Sunday, March 15, 2026
E-PAPER
Homeకవితఆమె ప్రతిఘటిస్తే

ఆమె ప్రతిఘటిస్తే

- Advertisement -

అది నిశ్శబ్దం చేసిన శబ్దం!
శతాబ్దాల నిర్వేదం నుండి పుట్టిన వేదం!
అబల చేసిన బలప్రదర్శనం!
భయంకర భద్రకాళీ దర్శనం!
దైన్యంనుండి ప్రభవించిన మనో ధైర్యం
భావదారిద్య్ర పంకమునుండి ప్రాదుర్భవించిన పద్మం
బలవద్బంధిత గళాసంజనిత వరవీర – వచనావిజృంభణం
బేలతనం పేగుకాలి పెట్రేగి ప్రకటించిన రణం
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ ఆమె క్షమయా ధరిత్రి
ఘర్మజలంతో గాయాలను కడుక్కుంటున్న దయనీయ గాత్రి
నేడు తిరుగుబాటు తిలకంతో తెగించిన ‘త్రినేత్రి’
ఇన్నాళ్లూ మబ్బుచాటు చినుకు చలి తగిలింది, చెలరేగింది;
అణిగియుండిన అగ్నిపర్వతము ‘లావా’అయి కావలించింది;
పెట్టెలోని అగ్గిపుల్ల, రాపాడిస్తే రగిలిపోయింది
ఒరలోని కత్తి చెరవీడింది, చెలరేగింది
ఇప్పటికే ఆమె కొన్ని యుగాలు ‘లేటు’
ద్యూతంలో ఓడిన నాడే ఆమెకు తెలిసుండాలి వీళ్ల ఎందుకైనా వెనుకాడని వ్యసనపరులని;
ఆనాడే ఆమె హుంకరించి ఉంటే, ధర్మరాజును ధిక్కరించి ఉంటే,
రారాజు తొడగొట్టే వాడా? ఆమె వినీల వేణీ భరాన్ని చెరబట్టేవాడా?
చరిత్రను ఈనాడు చిదిమేసింది
ప్రతి ఘటనతో ప్రతిధ్వనించింది
ఒక నాడు నిండుభూమిలో నిక్షిప్తం చేసిన బీజం
నేడు నేలను ఛిద్రిస్తూ, నిర్భయంగా, నిటారుగా, నింగిని చూస్తూ…. ఆమె
అబల సబలగా మారిన ఈ ‘క్షణం’
స్త్రీ చరిత్రలో ఓ అద్భుత ‘ప్రకరణం’
మాచన రఘునందన్‌, 9441252121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -