బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు తప్పదు : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒక మున్సిపాల్టీని గెలిస్తే ఆ ఒక్క సీటును కాంగ్రెస్ లాక్కుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం, అడిగేవారు ఉండకూడదా? అని ఆమె ప్రశ్నించారు. అలాంటి వెగటు రాజకీయాలు చేసే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందనీ, ఆ బాటలో వెళితే ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ 287 జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జీవో 33 ప్రకారం బంజారాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ జీవితాన్ని పాఠ్యాంశంగా దేశ వ్యాప్తంగా పుస్తకాల్లో పెట్టాలనీ, గోర్ భోళి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని ఆమె కోరారు.
గ్రామ పంచాయితీలుగా మారిన తండాల్లో సరైన వసతుల కల్పనకు రూ.25 లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీలో బంజారాలకు 5 సీట్లు అనడంలో హేతుబద్ధత లేదని ఆమె కొట్టిపారేశారు. బంజారాలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణ పెట్టేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ఆ రెండు వర్గాల హక్కుల కోసం తాము పోరాడుతున్నామని ఆమె తెలిపారు. రెండేండ్లలో జరిగిన అడ్మిషన్లు, ప్రమోషన్లు, ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరారు. సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదనీ, ఇహలోకం ఎలా జీవించాలో బోధించారని ఆమె గుర్తుచేశారు. సేవాలాల్ పేరుతో, ఆదివాసీల పేరుతో, ఎరుకల తెగ పేరుతో ఏర్పాటు చేస్తామన్న మూడు కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వేడుకల్లో బంజారా ఆధ్యాత్మిక గురువులు పలువురు పాల్గొన్నారు.



