Friday, January 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా దాడి చేస్తే..

అమెరికా దాడి చేస్తే..

- Advertisement -

టెల్‌అవీవ్‌పై విరుచుకుపడతాం : ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌ : అమెరికా కనుక తమపై దాడి చేస్తే అందుకు ప్రతిగా టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడతామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ అధిపతి అలీ ఖమేనీ సలహాదారుడు, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీషంఖనీ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘దాడి పరిమితంగా ఉంటుందన్నది ఊహాగానమే. అమెరికా నుంచి కానీ, ఎవరి నుంచైనా కానీ, ఏ స్థాయిలో అయినా కానీ సైనిక చర్య జరిగితే యుద్ధం మొదలైందని భావిస్తాం. తక్షణమే స్పందిస్తాం. అది సమగ్రంగా ఉంటుంది. ముందు వెనుకలు ఉండవు. దురాక్రమణ దారుడే లక్ష్యంగా ఉంటుంది. టెల్‌ అవీవ్‌ పైన, దాని మద్దతుదారుల పైన విరుచుకు పడతాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా దళాలు ఏ క్షణాన అయినా దాడి చేయవచ్చునని వార్తలు వస్తున్న నేపథ్యంలో షంఖనీ ఈ హెచ్చరికలు చేశారు.

తమపై దాడి జరిగితే దాని వెనుక ఉన్న వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని విధంగా వెంటనే స్పందిస్తామని ఆయన గత నెలలోనే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అమెరికా దాడికి ప్రతిగా ఇజ్రాయిల్‌పై దాడి తప్పదని ఇరాన్‌ ఎప్పటి నుంచో చెబుతోంది. ఇదిలా వుండగా తమ అణు కార్యక్రమంపై కొత్తగా ఒప్పందం కుదిరే అవకాశాలను ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తోసిపుచ్చడం లేదు. ‘దాడి చేస్తే ప్రతి దాడికి సిద్ధం. సాహసోపేతులైన మా సాయుధ దళాలు ట్రిగ్గర్‌పై వేలు ఉంచి సిద్ధంగా ఉన్నాయి. మేము ఎంతగానో ప్రేమిస్తున్న భూమి, ఆకాశం, సముద్రంపై దురాక్రమణకు పాల్పడితే తక్షణమే శక్తి వంతమైన స్పందన తెలియజేస్తాం’ అని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో పరస్పర ప్రయోజనకరమైన, న్యాయమైన అణు ఒప్పందాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఆ ఒప్పందం శాంతియుత అణు సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇరాన్‌ హక్కును గౌరవించేదిగా, అణ్వా యుధాలను విడనాడతామన్న గ్యారంటీ ఇచ్చేదిగా ఉండాలని సూచించారు.

టెహ్రాన్‌పై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి : రష్యా
టెహ్రాన్‌పై అమెరికా దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రష్యా హెచ్చరించింది. పశ్చిమాసియా అంతటా గందరగోళానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా-ఇరాన్‌లు చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని రష్యా సూచించింది. అయితే ఇరాన్‌ అణ్వాయుధాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని లేకుంటే అమెరికా దాడి చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్‌ గురువారం స్పందించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యల్ని పరిష్కరించడానికి అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. బలప్రయోగాన్ని మానుకోవాలని మేము పిలుపునిస్తూనే ఉన్నాము. చర్చల విధానాలపైనే దృష్టి పెట్టాలి. బలవంతపు చర్యలు ఈ ప్రాంతంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను అస్థిరపరిచేస్తే చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు చేసినప్పటి నుండి రష్యాతో ఆదేశం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుంది. గత సంవత్సరం రష్యా, ఇరాన్‌లు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -