Tuesday, February 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదు

అమెరికా దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదు

- Advertisement -

యూరోప్‌ సైన్యాలను ‘ఉగ్రవాద సంస్థలు’గా ప్రకటించిన ఇరాన్‌
– మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళ బలగాల పెంపు
– చర్చలకు సిద్ధమంటూనే ఇరు దేశాల నుంచి కఠిన చర్యలు

టెహ్రాన్‌ : అమెరికా దాడి చేస్తే పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం) మొత్తం యుద్ధ ముప్పులోకి జారుతుందని ఇరాన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావటం గమనార్హం. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినందుకు ప్రతీకారంగా యూరోప్‌ దేశాల సైన్యాలను కూడా ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది.
ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై చర్యలు తీసుకునే అవకాశాన్ని పలు మార్లు ప్రస్తావించిన నేపథ్యంలో అమెరికా మధ్యప్రాచ్యంలో తన నౌకాదళ బలగాలను భారీగా పెంచింది. ప్రస్తుతం ఆప్రాంతంలో ఆరు డిస్ట్రాయర్‌ నౌకలు, ఒక విమాన వాహక నౌక (ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌), మూడు లిట్టోరల్‌ కాంబాట్‌ షిప్స్‌ ఉన్నట్టు రాయిటర్స్‌ వెల్లడించింది. ఈ పరిణామాలు యుద్ధ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భయపడే ప్రశ్నే లేదు : ఖమేనీ
ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా బెదిరింపులను తేలికగా కొట్టిపారేశారు. ”ట్రంప్‌ నౌకలను పంపానంటున్నారు. ఇరానీ ప్రజలు వాటితో భయపడరు. మేం ఎవరి మీదా దాడి చేయాలని అనుకోవడం లేదు. కానీ ఎవరైనా మమ్మల్ని వేధిస్తే గట్టిగా గుణపాఠం చెప్తాం” అని ఆయన ప్రభుత్వ మీడియాకు తెలిపారు. హెర్ముజ్‌ జలసంధిలో రెవల్యూషనరీ గార్డ్స్‌ ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు చేపడతాయన్న వార్తలను ఇరాన్‌ ఖండించింది. ప్రభుత్వ టీవీ ప్రసారం చేసిన ఆ కథనాలు తప్పుడువని ఒక ఇరాన్‌ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. ఉద్రిక్తతల మధ్య కూడా చర్చలకు తాము సిద్ధమేనని ఇరాన్‌, అమెరికా రెండూ సంకేతాలు ఇచ్చాయి. ”ఇరాన్‌ నిజంగానే చర్చలకు వస్తోంది. అణ్వాయుధాలు లేని ఒప్పందం కావాలి” అని ట్రంప్‌ అన్నారు. రక్షణ సామర్థ్యాలను కట్టడి చేయని చర్చలకు తాము సిద్ధమని ఇరాన్‌ చెప్తున్నది. కాగా ఇరాన్‌ ఉన్నత భద్రతా అధికారి అలీ లారిజానీ చర్చల ఏర్పాట్లు జరుగుతున్నాయని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.
జనవరిలో ఇరాన్‌లో చెలరేగిన భారీ నిరసనల్లో అధికారిక లెక్కల ప్రకారం.. 3117 మంది మృతి చెందారు. మానవ హక్కుల సంస్థ హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ ప్రకారం.. ఈ సంఖ్య 6713గా ఉన్నది. అయితే ఈ నిరసనల అణచివేతకు నిరసనగా యూరోపియన్‌ యూనియన్‌.. ఐఆర్‌జీసీను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా.. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఖెర్‌ ఖాలీబాఫ్‌ యూరోప్‌ సైన్యాలను కూడా అదే జాబితాలో చేర్చుతున్నట్టు ప్రటకించారు. ఐఆర్‌జీసీకు మద్దతుగా పార్లమెంటు సభ్యులు యూనిఫాంలలో హాజరయ్యారు. ”డెత్‌ టు అమెరికా… షేమ్‌ ఆన్‌ యూ యూరప్‌” అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -