పైకి గ్లాసులా కనిపించే ఒక రకమైన మెటల్‌తో కట్టబడి ఉన్న బిల్డింగ్స్‌తో నిండిపోయి ఉంది ఆ ప్రాంతం. గాలి చొరబడే సందు కూడా లేకుండా ఎక్కడ చూసినా అలాంటి భవనాలే… ఆకాశాన్ని తాకుతున్నాయా! అన్నంత ఎత్తులో కనిపిస్తున్నాయి. అలాంటి భవనంలోని ఒక గదిలో…
”మాష్టర్ చిషామిషా థిస్ ఇస్ యువర్ ఫుడ్ టైం” అని అలెక్సా గుర్తు చేసింది.
”థాంక్యూ అలెక్సా” అంటూ స్క్రీన్ ముందు నుంచి లేచాడు 12 ఏళ్ల చిషామిషా.
గాజు సీసాలో భద్రపరిచిన ఓ కేప్సిల్ మింగాడు. పక్కనే ఉన్న ఓ కాయలాంటి దానిని నమిలేసాడు.
అది దప్పిక తీరుస్తుంది. బాడీలోని నీటి శాతాన్ని నియంత్రించే ఓ మెడిసిన్.
అన్నీ అయిపోయాక… సిస్టమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే… ఫోన్ రింగ్ అయ్యింది.
”యువర్ మదర్ వజ్ కాలింగ్” చెప్పింది అలేక్సా.
రిసీవర్ ఎత్తి ”హలో మా” అన్నాడు చిషామిషా.
”లంచ్ అయ్యిందా?” అడిగింది.
”హా జస్ట్ ఫినిష్డ్” చెప్పాడు.
”రేపు గుర్తుంది గా… ఫస్ట్ సండే… నాతో గడపాలి” అంది.
”కానీ మా… ఈ వారం గ్రాండ్ ఫా రమ్మన్నారు. మన పూర్వీకుల నకలులు చూపిస్తారట” చెప్పాడు.
”ఏంటో ఒకే ఇంట్లో ఉన్నా… వారానికి ఒకరోజు కన్నబిడ్డలను చూడాల్సి వస్తోంది” అంది బాధగా.
”అవును మా నాకూ బాధగానే ఉంది. మరి ఏంచేద్దాం… కలిసి ఉంటే ఏవో అంటురోగాలు వస్తాయనేగా… ఇలా ఉన్నాము”
”ఇలా ఎంతకాలం ఉండాలో!”
”ఐ మిస్ యూ సో మచ్ మా… ఐ విల్ ప్రామిస్ యు. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు మీట్ యు. సారీ మా… క్లాస్ టైం అవుతోంది మా. బై… ఐ లవ్ యూ” అంటూ ఫోన్ పెట్టేసి సిస్టం దగ్గరికి వెళ్ళాడు చిషామిషా.
ఆదివారం రానే వచ్చింది. చిషామిషా తాతయ్య బాలు ఉండే గది దగ్గరికి వచ్చి, డోర్ దగ్గర నుంచున్నాడు.
లోపల స్క్రీన్ మీద వాడిని చూసిన బాలు, కుర్చీకి ఉన్న ఒక బటన్ నొక్కాడు. వెంటనే డోర్ తెరుచుకుంది.
బాడీ అంతా కవరయిన మెడికేటెడ్ సూట్లో ఉన్న చిషామిషా లోపలకు వచ్చాడు.
”హలో గ్రాండ్ ఫా హౌ ఆర్ యూ” అంటూ బాలు కి షేక్ హ్యాండ్ ఇచ్చి, సోఫాలో కూర్చున్నాడు.
చిషామిషాని వాడి చదువుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశాడు బాలు. అన్నింటికీ జవాబు చెప్పాడు.
చిషామిషాకు తను వేసిన పెయింటింగ్ చూపించాడు బాలు.
అందులో ఒకటి అరిటాకు గొడుగు కింద ఇద్దరు పిల్లలు వానకి తడవకుండా ఒదిగి ఉన్నారు.
ఇంకో పెయింటింగ్‌లో వాన పడుతూ ఉంటే రెండు గువ్వలు ఓ పువ్వులో దాగి ఉన్నాయి.
గువ్వలని, చినుకులను, పువ్వులను చూపించి, ”ఇవి ఏంటివి?” అని అడిగాడు.
”అవి పక్షులు, ఇవి పువ్వులు, ఇది ఆరిటాకు, పైన కురిసేవి వానచినుకులు” చెప్పాడు బాలు.
”భలే భలే చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయి?” అడిగాడు చిషామిషా.
ఇవి ఒకప్పుడు ఇక్కడే ఉండేవి. పొల్యూషన్ వల్ల అన్నీ అంతరించిపోయాయి” బాధగా చెప్పాడు బాలు.
”అసలేం జరిగింది? నాకు పూర్తిగా చెప్పు” అంటూ అడిగాడు చిషా మిషా.
”ఒకప్పుడు మనభూమి, పైరు పంటలతో, పక్షుల కిలకిలా రావాలతో… సకాలంలో వర్షాలు పడుతూ… పచ్చగా కళకళలాడుతూ ఉండేది. తర్వాత తర్వాత మానవుడి మేదస్సు పెరిగి, యంత్రాలను కనిపెట్టి, వాయు కాలుష్యాన్ని సష్టించాడు. జలకాలుష్యం, ధ్వని కాలుష్యం.. ఒకటేమిటి అన్ని రకాల కాలుష్యాలకు భూమి నివేదికగా చేసాడు. ఆశ పెరిగిపోయి, మొక్కలు నరకడం మొదలు పెట్టాడు. పక్షుల నివాసాలను కూల్చి, తన నివాసాలను నిర్మించుకున్నాడు. ఏం సాధించాడు? భూమిని ఎండబెట్టి, నీటిని నిద్ర పుచ్చి, కాలుష్యాన్ని కప్పుకొని, తింటానికి తిండి లేక, పలికే మనిషి లేక, ప్రేమా, ఆప్యాయతలకు దూరంగా బతుకుతూ… తన వారసులకు ఒంటరితనాన్ని, రోగాలను బహుమతిగా ఇచ్చాడు” చెప్పాడు బాలుతాతయ్య.
”తాతయ్య మళ్ళీ మనం ఆ యుగానికి వెళ్లలేమా?” అడిగాడు చిషామిషా.
”ఎందుకు వెళ్ళలేం బేషుగ్గా వెళ్లొచ్చు” అంటూ ఏం చేయాలో చెప్పాడు.
”ఓరే చింటూ… లే…లే… బారెడు పొద్దెక్కినా, ఈ మొద్దు నిద్ర ఏంటి? లే…లే…” అంటూ తల్లి నిద్ర లేపడంతో లేచాడు చింటూ.
తల్లికి తన కల గురించి చెప్పాడు. ఆ కలలో తనపేరు చిషామిషా అని చెప్పాడు.
తల్లి ఆ పేరు విని నవ్వి, ”ఇప్పుడే వింత వింత పేర్లు వస్తున్నాయి. ఇంకా తర్వాత తరానికి ఇలాంటి వింత పేర్లు కాక ఇంకా ఎలా ఉంటాయి? మీ స్కూల్ పిల్లలందరూ కలిసి, ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి వెళతాం అని చెప్పేవు కదా! అందుకే అలా కలవచ్చి ఉంటుంది.
పోనీలే ఇప్పటికైనా మన వాళ్ళు మేల్కొన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని, ఉద్యమంగా చేపట్టారు. లేకపోతే, నీ కల నిజమయ్యేది” అంటూ చెప్పింది.
”అమ్మా స్కూల్‌కి వెంటనే తయారయ్యి వెళతాను. నేను ముందుగా వెళ్ళాలి. స్కూల్లోను, మా స్కూల్ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి, ప్రతి ఇంటికి ఒక్కో మొక్క ఇచ్చేస్తాం” అని చెప్పి, తయారవ్వటానికి, బాత్రూం వైపు గా సాగాడు చింటూ.
ఘాలి లలిత ప్రవల్లిక



