– రాష్ట్రంలో విచారణలకు అనుమతిస్తూ జీవో తేవాల్సిందే
– ఆధారాలు, నివేదికలు సమర్పించాల్సిందే
– ప్రక్రియ పూర్తి కావడానికి నెల నుంచి రెండు నెలలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోనేగాక జాతీయ స్థాయిలో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకల ప్రచారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎట్టకేలకు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అయితే, సీబీఐ ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటే కొన్ని చట్టపర చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇప్పటికే రాష్ట్రంలో సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిషేధం విధించింది. సీబీఐ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే సంస్థ అని ఆరోపిస్తూ 2022లో ఒక జీవో విడుదల చేసింది. ఇప్పుడు కాళేశ్వరంపై సీబీఐ రంగంలోకి దిగాలంటే ఈ నిషేధాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవోను జారీ చేయాల్సి ఉంటుంది. అటు తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాయాలి. దానితో పాటు ఫిర్యాదులు చేయాలి. అందుకు సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టాలంటే అనుసరించాల్సిన విధివిధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇప్పటివరకూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జి పినాకి చంద్రఘోష్ నిర్వహించిన విచారణ కమిషన్ నివేదికను ఫిర్యాదుకు జతపర్చాలి. దాంతోపాటు కాగ్ నివేదిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ నివేదిక, రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలను కూడా ప్రభుత్వం సీబీఐకి అందజేయాలి. వాటన్నింటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు, కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించి రాష్ట్ర సర్కారు సేకరించిన సమాచారం, అందుకు సంబంధించిన ఆధార పత్రాలు, డాక్యుమెంట్లు సీబీఐకి ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. కాగా, తనకు వచ్చిన ఫిర్యాదులు కేంద్రం హోం శాఖ దృష్టికి సీబీఐ అధికారులు తీసుకొచ్చి ఆపై, ఆ మంత్రిత్వ శాఖ ఇచ్చే గ్రీన్‌సిగల్‌తో సీబీఐ అధికారులు దర్యాప్తులు చేపడతారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి తమ నియమ నిబంధనల ప్రకారం అవసరమైన వారిని ఈ కేసుకు సంబంధించి విచారణకు పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు నెల నుంచి రెండు నెలలు పట్టే అవకాశముందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయాలంటే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES