Sunday, July 6, 2025
E-PAPER
Homeమానవిపాత్ర బ‌లంగా ఉంటే రంగుల‌తో ప‌నిలేదు..

పాత్ర బ‌లంగా ఉంటే రంగుల‌తో ప‌నిలేదు..

- Advertisement -

ప్రేమి విశ్వనాథ్‌… దీనికన్నా వంటలక్క అలియాస్‌ దీపా అంటేనే అందరూ గుర్తు పడతారు. కార్తీకదీపం సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ రంగంలో సాధారణంగా అందరూ అందంగా, గ్లామర్‌గా కనిపించే పాత్రలో కనిపించేందుకు ఇష్టపడతారు. కానీ ఈమె మాత్రం డీ గ్లామర్‌ పాత్రలో బుల్లితెరకు పరిచయమయ్యారు. అయినా తన నటనతో ఏడేండ్ల నుండి అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్‌ అయ్యారు. ఇటీవల ఏషియన్‌ పెయింట్స్‌ ‘ట్రాక్టర్‌ ఎమల్షన్‌ గృహశోభ’ పేరుతో ప్రారంభించిన విభిన్నమైన కలర్‌ గైడ్‌ను మరో ఆర్టిస్ట్‌ అవనితో కలిసి ఘనంగా
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెతో మానవి సంభాషణ…

ప్రేమి సొంతూరు కేరళలోని ఎర్నాకులం దగ్గరి ఎడప్పల్లి. 1991లో డిసెంబర్‌ 2న పుట్టారు. తల్లి కాంచన, తండ్రి విశ్వనాథ్‌. లా పట్టా పొందిన ఈమె కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా కొన్ని రోజులు పని చేశారు. ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ కూడా చేశారు.
బుల్లితెరకు పరిచయం
నటకు ముందు ప్రేమి మోడల్‌గా పని చేశారు. మంచి మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో ఏసియానెట్‌ మలయాళం టెలివిజన్‌లో వచ్చిన కరతముత్తు అనే సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్‌ మలయాళ టీవీరంగంలోనే సంచలనాన్ని సృష్టించి, ఆమె నటన మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదే 2017లో కార్తికదీపం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ సీరియల్‌ విశేష ఆధరణ పొందింది. అన్ని సీరియల్స్‌లోకి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రేమి మరో రెండు సీరియల్స్‌లో, రెండు తమిళ చిత్రాల్లో నటించారు.
రంగుపై పోరాటం
గ్లామర్‌తో మాత్రమే గుర్తింపు తెచ్చుకునే రంగంలో డీ గ్లామర్‌తో కనిపించి ప్రేక్షకుల మనసు దోచుకున్న నటిగా ప్రేమిని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఆమె తన పాత్ర ద్వారా శరీర రంగును గురించి కామెంట్లు చేసే వారిపై పోరాటం చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆ పాత్రే ఆమెను బలంగా నిలబెట్టింది. నలుపు రంగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమెను గృహశోభ విభిన్న రంగుల గురించి అడిగితే ‘రంగులు మన మూడ్‌ను మార్చేస్తాయి. కొన్ని రంగులు చూసినప్పుడు ప్రశాతంగా అనిపిస్తుంది. అలాంటి రంగులను మన ఇంటికి ఎంపిక చేసుకుంటే ఆహ్లాదకరంగా గడపొచ్చు. నాకు వామ్‌షేడ్స్‌, లైట్‌ కలర్స్‌ ఇష్టం’ అంటూ పంచుకున్నారు.
మంచి సందేశంతో…
‘డీ గ్లామర్‌ పాత్ర అనుకోకుండా వచ్చింది. సీరియల్‌ ప్రారంభంలో యాక్టింగ్‌పై అంతగా అవగాహన లేదు. నల్లగా ఉన్న అమ్మాయి పాత్ర కోసం అడిగారు. అందరూ తెల్లగా ఉంటేనే ఇండిస్టీకి రావాలి అనే భావన ఉన్న కాలంలో నా పాత్ర కొంత వరకు మార్పు తెచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పు డు దాదాపు అన్ని భాషల్లో ఈ సీరియల్‌ నడుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ధన్యవా దాలు చెబుతున్నాను. ఈ పాత్ర చేస్తున్నందు గర్వంగా ఉంది. రాబోయే తరాలకు కూడా ఇది ఒక మంచి సందే శంగా ఉంటుందనే నమ్మకం వచ్చింది. నల్లగా ఉన్నా ఇండిస్టీలో మంచి పాత్రలతో నిలదొక్కుకోవచ్చు అనే విషయాన్ని నా పాత్ర నిరూపించింది. అయితే ఈ సీరియల్‌ ప్రారంభించిన కొత్తలో రంగు వల్ల కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ తర్వాత కాలంలో నా కలర్‌ ద్వారానే ప్రేక్షకులు నన్ను స్వీకరించారు. దీని బట్టి కలర్‌ కన్నా పాత్రకు విలువ వుంటుంది అనేది అందరికీ అర్థమయింది. మా టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను’ అంటూ ఆమె కార్తీక దీపం సీరియల్‌తో తన అనుభవాలను పంచుకున్నారు.
భర్త సహకారంతో…
2017లో ఈమె వరల్డ్‌ బెస్ట్‌ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందిన వినీత్‌ను వివాహం చేసుకున్నారు. ఈయన మలయాళీ ఇండిస్టీలో ప్రొడ్యూసర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు నటిగా తాను మంచి పేరు తెచ్చుకోవడానికి భర్త ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అని ఆమె అనేక సార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భర్త సహకారం లేకపోతే నటిగా జర్నీ కొనసాగేదే కాదని అంటారు. తెలుగు కంటే ముందు ఈమె మలయాళంలో పలు సీరియల్స్‌ చేశారు. ఎన్నింట్లో నటించినా ‘ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం’ అనే పాట వినిపిస్తే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు.
ఫుల్‌ ఫాలోయింగ్‌
ఒక్క కార్తికదీపం సీరియల్‌తోనే ప్రేమి బుల్లితెరపై స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం కార్తీకదీపం 2లో నటిస్తున్నారు. ఇంకా చెల్లెలి కాపురం, గోరింటాకు, జాతరో జాతర వంటి సీరియల్స్‌లోనూ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణాదిలోనే ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉన్న బుల్లితెర నటిగా గుర్తింపు దక్కించుకున్నారు. కేవలం సీరియల్సే కాకుండా సినీ రంగంలో కూడా రాణించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అకమే అనే ఓ మలయాళ చిత్రంలో నటించారు. ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీలో కనిపించారు. అలాగే సాల్మన్‌ 3డీ తమిళ చిత్రంలోనూ కనిపించారు.
– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -