెళితే బయట పనులు దొరక్క వీళ్లు ఇంట్లో ఉండేవారు. అటువంటి వారికి చిన్నతరహా పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశాం. దాంతో ప్రభుత్వం తరపున అక్కడక్కడ పరిశీలించి వచ్చారు కానీ అమలు చేయలేదు. అయితే కొంత వరకు డ్వాక్రా మహిళలకు మాత్రం కల్పించారు. అలాగే అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులను పట్టించుకోలేదు. ముఖ్యంగా అభయహస్తం అనే స్కీమ్ ఉండేది. నెలకు 250 రూపాయలు కడితే అరవై ఏండ్లు నిండిన తర్వాత సభ్యురాలికి పెన్షన్ ఇస్తామన్నారు. కానీ ఇది ఆచరణలో అమలు కాలేదు. దీనికి సంబంధించిన సమాచారం సేకరిస్తే పేద మహిళల డబ్బు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో మూలుగుతుంది. ఆ డబ్బు వెనక్కైనా ఇవ్వాలి, పెన్షన్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశాం. దీనిపై పెద్ద జిల్లాలలో పోరాటాలు చేశాం. కొన్ని చోట్ల డబ్బు వెనక్కి ఇచ్చారు.
మిడ్డే మీల్స్ కార్మికుల కోసం…
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కూడా ఐద్వా పని చేసింది. అప్పట్లో వండిపెట్టే గ్రూపులను తరచూ తొలగించే వాళ్లు. దీని వల్ల గ్రామాలలో రకరకా ల సమస్యలు వచ్చేవి, గొడవలు జరిగేవి. ఇలా తొలగించడాన్ని వెనక్కు తీసుకోవాలని, నెలకు రెండు వేలు జీతం ఇవ్వాలని పోరాటం చేశాం. తర్వాత సీఐటీయూతో కలిసి కూడా ఎన్నో పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితంగా గ్రూపులను తొలగించే ప్రక్రియలను నిలిపివేశారు. జీతం కూడా కొంత పెంచుకోగలిగాం. అలాగే మధ్యాహ్న భోజన బడ్జెట్ కూడా కొంత వరకు పెంచుకోగలిగాం.
హాస్టల్ సమస్యలపై
ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలోని బాలికల హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో సర్వేలు చేశాం. అమ్మాయిలు దారుణమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసిన పెచ్చులు ఊడిపోయే సీలింగ్స్, ప్రహరి గోడలులేని పాత భవనాలు. ఇక మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అమ్మాయిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మంచినీటి సౌకర్యం లేదు. పరిశుభ్రతైతే అసలే లేదు. వీటిపై మంత్రులను అనేక సార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు కట్టించగలిగాం.
ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. దీని ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు ఆరేడు జిల్లాల్లో కుటుంబ న్యాయ సలహా కేంద్రాలు నడిపిస్తున్నాం. చాలా మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండేండ్లుగా అమ్మాయిలకు ఉచితంగా కరాటే నేర్పిస్తున్నాము. గత ఏడాది 12 మంది అమ్మాయిలకు బ్లాక్ బెల్ట్ కూడా ఇప్పించాం. అలాగే ఓ జిల్లాలో మల్లు స్వరాజ్యం పేరుతో కుట్టు సెంటర్ కూడా నడిపిస్తున్నారు. అలాగే బస్తీలలో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించాము. ఇలా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
భూ పోరాటంలో…
ఇండ్లస్థలాల కోసం కూడా ఐద్వా పెద్దఎత్తున పోరాటాలు చేసింది. వరంగల్, జనగాం, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు వేసుకున్న గుడిసెలను ప్రభుత్వం పీకేస్తుంటే వాళ్లకు అండగా నిలబడ్డాం. ఈ పోరాటంలో ఐద్వా కార్యకర్తలు జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం చాలా మంది తాము వేసుకున్న గుడిసెల్లోనే జీవిస్తున్నారు. వీరిలో కూడా చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూంలు ఇవ్వకపోతే వెంటనే మంజూరు చేయాలని పోరాటం చేశాం. కొన్ని చోట్ల విజయం సాధించాం.
పాలకుల యాయలో పడొద్దు
ప్రస్తుతం మహిళలు ఉపాధి దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఆర్ధిక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లింగ వివక్షపై కూడా పోరాడాలి. గతంలో ఏ సమస్య వచ్చినా మహిళలు పెద్ద ఎత్తున పోరాటంలోకి వచ్చే వారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్లో పోరాడే శక్తిని అణిచివేస్తున్నారు. వారి గొంతు నొక్కేసేందుకు భక్తివైపుకు మళ్లిస్తున్నారు. మనువాదం పేరుతో తిరిగి ఇంటికే పరిమితం చేయాలని చూస్తున్నారు. మహిళలంతా పాలకుల మాయలోపడిపోకుండా పోరాటం చేయాలి. ఐద్వా ఇలాంటి కృషే నిత్యం చేస్తుంది. రేపు హైదరాబాద్‌లో జరగబోయే అఖిల భారత మహాసభల్లో కూడా ఇదే కర్తవ్యాన్ని తీసుకోబోతున్నారు. మహిళలంతా ఏకమై ఐద్వా జెండా కింద ఉద్యమించాలి. అప్పుడే రక్షణ లభిస్తుంది. – సలీమ
– సలీమ



