Thursday, November 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా దాడి చేస్తే తిప్పికొడతాం

అమెరికా దాడి చేస్తే తిప్పికొడతాం

- Advertisement -

సాయుధ దళాలను సన్నద్ధం చేస్తున్న వెనిజులా

కారకాస్‌ : అమెరికా కనుక దురాక్రమణకు పాల్పడినా లేదా దాడి చేసినా దీటుగా ఎదుర్కోవడానికి వెనిజులా సమాయత్తమవుతోంది. దాడులను తిప్పికొట్టేందుకు సాయుధ దళాలను సన్నద్ధం చేస్తున్నామని వెనిజుల ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్‌ పాడ్రినో మంగళవారం ఓ ప్రకటన చేశారు. త్రివిధ దళాలను సంసిద్ధం చేస్తున్నామని, క్షిపణి దళాలను మోహరిస్తున్నామని ఆయన చెప్పారు. పోలీసులు, మిలిషియాలు, పౌర యూనిట్లు కూడా భాగస్వాములయ్యేలా చూస్తున్నామని అన్నారు.

పెరుగుతున్న ఉద్రిక్తతలు
అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌకను సరిహద్దున ఉన్న సముద్ర జలాలలో మోహరించడంతో వెనిజులా అప్రమత్తమైంది. దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురో నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ క్యారియర్‌ స్రైక్‌ గ్రూప్‌ కరేబియన్‌ సముద్రానికి చేరిందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ మంగళవారం ధృవీకరించింది. ఈ స్రైక్‌ గ్రూపులో ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధ విమాన వాహక నౌక ఉంది. ఇందులో నాలుగు వేల మంది నావికులు, వ్యూహాత్మకమైన యుద్ధ విమానం కూడా ఉన్నాయి.

దాడిని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు
కాగా వెనిజులాపై సైనిక దాడి జరపడ మంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. వెనిజులాపై భూతల దాడులను అమెరికాలోని 47 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని యూగవ్‌ అనే పరిశోధక సంస్థ ఇటీవల నిర్వహించిన పోల్‌ తేల్చి చెప్పింది. వెనిజులాపై దాడులను కేవలం 19 శాతం మంది మాత్రమే సమర్ధించారు.

ఆరోపణలకు ఆధారాలేవి?
ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం ప్యుర్టో రికో, ఎల్‌ సాల్వడార్‌, పనామా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో సహా కరేబియన్‌ సమీపానికి తన దళాలను పెద్ద సంఖ్యలో పంపుతోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నుంచి మాతృభూమిని కాపాడుకోవడానికే దళాలను మోహరించామని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అయితే తన ఆరోపణలకు మద్దతుగా అగ్రరాజ్యం నేటి వరకూ ఒక్క ఆధారమూ చూపలేకపోతోంది. అమెరికాలో తిష్ట వేసుకొని ఉన్న వెనిజులా గ్యాంగ్‌ ట్రెన్‌ డె అరాగువా కార్యకలాపాలకు వ్యూహరచన చేస్తోంది మదురోయేనని ట్రంప్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మదురో, ఆయన మిత్రులు తోసిపుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -