Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు అసత్యాలు ఆపకుంటే ఖబడ్దార్‌

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు అసత్యాలు ఆపకుంటే ఖబడ్దార్‌

- Advertisement -

– నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా ..మీరు రాస్తారా ?
– రాఘవ కన్‌స్ట్రక్షన్‌ నుంచి రూ.కోటి ఇచ్చా
– బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతిపరులు : మంత్రి పొంగులేటి విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడమే బీఆర్‌ఎస్‌ పనిగా పెట్టుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సింగరేణిలో అవకతవకలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పట్ల ప్రజల్లో వచ్చిన ఆదరణ జీర్ణించుకోలేక పౌరసరఫరాల్లో అవినీతి జరిగిందంటూ మంత్రి ఉత్తమ్‌పై పుకార్లు పుట్టించా రని నిరసించారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్‌ యాదవ్‌, సామెల్‌, బి.లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్‌, రాంమోహన్‌రెడ్డి తదితరులతో కలిసి బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. శకుని మామ కేసీఆర్‌ డైరెక్షన్‌లో అబద్ధాల హరీశ్‌రావు, డ్రామారావు కేటీఆర్‌లు మా ప్రభుత్వం, మంత్రులపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ బాటిళ్లపై వేసే స్టిక్కర్ల విషయంలో, టెండర్ల విషయంలో అవకతవకలు అంటూ లిక్కర్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కూడా అదే రకమైన నిందలు వేశారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఉనికికి ప్రమాదం వస్తుందనీ, మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారనీ, క్రషర్లు అంటూ తనపై ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. ఇలా ప్రతిమంత్రిపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామ ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. నాదర్గుల్‌, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ అంశాలపై మంత్రి ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబడుతూ ఆధారాలను మీడియాకు చూపించారు. ఈ వివరాలు మంత్రి పొంగులేటి మాటల్లోనే ”సర్వే నెంబర్‌ 613 నాదర్గుల్‌ గ్రామం, బాలాపూర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇందులో ఉన్న 373 ఎకరాల13 గుంటలు. ఇది ప్రయివేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్‌ భూమిగా, రకరకాలుగా అనేక కోర్టుల్లో దీనిపై కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రయివేటు పార్టీ గెలవడం, మరోసారి ప్రభుత్వం గెలవడం, పైకోర్టుకు పోవడం, పోలీసు సపోర్ట్‌ కోసం కోర్ట్‌ డైరెక్షన్‌ తెచ్చుకోవడం ఆ నాటి ప్రభుత్వంలో కొన్ని జరిగాయి. సెప్టెంబర్‌ 1, 2014లో యునైటెడ్‌ ల్యాండ్‌ మార్క్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, అల్ఫా ఎస్టేట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఒమెగా డెవలప్మెంట్స్‌ వెంచర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అనే మూడు సంస్థలకు నాదర్గుల్‌ గ్రామంలోని 613 సర్వే నెంబరులోని ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? ఈ రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్లను 2016 సెప్టెంబర్‌ 24 మ్యుటేషన్‌ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? 2014లో కానీ, 2016లో కానీ ఏ ప్రభుత్వం ఉంది? అధికారంలో ఎవరున్నారు అబద్ధాల రావు ? ఇందాక చెప్పిన మూడు కంపెనీలకు ఫైల్‌ నెంబర్‌ బి/1351/2/2021-1-1, 2021-2, 2021-3, 2011-3 వీళ్లకు మ్యుటేషన్‌ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? ప్రతిదీ వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ జరిగితే ప్రస్తుత ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అంతేకాదు ఈ డ్రామాలరావు , ఈ అబద్ధాల రావు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఫిబ్రవరి 10, 2021 గూగుల్‌ మ్యాప్‌ చూడండి. ఇక్కడ అప్పటికీ ఏ ఏర్పాట్లు చేయలేదు. ఏ రేకులు పెట్టలేదు. అదే విధంగా డిసెంబరు 5, 2021 ఈ గూగుల్‌ మ్యాప్‌లో కలర్‌తో కొన్ని ప్రాంతాల్లో మొదలుపెట్టారు. రేకులు కట్టడం, రోడ్లు వేయడం మొదలుపెట్టారు. డిసెంబరు 5న 2021, నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్‌లో కనిపిస్తుంది. నేనేమి మానిప్యులేట్‌ చేసింది కాదు. నా ప్రభుత్వం, నా అధికారులు తయారు చేసిచ్చింది కాదు. అదే విధంగా జనవరి 1న 2022 రేకులు, రోడ్లు వేసింది గూగుల్‌ పిక్చర్‌లో కనిపిస్తుంది. నవంబరు 17, 2022లో పూర్తిగా కలర్‌తో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని 2022లో 11 నెలల్లో పూర్తిగా మీ టైంలో షీట్లు పెట్టి దానికి పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా?. 2022 నవంబరులో మీ దొర పాలనే ఉంది కదా? ఇలా ప్రతి మ్యాపులో ప్రజాప్రభుత్వం వచ్చే వరకు ఐదు మ్యాపులు తెప్పించాను. ప్రతి మ్యాపులో 373 ఎకరాల 22 గుంటలకు పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వంపైనా, మంత్రిపైనా నిందలు మోపుతారా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్‌ ఎవరి టైంలో జరిగింది? ముటేషన్‌ ఎవరి టైంలో జరిగింది?” అని ప్రశ్నించారు.

”వట్టినాగులపల్లిలో షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయితీ. వారందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుకున్న భూమి. ఒక పార్టనర్‌ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో.. వట్టినాగులపల్లి కుటుంబ విషయాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారు. కోత్వాల్‌గూడ రాఘవ కనస్ట్రక్షన్లకు సంబంధించి రూ. కోటి ఇచ్చానని చెప్పారు. మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చి, అధికారంలో దిగే ముందుు ఉన్న ఆస్తులెంతా? ఈనాడు మీకున్న ఆస్తులెంత ? రాఘవ కనస్ట్రక్షన్స్‌ ఎవరిదో మీకు తెలియదా అని అడుగుతున్నారు. రాఘవ కనస్ట్రక్షన్‌ మోచేతి నీరు తాగినోళ్లు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ, ఈ అబద్ధాల రావు, డ్రామా రావుకు బాగా తెలుసు. అంతేకాదు మాయమాటలు చెప్పి, తడిబట్టతో నా గొంతు కోసిన తరువాత, నీ పార్టీకి ఇదే రాఘవ కనస్ట్రక్షన్‌ నుంచి అధికారికంగా రూ.కోటి ఇచ్చాననే సంగతిని మరచిపోయావా అబద్ధాల రావు. అప్పుడే తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావా డ్రామాలరావు? మోచేతి నీళ్లంటే కోటి రూపాయలతో కాదు. ఈస్టోరీ మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్టుగా చెప్పారు.. మీకు సవాల్‌ విసిరారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్‌కు రాఘవ కనస్ట్రక్షన్‌ సంబంధం ఉందన్నారు. రోడ్లకు మెటల్‌ పంపే కంపెనీ మీద సీబీసీఐడీ విచారణ చేస్తామని సీఎం ప్రకటించారని చెప్పారు. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పదేండ్ల పాలనలో అబద్ధాల రావు, డ్రామారావు, శకుని మామ ముగ్గురే మంత్రులు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సీబీసీఐడీ ద్వారా ఎంక్వైరీలో తేలుతుంది అంతేకాదు ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందో చూడండి అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -