ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సహకరించుకోవడానికి, సామరస్యంగా ఉండటానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి సహజీవనం వీలు కల్పిస్తుంది. అయితే వివాహ జీవితంలో ఉండే సమస్యలు ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఒకరి బాధ్యతను ఇంకొకరు తీసుకోవాలనే నిబంధన ఈ బంధంలో అంత బలంగా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ మాత్రమే ఉన్నపుడు సహజంగానే అది కొంతకాలం తర్వాత తగ్గిపోతుంది. తర్వాత పరిస్థితి ఏంటి అనేదే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మానవి పాఠకుల కోసం…
అనిత, సుమిత్ ఇద్దరూ ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నారు. ఒకే చోట ఉద్యోగం సంపాదించారు. ఏడేండ్ల నుండి వీరిద్దరికీ పరిచయం. అది కాస్త ప్రేమగా మారి కొంత కాలం సహజీవనం చేయాలనుకున్నారు. ఇద్దరూ కలిసి బెంగుళూరులో రెండేండ్లు ఉన్నారు. ట్రాన్స్‌ఫర్ కావడంతో అనిత హైదరాబాద్ వచ్చేసింది. ఆమె వచ్చి ఆరు నెలలు అవుతుంది. సుమిత్ కూడా ఆరు నెలల తర్వాత హైదరాబాద్ వచ్చేస్తా అన్నాడు. కానీ రాలేదు.
అనిత వచ్చిన రెండు మూడు నెలలు ఆమెతో బాగానే మాట్లాడాడు. ఆ తర్వాత తగ్గించేశాడు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ‘ఏం జరిగింది’ అని అనిత అడిగితే ‘ఇక్కడున్నన్ని రోజులు నువ్వు ఆఫీసు పనిలో, ఇంటి పనిలో సహాయంగా ఉండేదానివి. ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. చాలా బిజీగా ఉంటున్నాను. దాంతో నీతో మాట్లాడే టైం నాకు ఉండడం లేదు’ అన్నాడు. కానీ అతని మాటలు అనితకు నమ్మబుద్ది కాలేదు. ఎందుకో అనుమానం వచ్చింది. బెంగుళూరులో తనతో పాటు పని చేసిన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేస్తే ‘సుమిత్ ఇప్పుడు మాధవి అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అది రాగానే ఇక్కడ మానేస్తానంటున్నాడు’ అని చెప్పారు.
ఇదే విషయం సుమిత్‌ను అడిగితే ‘అలాంటిది ఏమీ లేదు. నీకు నాపై నమ్మకం లేదా? వేరే వాళ్లు చెప్పింది నమ్ముతున్నావు. నేను చెప్పింది నమ్మడం లేదు. హైదరాబాద్ వెళ్లినప్పటి నుండి నీకు నాపై ప్రేమ తగ్గిపోయింది’ అన్నాడు. దాంతో అతని మాటలు ఆమె నమ్మింది. పదిహేను రోజుల ముందు కోలిగ్ పెండ్లి అంటే అనిత బెంగుళూరు వెళ్లింది. సుమిత్‌కు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అతనికి చెప్పలేదు. కానీ కోలిగ్ పెండ్లికి సుమిత్ రాలేదు. దాంతో పెండ్లి తర్వాత నేరుగా సుమిత్ ఉండే ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె మరో అమ్మాయిని చూసింది.
ఇదేంటని అడిగితే ‘అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. నన్ను అడిగి రావాలి కదా’ అంటూ ఆమెపై చేయిచేసుకున్నాడు. దాంతో అనిత తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఆ తర్వాత వారం రోజులకు ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఆమె చెప్పింది మొత్తం విని సుమిత్‌ను పిలిపించాము. అతను ‘అనిత అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆమె నాకు చెప్పకుండా రావడం ఏంటీ. అంటే ఆమె నన్ను అనుమానిస్తుంది. అందుకే అలా చెప్పకుండా వచ్చింది. అందుకే ఆమెపై నాకు నమ్మకం పోయింది. ప్రస్తుతం నాకు అనితపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా మేము పెండ్లి చేసుకోలేదు. కేవలం సహజీవనం మాత్రమే చేశాము. అయినా మీరు పిలిచారు కాబట్టి మీ సంఘంపై గౌరవంతో నేను బెంగుళూరు నుండి వచ్చాను. ఇద్దరికీ నచ్చితేనే జీవితాంతం ఉండగలం. అనితతో నాకు అలా అనిపించలేదు. సహజీవనంలో విడిపోవడానికి పర్మిషన్ తీసుకోవల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు నాలాంటి వాళ్లు చాలా మంది సహజీవనానికే ఆసక్తి చూపుతున్నారు. ఆమెకు నాపై కానీ, నాకు ఆమెపై కానీ ఎలాంటి హక్కూ కానీ, బాధ్యత కానీ లేవు. అందుకే అనిత హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుండి పెండ్లి చేసుకుందామని గోల చేస్తుంది. బెంగుళూరులో ఉన్నప్పుడు పెండ్లి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె మారిపోయింది. అందుకే వేరే అమ్మాయితో ఉంటున్నాను. అయినా ఆమెకు ముందే చెప్పాను. పెండ్లి అంటూ బలవంతం చేయవద్దని. అప్పుడు దానికి ఒప్పుకొనే నాతో వచ్చింది. ఇప్పుడేమో ఇలా చేస్తుంది’ అన్నాడు.
దానికి అనిత ‘మనం సహజీవనం చేసింది పెండ్లి చేసుకోవడానికే కదా! అలాంటిది నేను ఇప్పుడు పెండ్లి చేసుకుందామంటే సుమిత్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు’ అంది. ‘పెండ్లి అంటే ఒక బాధ్యత. నేను ఆ బాధ్యత మోయలేను. అందుకే నేను పెండ్లి చేసుకోను’ అన్నాడు. ‘నేను అతన్ని కాదని వేరే వాళ్లను పెండ్లి చేసుకోలేను. మా ఇంట్లో వాళ్లు నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే నేను సుమిత్‌ని పెండ్లి చేసుకుందామని అడిగాను. మేము పదేండ్ల నుండి ప్రేమించుకుంటున్నాం. రెండేండ్లు కలిసి ఉన్నాము. ఇప్పుడు అతను కాదంటే నా పరిస్థితి ఏంటీ’ అంటూ బాధపడింది.
మేము ఎంత చెప్పినా అతను పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. కొన్ని రోజులు వేచి చూద్దాం అన్నా అతను విడనం లేదు. దాంతో నమ్మించి మోసం చేశాడని సుమిత్‌పై ఆమె కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఇలా సమాజంలో కేవలం అనిత మాత్రమే కాదు చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు. సహజీవనం తర్వాత పెండ్లి చేసుకోవడం లేదని బాధపడుతున్నారు. పొరపాటు చేశామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుడితే ఏమిటీ పరిస్థితి. అందుకే పెండ్లి అయినా, సహజీవనం అయినా ఒక వ్యక్తితో కలిసి జీవించాలి అనుకున్నపుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఇలాంటి సమస్యలే వస్తాయి.
– వై వరలక్ష్మి,
9948794051