Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంపూర్తిగా నిషేధిస్తే మాఫియా చేతుల్లోకి పరిశ్రమ

పూర్తిగా నిషేధిస్తే మాఫియా చేతుల్లోకి పరిశ్రమ

- Advertisement -

బాణసంచా నిషేధంపై సుప్రీం వ్యాఖ్యలు
సమతూకంతో కూడిన వైఖరి అవసరమని సూచన


న్యూఢిల్లీ : బాణసంచాపై పూర్తిగా నిషేధం విధించడం వలన ఆ పరిశ్రమ మాఫియా చేతుల్లోకి వెళుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. తద్వారా ఆ బాణసంచాను మోసపూరితంగా ప్రజలకు విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. బాణసంచాపై పూర్తి నిషేధం వల్ల ఉపయోగం లేదని, దీనిపై సమతూకంతో కూడిన వైఖరి అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవారు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బీహార్‌లో మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించడం వల్ల అందులోకి మాఫియా ప్రవేశించడానికి దారితీసిన పరిస్థి తులను సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పూర్తి నిషేధాన్ని అమలు చేయలేమని, గతంలో ఈ విషయం మనకు అనుభవం లోకి వచ్చిందని అన్నారు.

వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బాణసంచా పరిశ్రమపై ఉక్కుపాదం మోపడానికి, నిరంకుశ విధానాన్ని అమలు చేయడానికి యత్నించడం వ్యర్థమని పేర్కొన్నారు. బాణసంచా పరి శ్రమలో జీవనోపాధి పొందే హక్కు, వాయు కాలుష్యం కారణంగా ఇబ్బంది పడకుండా పరిశుద్ధమైన వాతావరణాన్ని కల్పించే హక్కు ఉండేలా సమతూ కంతో కూడిన విధానం చేపట్టాలని సుప్రీం సూచించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక పరిష్కారాన్ని కనుగొనాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను ధర్మాసనం ఆదేశించింది. బాణసంచా తయారీదారులు, విక్రయదారులు సహా అన్ని పక్షాల వాదనలను వినాలని కోరింది.

గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతి
గ్రీన్‌క్రాకర్స్‌ను ఉత్పత్తి చేసే ఎన్‌ఈఈఆర్‌ఐ, పీఈఎస్‌ఓ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిషేధిత ప్రాంతాల్లో తమ ఉత్పత్తులను విక్రయించబోమని హామీ ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించింది. బాణాసంచా తయారీ, అమ్మకాలు, వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం వుందని గత విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నుండి ప్రజలకు కల్పించాలనుకుంటున్న ఉపశమనాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా వర్తింపచేయాలి కదా అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -