– దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
– స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటాలి
– కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు
– రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– సన్నాహక సమావేశానికి అధిక సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తలు
నవతెలంగాణ – రాయపర్తి
వ్యవసాయానికి సాగునీరును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుంటే తగిన గుణపాఠం చెబుతామని.. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్ధం సన్నద్ధం అవుతామని రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక ఎన్నికలపై సన్నాహాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలిపారు. కాంగ్రెస్ లీడర్లు బోగస్ 420 హామీల వల్ల ప్రజలు మోసపోయారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోవడం, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం వంటివి చూస్తే వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు. వారం రోజుల్లో సాగునీరు ఇవ్వకుంటే తమ సత్తా ఏందో చూపెడతామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
నీళ్ల కోసం పాదయాత్ర చేస్తాడట అని వక్రీకరించి కొందరు మాట్లాడడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చురకలంటించారు. గతంలో నీళ్ల కోసం మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో లాఠీ దెబ్బలు తిని ఓరుగల్లుకు నీళ్లు తెచ్చా అని గుర్తుకు చేశారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేసిందని ఓట్ల కోసమే జిమ్మిక్కులాడుతుందని వ్యాఖ్యానించారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు లుసంతోషంగా వ్యవసాయం చేశారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోస పడుతున్నారని బాధపడ్డారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ మోసమును ప్రజలకు తెలపాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలి అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల పని చేయాలి
స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసి పల్లె పల్లెలో గులాబీ జెండా విజయ పతాకాన్ని ఎగరవేయాలని ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్, పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సన్నాక సమావేశం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత ప్రభంజనాన్ని చూపెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని కార్యకర్తలకు దిశా నిర్దేశం చూపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సారధ్యంలో ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీలో గెలిపించుకోవాలని కోరారు. గ్రామాల్లో స్థానిక ప్రజలకు కార్యకర్తలు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల కోసం కార్యకర్తలు సంసిద్ధం కావాలని సూచించారు. తదుపరి కేశవపురం మాజీ ఎంపీటీసీ, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, గారె నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, గజ్జవెల్లి ప్రసాద్, చిన్నాల రాజబాబు, కోదాటి దయాకర్ రావు, ఐత రాంచందర్, బోనగిరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.