No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజిప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే...

ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే…

- Advertisement -

భారతదేశ జీడీపీ నాలుగు ట్రిలియన్‌ డాలర్ల మార్కు చేరుకుని జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రకటించారు. అయితే, జపాన్‌ 12.3 కోట్ల జనాభా కలిగిన దేశం, దాని తలసరి ఆదాయం డాలర్‌ ప్రకారం 33,900. 146 కోట్ల జనాభా కలిగిన మన దేశ తలసరి ఆదాయం 2940. చైనా నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను చేరుకున్నప్పుడు దాని తలసరి ఆదాయం సుమారు 3500. ఒక దశాబ్దం వేగవంతమైన ఆర్థిక పరివర్తన తర్వాత, దాని తలసరి ఆదాయం 13వేల కంటే ఎక్కువగా ఉంది, ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ 19.23 ట్రిలియన్ల డాలర్లతో బలంగా ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిను యుఎస్‌ ( 30.51 ట్రిలియన్‌) తలసరి ఆదాయం 89వేలు. భారత్‌ రెండు స్థానాలు ఎగబాకి, జపాన్‌ (4.19 ట్రిలియన్‌) , జర్మనీ (4.74 ట్రిలియన్‌)ను కూడా అధిగమించినప్పటికీ, తలసరి ఆదాయంలో ఇతర అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే చేయాల్సింది చాలా ఉంది.

స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశంలో తలసరి ఆదాయం కేవలం 249 రూపాయలుగా ఉండేది. ఇది పెరుగుతూ 2000వ సంవత్సరానికి సుమారు ఇరవై వేలకు పెరిగింది. 2014-15వ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.87 వేలుగా ఉన్న భారత దేశ తలసరి ఆదాయం నేడు రెండు లక్షలలోపే ఉన్నది. భారతదేశ తలసరి జీడీపీ ప్రస్తుతం డాలర్‌ 2940 వద్ద ఉన్నా, ఇది ప్రజలందరి సగటు అని గుర్తుంచుకోవాలి. భారతదేశ జీడీపీ సుమారు 4 ట్రిలియన్లు అనుకుంటే అగ్ర స్థాయిలో ఉన్న ఒకశాతం మంది దానిలో 40శాతం (అంటే, 1.56 ట్రిలియన్లు) నియంత్రిస్తున్నారు. మిగిలిన 99శాతం మందికి 2.34 ట్రిలియన్లు అన్నమాట- అంటే దాదాపు 1.4 బిలియన్‌ ప్రజలు. దీని ఫలితంగా తలసరి జీడీపీ దాదాపు 1,670 అవుతుంది, జాతీయ సంపదలో దాదాపు 60శాతం పైగా నియంత్రించే అగ్రస్థాయి ఐదు శాతంమంది ధనికులని తీసివేస్తే, తలసరి సగటు కేవలం 1100కి పడిపోతుంది. అంటే మొత్తం ఏడాదికి లక్ష రూపాయల కంటే తక్కువ. ప్రపంచ ప్రజల తలసరి ఆదాయం 13,700 డాలర్లు కాగా, ప్రస్తుత ఇండియా 2940 యు.ఎస్‌ డాలర్లు. దేశం ఆర్థికంగా బలోపేతమైనంత మాత్రాన ప్రజలంతా ఆర్ధికంగా ఎదిగినట్టుగా ఊహించుకోవడం సరికాదు.

ముఖేష్‌ అంబానీ కుటుంబం జీడీపీలో పన్నెండు శాతం వాటా కలిగి ఉంది.హురున్‌-బార్‌క్లేస్‌ నివేదిక ప్రకారం 28 లక్షల కోట్లతో అదానీ కుటుంబం కంటే రెండు రెట్లు అంబానీ కుటుంబం సంపద కలిగి ఉంది. కెఎం బిర్లా కుటుంబ సంపద ఇరవై శాతం పెరిగి రూ.6.47 లక్షల కోట్లకు చేరుకుంది. జిందాల్‌ కుటుంబ సంపద ఇరవై ఒక శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లకు చేరుకుంది.మరో పక్క దేశంలోని 90 శాతం కుటుంబాల ఆదాయం రూ.25 వేల లోపే ఉంది. ఇంత ఘోరంగా ఉన్న సంపద అసమానతలు తొలగించాలంటే సంపన్నుల మీద అదనపు పన్నులు విధించాలి. కాని నయా ఉదారవాద వ్యవస్థ ఇందుకు అంగీకరించదు. సంపన్నుల మీద అదనపు పన్నుల విధిస్తే వాళ్లు తమ పెట్టు బడులను ఈ దేశాన్నుంచి ఇతర దేశాలకు తరలించుకుపోతారనే మిషతో ఆ పని చేయడం లేదు. తలసరి ఆదాయాన్ని బట్టి చూస్తే గతంలో కంటే దేశం ఆర్థికంగా బలంగా ఉన్న మాట వాస్తవం. గతంలో కంటే దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడిన మాట కూడా వాస్త వమే. ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చినమాట సత్యదూరం కాదు. అయితే బతుకు బండి ఎలాగోలా సాగించడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలస్థాయి పెరగాలి.

భారతదేశ ఆర్థికవృద్ధి మొత్తం ప్రజల సర్వతోముఖాభివృద్ధిగా మారకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం జనాభాలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లేవు భారతదేశ ఆర్థిక నమూనా ఐటీ, ఫైనాన్స్‌, ఈ-కామర్స్‌, పెద్ద కార్పొరేట్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ రంగాలు అధిక జీడీపీ సంఖ్యలను ఉత్పత్తి చేస్తాయేమో కానీ పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించవు. వాస్తవానికి జనాభాలో ఎక్కువ మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, వారికి సామాజిక రక్షణ కూడా లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, వ్యవసాయ రంగం జీడీపీకి కేవలం పదహారు శాతం మాత్రమే దోహదం చేస్తుంది. భారతదేశం స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా తగ్గుతున్నప్పటికీ, నేటికీ భారతదేశంలోని సుమారు సగం మంది జనాభాకు వ్యవసాయమే ఆధారంగా నిలవడం గమనార్హం. బ్యాంకింగ్‌, టెక్నాలజీ,హోటల్స్‌, టెలీ కమ్యూనికేషన్‌ , ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి సేవారంగాలు జీడీపీలో యాభైశాతం కంటే ఎక్కువ దోహదం చేస్తాయి, కానీ ముప్పయి శాతం శ్రామిక శక్తిని మాత్రమే ఉపయోగిస్తాయి .పైగా అవి పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగవ్వాలంటే జీడీపీలో 12.5 శాతం వాటా ఉన్న తయారీ రంగం, రాబోయే రోజుల్లో గణనీయమైన భూమిక పోషించాల్సి ఉంది. వచ్చే పదేండ్లలో భారత్‌ జీడీపీలో తయారీ రంగం భాగస్వామ్యం 21 శాతానికి చేరు కుంటే తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. ప్రపంచ వ్యాప్తంగా తలసరి ఆదాయం లో చూసుకున్నప్పుడు మన దేశం 141వ స్థానంలో, జీవన ప్రమాణాలలో (హెచ్‌డిఐ) చూస్తే 130వ స్థానంలో(194 దేశాలలో), హంగర్‌ ఇండెక్స్‌ (ఆకలి సూచిక)లలో 105 స్థానం (127 దేశాలలో) ఉంది.

భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా లాభాలను ఆర్జించాలనుకోవడం అర్థరహితం. ప్రజలకు ఆధిక సంఖ్యలో ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూనే, టెక్నాలజీ విషయంలో ఇతర దేశాలకు దీటుగా ఎదగాలి. వ్యవసాయదారుల ఆదాయాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటే అప్పుడు వారి వినిమయం పెరిగి ఆర్థికవృద్ధి వేగం పెరుగుతుంది. కాని ఇది జరగాలంటే రైతు-అనుకూల విధానాలు అమలు చేసే ప్రభుత్వం ఉండాలి. కార్పొరేట్‌ ప్రయోజనాలను, అగ్రి-బిజినెస్‌ను ప్రోత్సహించే ప్రస్తుత ప్రభుత్వ విధానాలు రైతుల ఆదాయాలను పెంచడం లేదు సరికదా మరింత కుంగదీస్తున్నాయి. నయా ఉదారవాద విధానాల చట్రానికి లోబడి నడుచుకుంటున్నంత వరకూ ప్రభుత్వం దేశీయ వినిమయాన్ని పెంచడం, తద్వారా వృద్ధి రేటును పెంచడం అసాధ్యం. భారత్‌ ఇంకా ఇతర దేశాల దిగుమతి యంత్ర పరికరాలపై ఆధారపడడంలో ఔచిత్యం లేదు. ఈ విషయంలో భారత్‌ ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్ధిక తీరుతెన్నులను సమీక్షించుకుని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ప్రజలపై భారం పడకుండా, దేశాభివృద్ధికి తోడ్పడే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టాలి.
– జి.తిరుపతయ్య, పి.సతీష్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad