Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయంరష్యా చమురు సరఫరాలు ఆపేస్తే…తీవ్ర పరిణామాలు

రష్యా చమురు సరఫరాలు ఆపేస్తే…తీవ్ర పరిణామాలు

- Advertisement -

అలీన విదేశాంగ విధానానికి విఘాతం
మాస్కో నుంచి కీలక రక్షణ ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం
దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయి

న్యూఢిల్లీ : భారత ఉత్పత్తులపై విధించిన పాతిక శాతం ప్రతీకార సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం వెనుక షరతులు ఉన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసుకుంటున్న ముడి చమురు దిగుమతులను నిలిపివేయాలని, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తుల కొనుగోలును పెంచాలని ట్రంప్‌ షరతు విధించారు. ప్రతీకార సుంకాల రద్దును వాణిజ్య రాయితీగా మోడీ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ఆ ఉత్తర్వు మన దేశానికి అనేక వ్యూహాత్మక, ఆర్థిక, భౌగోళిక నష్టాలను తెచ్చి పెట్టే ప్రమాదం కన్పిస్తోంది.

వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం
భారతదేశం చారిత్రకంగా అలీన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. దీనినే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిగా చెబుతోంది. ఈ విధానం అమెరికా, రష్యా, యూరప్‌, వర్ధమాన ఆసియా భాగస్వాముల మధ్య సంబంధాలను సమతుల్యం చేస్తోంది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని ట్రంప్‌ అంటున్నారు. అయితే ట్రంప్‌ వాదనపై భారత్‌ ఇప్పటి వరకూ మౌనాన్నే ఆశ్రయించింది. టారిఫ్‌లో ఉపశమనం కోసం అమెరికా షరతులకు అంగీకరించడం ద్వారా మోడీ ప్రభుత్వం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి యొక్క ప్రాథమిక సూత్రం విషయంలో రాజీపడినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే అమెరికా జాతీయ భద్రతా చర్యల్లో భాగంగానే భారత్‌ ఈ హామీ ఇచ్చింది. అమెరికాకు భారత్‌ చేరువ అయినట్టు రష్యా భావించిన పక్షంలో సైనిక హార్డ్‌వేర్‌, అణు ఇంధనం, అంతరిక్ష సహకారం సహా దీర్ఘకాలంగా కొనసాగుతున్న రక్షణ, ఇంధన భాగస్వామ్యాలు దెబ్బతింటాయి. భౌగోళికంగా చూస్తే ఈ పరిణామం బహుళ ధృవ ప్రపంచంలో భారత్‌ యొక్క స్వేచ్ఛను హరిస్తుంది.

రష్యా కన్నెర్ర చేస్తే…
దశాబ్దాలుగా మనకు భద్రతా భాగస్వాములుగా కొనసాగుతున్న దేశాలలో రష్యా ఒకటి. అమెరికా ఆదేశానుసారం రష్యా నుంచి మనం ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తే ఆ దేశ ఆదాయం గణనీయంగా పడి పోతుంది. ఫలితంగా పరస్పర విశ్వాసం, దీర్ఘకాల సహకారం దెబ్బతింటాయి. రక్షణ సరఫ రాలు, ఆధునిక టెక్నాలజీ, ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తి వంటి అంశాలపై రష్యా పునరాలోచన చేయవచ్చు. అప్పుడు మనకు రష్యా నుంచి రక్షణ సామగ్రి అందకపోవచ్చు. ముఖ్యంగా జలాంతర్గాములు, ఎస్‌- 400 వ్యవస్థలు, ఇతర అత్యాధునిక సైనిక వ్యవస్థల వంటి వ్యూహాత్మక కీలక ఉత్పత్తుల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.

పెరగనున్న ఇంధన ఖర్చులు
ప్రస్తుతం మన దేశం తన ముడి చమురు అవసరాలలో 90 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. రష్యా నుంచి ఇప్పటి వరకూ కొనుగోలు చేస్తున్న చమురుపై రాయితీ లభిస్తోంది. ఇది అంతర్జాతీయ చమురు ధరలలో అస్థిరత నుంచి మనల్ని కాపాడుతోంది. ఒకప్పుడు రష్యా నుంచి రోజుకు 1.2 మిలియన్‌ బ్యారల్స్‌కు మించి ముడి చమురు సరఫరా జరిగేది. దీంతో 2022 తర్వాత మన దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గిపోయింది. ట్రంప్‌ తాజా ఆదేశాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఖరీదైన పశ్చిమాసియా లేదా అమెరికా చమురుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా ఇంధన ఎగుమతుల ధర సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది.

అంతేకాక ఆ ఎగుమతులు కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. పశ్చిమాసియా దేశాలు లేదా అమెరికా నుంచి చమురును కొనుగోలు చేస్తే దేశంలో రిటైల్‌ ఇంధన ధరలు పెరగక తప్పదు. ఫలితంగా కరెంట్‌ ఖాతాలో లోటు పెరిగిపోతుంది. అంతిమంగా సబ్సిడీలు, ద్రవ్యోల్బణ నిర్వహణ విధానాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది. దేశంలోని రిఫైనరీలు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న భారీ గ్రేడ్‌ చమురును ప్రాసెస్‌ చేయడానికి అనువుగా తమ నిర్మాణాలను మార్చుకున్నాయి. ఇప్పుడు రష్యా సరఫరాలు ఆగిపోతే వాటి నిర్మాణాలలో తిరిగి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో మరిన్ని వ్యూహాత్మక ఇబ్బందులు తప్పవు.

నిబంధనలను ఉల్లంఘిస్తే…
రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను నిలిపివేసిందా లేదా అనే అంశాన్ని నిర్ధారించుకోవడానికి అమెరికా ప్రభుత్వం నిఘా వేస్తుంది. ముఖ్యంగా వాణిజ్య, ప్రభుత్వ, ఆర్థిక విభాగాలు రంగంలోకి దిగుతాయి. ఒకవేళ రష్యా నుంచి భారత్‌ తిరిగి ముడి చమురు కొనుగోలును ప్రారంభిస్తే మరోసారి సుంకాలను విధించేందుకు వీలుగా ఓ క్లాజును చేరుస్తారు. ఇటీవలి కాలంలో అమెరికా వాణిజ్య విధానం అస్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందానికి భిన్నంగా భారత్‌ వ్యవహరిస్తే అమెరికా తిరిగి సుంకాలు విధిస్తుంది. అప్పుడు వ్యాపారంపై నమ్మకం సడలిపోతుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థిరత్వం, దీర్ఘకాలిక సరఫరాల వ్యవస్థ దెబ్బతింటాయి.

ప్రతీకార సుంకం ఎత్తివేతపై అమెరికా ఆదేశాలు
రష్యా చమురు కొనుగోలుపై నిఘా ప్రారంభం
రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన పాతిక శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు శనివారం ట్రంప్‌ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేసింది. రష్యా నుంచి ప్రత్యక్ష లేదా పరోక్ష చమురు కొనుగోలును నిలిపివేస్తామని, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులు కొంటామని భారత్‌ హామీ ఇచ్చిందని ఆందులో వివరించింది. రాబోయే పది సంవత్సరాల కాలంలో అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు కూడా భారత్‌ అంగీకరించిందని తెలిపింది. కాగా ట్రంప్‌ ప్రభుత్వ ఆదేశాలు భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.31 గంటలకు అమలులోకి వచ్చాయి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్‌ నిలిపివేసిందా లేదా అని పరిశీలించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఓ యంత్రాంగాన్ని అమలులోకి తెచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -