Saturday, November 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమేధావులు మౌనం వహిస్తే, మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది!

మేధావులు మౌనం వహిస్తే, మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది!

- Advertisement -

మానవ జాతుల వలసలు మొదట ఆఫ్రికా ఖండం నుండి ప్రారంభమై, ప్రపంచ వ్యాప్తమయ్యాయి. తొలిదశలో భారతదేశం చేరిన మానవ జాతులు వేట మాని, వ్యవసాయంలోకి మారి ప్రశాంత జీవనం సాగించాయి. వారే ఈ దేశ మూలవాసులు! వారికి కలహాలు, యుద్ధాలు తెలియవు. అందుకే మన సింధూ నాగరికతలో ఆయుధాలు బయటపడలేదు. అభివృద్ధిపై దృష్టి పెట్టినందువల్ల అక్కడ పట్టణీకరణ కనిపించింది. తర్వాత కాలంలో గుర్రాలపై ఆయుధాలతో వచ్చిన ఆర్యులు ఈ దేశ మూలవాసుల్ని నాశనం చేశారు. వారి భాషా సంస్కృతుల్ని ధ్వంసం చేశారు. వారి వ్యవసాయ భూముల్ని ఆక్రమించుకున్నారు. సింధూ నాగరికతలో దొరికిన లిపి పూర్తిగా ఇప్పటివరకు ఎవరూ చదవలేక పోయారు. కానీ, ఆ లిపి ద్రావిడ భాషలకు దగ్గరగా ఉందని భాషా నిపుణులు తేల్చారు. ఆ భాషను నాశనం చేసి, తమదైన సంస్కృతం వాడుకలోకి తెచ్చారు. దేశంలో విలసిల్లుతున్న బౌద్ధాన్ని నాశనం చేశారు. ఆరామాల్ని ఆలయాలుగా మార్చారు. అబద్దాల ప్రచారాలలో ఆరితేరిన మనువాదుల దౌర్జన్యాలకు హద్దూ, అదుపూ లేకుండా పోయింది. అప్పటి దాకా ఉన్న జీవన శైలిని మార్చేశారు. సమ్యక్‌ సంస్కృతిలో శాఖాహారులుగా ఉన్న వారితో జంతుబలులు చేయిస్తూ, హిందూ దేవీ దేవతల పూజలు చేయిస్తూ, ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి మూఢ నమ్మకాలు అలవాటు చేయించి, జన జీవితాన్ని అస్తవ్యస్తం చేసారు. ఎంతచేసినా, వేదాలు, పురాణాలు అన్నీ బుద్ధుడి తర్వాత రాసుకున్నవే నన్నది – చరిత్ర తేల్చిన సత్యం!

వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి గనక, వాస్తవాల వైపూ, వెలుగులవైపూ మనమిప్పుడు ప్రయాణించక తప్పదు. వైదిక మతం ప్రకటించిన వేదాలు, పురాణాలు మానవ జీవితాన్ని ఉద్దరించేవి అని చెప్పుకునే వారు, మరొకసారి వాటి సారాన్ని అవలోకనం చేసుకోవడం అవసరం! ఈరోజుల్లో ఎక్కువ నేరాలు చేస్తున్న వారంతా ఆ భావజాలాన్ని జీర్ణించుకున్న వారే. వాటిని అనుసరిస్తున్న వారేనన్నది గమనించాలి. ప్రపంచంలోని మతాలన్నీ రాయిలో దేవుణ్ణి చూశాయి. విచిత్రమేమంటే మనిషిలో మనిషిని చూడలేకపోయాయి. పైగా మనిషిలో నుంచి మానవత్వాన్ని లాగేశాయి, ఈ దేశంలో మనువాదులు మట్టిబొమ్మకు బట్టలు తొడుగుతారు. సజీవంగా తిరుగాడే మహిళలకు గుడ్డలిప్పి వీధుల్లో తిప్పుతారు. మణిపూర్‌లో వారేం చేశారో మనం ఎలా మరువగలం ? కనీసం సిగ్గుపడ్డారా? పాలకులు మహిళాలోకానికి కనీసం క్షమాపణలైనా చెప్పుకున్నారా? లేదే- అదేమరి బీజేపీ, ఆరెస్సెస్‌ మార్క్‌.
ధర్మ ధ్వజం – హైందవ చైతన్యవేదిక వారి ప్రకటన ఈ విధంగా ఉంది – 1. ఈరోజు మనం హిందువులుగా జీవిస్తున్నామంటే, అవతార పురుషుడైన శంకరాచార్యులే కారణం. కేరళ నుండి కాశ్మీరం వరకు దట్టమైన అడవులలో, సరైన దారులు లేని కాలంలో ధర్మరక్షణ కై ఆరు వేలకు పైగా ఉన్న దూరాన్ని కాలినడకన పూర్తి చేశారు. 2.శంకరాచార్యులు లేకుంటే భారతదేశం బౌద్ధ దేశమై పోయేది. తర్వాత సుల భంగా ఇస్లాం దేశమయ్యేది – అన్నది ధర్మద్వజంవారి అభిప్రాయం!

ఈ విషయాన్ని వాస్తవ దృక్కోణంలో విశ్లేషించుకుంటే, అది ఇలా ఉంటుంది! వారు అవతార పురుషుడిగా చెప్పుకుంటున్న ఆది శంకరాచార్య సాధారణ శకం 788 నుండి 820 మధ్యకాలంలో జీవించాడు. దక్షిణాన కలడిలో పుట్టి, ఉత్తరాన కేదార్‌ నాథ్‌లో కన్నుమూశాడు. దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణించాడన్నది వాస్తవం! దట్టమైన అడవుల గుండా ప్రయాణించడానికి ఆ వేద పండితుడు చాలానే కష్టపడి ఉంటాడు. అంతవరకు ఒప్పుకోవాల్సిందే! శంకరాచార్యుడు లేకపోతే భారత దేశం బౌద్ధ దేశమయ్యేది అనేది నిజమే! ఎందుకంటే, భారత దేశం ఆదిశంకరుడికి ముందే, అంటే సాధారణ శకానికి ముందే, ఇది బౌద్ధ దేశంగా వర్థిల్లుతూ ఉంది. మహోన్నతంగా విస్తరించి ఉన్న దశలో బౌద్ధాన్ని నాశనం చేసిన వారిలో ముఖ్యుడు శంకరాచార్య! బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చిన వాడు శంకరాచార్య! బుద్ధ విగ్రహాలకు మార్పులు చేర్పులు చేసి, హిందూ దేవదేవతల విగ్రహాలుగా చేయించినవాడు శంకరాచార్య! నిచ్చెనమెట్ల కుల సంస్కృతి వేళ్లూనుకునేట్టు చేయగలిగిన వాడాయన. శూద్రులను, స్త్రీలను బానిసలుగా మార్చినవాడు ఆయనే. బ్రాహ్మణులకు తప్ప విద్య అందరికీ అందకూడదని కట్టడి చేసిన మహాజ్ఞాని ఆయనే! ఇకపోతే, దేశం ముస్లిం దేశమైపోయేదనడం పూర్తిగా తప్పు. ఎందుకంటే ఈ దేశాన్ని మొఘ లులు వందల ఏండ్లు పాలించినా వారు ఈ దేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చలేదు. పరమత సహనం పాటించారు. బ్రిటీష్‌ వారు పాలించినంత మాత్రాన ఇది క్రైస్తవ దేశం కాలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి అదేం పిచ్చో- ఉన్న ఫళాన దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలని కుట్రలు పన్నుతున్నారు. చరిత్ర తిరగేస్తే, ఈ దేశం ఎప్పుడూ హిందువుల దేశంగా లేదు.

రాజకీయాల్లో వికృతచేష్టలు ఎలా ఉంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు ఒకటి చూద్దాం! ఇటీవల జరిగిందే- ఒక ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యే – నేషనల్‌ కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యేని ఎగతాళి చేస్తూ..చీర, రవిక, గాజులు చూపిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టి సవాల్‌ చేశాడు. ” ఇవి తీసుకుని నేను నీ ఇంటి కొస్తున్నా- నువ్వు మగాడి వైతే-రా-చెప్పు…నువ్వు ఏ పార్టీలో ఉన్నావో?”- అంటూ, వారి మధ్య ఉన్న గొడవలు బయటపెడుతూ ప్రెస్‌వారితో మాట్లాడాడు. వారి రాజకీయాలేవో వారు మాట్లాడుకోక, మధ్యలో ఆడవాళ్లను అవమానించడం దేనికీ? అడవాళ్లంటే అంత తేలిక అయిపోయారా? మగాడు అంటేనే సుపీరియర్‌ అనే పాత భూస్వామ్య పెత్తందారీ మనస్తత్వం ఈ రాజకీయ నాయకులు వదులుకోలేరా? నేతలే ఇలా ఉంటే ఇక సామాన్యులకేం సందేశమిస్తారూ? ఆ ప్రాంతీయ పార్టీ నేత అలా మాట్లాడినప్పుడు మహిళా సంఘాలూ, ప్రెస్‌మీట్‌ పెట్టి వెళ్లి అతని ముఖం పగలగొట్టాలి కదా? ముందు అంగవివక్ష లేకుండా నాగరికంగా మాట్లాడడం నేర్చుకోవయ్యా! అని ఎందుకు చెప్పలేదూ? రాజకీయ నాయకుల మధ్య మనస్పర్థలు, గొడవలూ ఉంటే ఉంటాయి. అవి వాళ్లు వాళ్లు చూసుకోవాలి. తిట్టుకున్నా వాళ్లు వాళ్లు తిట్టుకోవాలి. అంతేగాని మధ్యలో ఆడవాళ్ల ప్రసక్తి ఎందుకూ? వాళ్లను కించపరచడం ఎందుకూ? ఆలోచన పెరగాల్సిన పనిలేదా? మనుస్మృతి ప్రకారం ఆడవాళ్లు బానిసలు కదా? శూద్రులు కదా? ఆ ఆలోచనా విధానం తలకెక్కించుకున్న ప్రతివాడూ వాడు శూద్రుడైనా సరే, ఇతర శూద్రుల్ని అవమానిస్తూ మాట్లాడడమెందుకూ?

మరో విషయం చూద్దాం! కేరళలోని కొట్టాయంలో ఒక అగ్ర కుల అమ్మాయిని ఒక దళిత యువకుడు పెండ్లి చేసుకున్నాడు. అంతే – సంప్రదాయ అగ్రవర్ణం వారి చేతిలో ఆ దళిత యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగు తూనే ఉన్నాయి. సనాతనం, సంప్ర దాయం అనే పేర్లతో దేశంలో అంతర్గత ఉగ్రవాదాన్ని అధికార పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి. అలాంటప్పుడు సామానులకు రక్షణ ఎక్కడ ఉంటుందీ? ఈ విషయాల్లోని తీవ్రతను అర్థం చేసుకున్న కేరళ ప్రభుత్వం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారికి అండగా నిలబడింది. అలాంటి జంటలకు ప్రాణహాని లేకుండా ”రక్షిత గృహాలు” ఏర్పాటు చేసింది. అలాంటి కొత్త పెండ్లి జంటలు ఈ గృహాలలో సంవత్సరం పాటు సురక్షితంగా ఉండొచ్చు. వారికి ప్రభుత్వం ముప్పయి అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇలాంటి దంపతుల్లో ఎస్సీ, ఎస్టీలు గనక ఉంటే, వారికి అదనంగా మరొక డెబ్బయి అయిదు వేల సహాయం ఇస్తుంది. ఈ విషయం కేరళ ఆరోగ్య, సామాజిక, న్యాయ శాఖామంత్రి ప్రకటించారు. ఇలాంటి ఆశాజనకమైన వార్త చెన్నరు నుండి కూడా వచ్చింది. ”అడిగిన వారికి నో కాస్ట్‌, నో రిలిజియన్‌ సర్టిఫికెట్లు ఇవ్వండి!”- అని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇది 13 జూన్‌ 2025 నాటి సమాచారం.

నానాటికీ సంక్లిష్టమైపోతున్న నేటి సమాజంలో బాధ్యతగల పౌరుల కర్తవ్యం మరింత కీలకంగా మారింది. కారణం బ్రాహ్మణ వాదానికి భజనలు చేసే దళితవాదులు, స్త్రీవాదులూ పెరిగిపోయారు. సైన్సును వక్రీకరించే సైంటిస్టులు, టీచర్లూ ఎక్కువైపోయారు. సమాజ రుగ్మతల్ని బలంగా, బహిరంగంగా చెప్పలేని వామపక్ష వాదులూ కొందరుంటున్నారు. దేవుడూ, దయ్యం అబద్దాలని తెలిసి కూడా, వాటిని వదిలేసి కేవలం సైన్సు మాత్రమే మాట్లాడుతామంటున్నాయి కొన్ని సైన్సు సంఘాలు. వీటికి తోడు మత విద్వేషాలతో జనాన్ని విడగొడుతున్న ప్రభుత్వాలు అధికారంలో ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో నిజాల నిగ్గుతేల్చగల హేతువాదులు, రచయితలు, వక్తలు, సైన్సు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు మనకు అధిక సంఖ్యలో కావాలి. వీరిని మనలో నుంచే మనం తయారు చేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చింది. వైజ్ఞానిక దృక్పథంతో ముందుకు దూసుకుపొగల యువతరాన్ని మనం ప్రోత్సహించాల్సి ఉంది. ఆలోచనా పరులు మౌనం వహించాల్సిన సమయం కాదు. వారు గొంతు విప్పాల్సిందే! త్యాగాలకు సిద్ధపడాల్సిందే!! లేకుంటే, ఇప్పుడున్న మూర్ఖుల సంఖ్య రెండింతలు, మూడింతలుగా పెరిగిపోతుంది. హేతువాద ప్రపంచానికి రూపకల్పన చేసుకోవడం కోసం, దేశ పౌరులంతా అంకిత భావంతో కృషిచేయాల్సి ఉంది! జై ఇన్సాన్‌ !!

సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌
డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -