Tuesday, February 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యార్థినుల 'నెలసరి'ని జీవించేహక్కుగా చేస్తే, మార్పు వస్తుందా?

విద్యార్థినుల ‘నెలసరి’ని జీవించేహక్కుగా చేస్తే, మార్పు వస్తుందా?

- Advertisement -

ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తన సుదీర్ఘ ఆదేశాలను వెలువరించింది. దేశంలో విద్యార్థినుల నెలసరి ఆరోగ్య సమస్యను, భారత రాజ్యాంగంలోని జీవించే హక్కులో భాగమని విశ్లేశించింది. స్కూలు విద్యార్థి నుల నెలసరి సమస్య నిర్వహణ వారి విద్యార్జన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తే, అది వారి విద్యా హక్కునూ, ఇంకా వారికి గల గౌరవప్రదమైన జీవించే హక్కునూ ప్రభావితం చేసినట్టేనని పేర్కొంది. కాబట్టి, పౌరుల ప్రాథమిక హక్కులకు జవాబు దారీ అయిన ప్రభుత్వాలు తమ తప్పనిసరి బాధ్యతగా, ఈ విషయంలో ఆడపిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధానాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఆదేశం మూడు నెలల్లోగా అమలు రూపం తీసుకో వాలని గడువు విధించింది. ఇంకా, ఈ విషయాల పర్యవేక్షణ బాధ్యతను విద్యా శాఖకూ, బాలల హక్కుల కమిషన్‌లకూ అప్పగించింది కూడా. ఈ ఆదేశమొక చారిత్రాత్మకమైన ముందడుగుగా చెప్పొచ్చు.

ఆడపిల్లల నెలసరి ఆరోగ్య సమస్య స్కూల్లలో వారి హాజరునూ, మానసిక కేంద్రీకరణనూ ప్రభావి తం చేస్తే, అది వారిని పూర్తి స్థాయి సామర్థ్యాలతో ఎదగకుండా అడ్డుకుంటూ, వారి భవిష్యత్తు నిర్మాణానికి ఆటంకం కాగలదు. ఇది, కేవలం వారు ఆడపిల్లలు అయినందువల్ల తలెత్తే సమస్య. ఆ సమస్య వేయగల ప్రభావాన్ని కనిష్టం చేసుకోలేని పిల్లల కుటుంబాల ఆర్థిక స్తోమత ఈ విషయంలో మరో ప్రధాన అడ్డంకి. ఇలా, వారి జెండరే ఒక సమస్య కాగా, వారి పేదరికం మరో ప్రధాన ఆటంకం. ఈ నేపథ్యంలో వచ్చిన సుప్రీం మధ్యంతర తీర్పు ఉద్దేశ్యాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఈ తీర్పు కొంత సంతోషాన్నీ, ఎక్కువ నిర్వేదాన్నీ కలుగజేస్తున్నది. సంతోషం ఎందుకంటే, ఇప్పుడు అరకొరగా అమలవుతున్న ఈ విధానం కోర్టు ఆదేశాలతో మరి కొంత విస్తృతంగా అమలయ్యే అవకాశం ఉంది. కోర్టు చెప్పిన స్థాయిలో కాకపో యినా, ప్రభుత్వాలు కనీసం, విద్యార్థినిలకు సానిటరీ పాడ్స్‌ని సరఫరా చేసే పథకంగా దీన్ని అమలు చేసినా, చాలామంది పేద, మధ్యతరగతి ఆడపిల్లలకు ఎంతో సహాయం చేసినట్టే.

నిర్వేదం ఎందుకంటే, కోర్టులు ఏం చెప్పినా ప్రభుత్వాల దగ్గర నుండి ఆ స్థాయి స్పందన ఆశించే కాలం పోయింది. ఇది కాక, కనీసం సగం ప్రభుత్వ స్కూళ్లలో ఇవాళ్టికీ సురక్షిత మంచినీళ్లకూ, కనీసస్థాయి టాయిలెట్లకూ, పుస్తకాలకీ, యూనిఫారాలకే అవకాశాల్లేని పరిస్థితులున్నాయి. ఇక సానిటరీ పాడ్స్‌ వెండింగ్‌ మిషన్స్‌, పర్యావరణహితమైన డిస్పోజబుల్‌ వ్యవస్థ లనేవి ఊహించనలవి కాని విషయాలు. నిజానికి, స్కూళ్లు, గ్రామీణ పేద మహిళల కోసం శానిటరీ ప్యాడ్స్‌ అందించే పథకం మన దేశంలో 2011 లోనే ప్రారంభమైంది. ఇటీవల, పర్యావరణ హితమైన సానిటరీ పాడ్స్‌ని దేశవ్యాప్తంగా సబ్సిడీ రేట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. అయితే, అన్నీ అరకొరగానే నడుస్తున్నాయి. రెసిడెన్షియల్‌ స్కూళ్లకు మాత్రం ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వాలు సప్లై చేస్తున్నాయి. వాటి ఉపయోగానంతరం సురక్షిత డిస్పోసల్‌ వ్యవస్థలు మాత్రం ఎక్కడా లేవు. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా చాలా దేశాలలో స్కూలు, కళాశాలల విద్యార్థినులకు ఉచిత శానిటరీ పాడ్లను ఆయా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంచటం పెరుగు తున్నది. ఈ నేపథ్యంలో, కొంత కాలంగా ఈ విషయంలో ప్రభుత్వాల పథకాలూ, ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలూ పెద్ద అనూహ్యమైనవేమీ కావు.

సమస్య తీవ్రతను కోర్టు దృష్టికి తెచ్చిన పిటిషనర్ల ఉద్దేశాలకనుగుణంగా, ఆడపిల్లల ఆరోగ్య సమస్యను వ్యక్తిగతమైనదిగా కాక, అది సామాజిక సమస్య అనీ, ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత ఉందని చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆదేశం ఆహ్వానించదగ్గదే. అయితే విద్యార్థినుల నెలసరి ఆరోగ్య పరిరక్షణను జీవించే హక్కులో భాగంగా వ్యాఖ్యానిస్తే తప్ప పాలకులు కదలని స్థితి ఉండటమే విచారకరం. పౌరులు తమ వికాసానికి సంబంధించిన అంశాలను సొంతంగా నిర్వహించుకోలేక లేదా అరకొరగా మాత్రమే నిర్వహించుకుంటూ, మిగతా వారికంటే వెనుకబడి పోతుంటే ఆ లోపాన్ని సవరించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవటం నాగరికం, నైతికం. దీనికి సంక్లిష్టమైన సిద్ధాంతాలు, సాహసోపేత వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఇటువంటి వాఖ్యా నాలు విషయాన్ని పండిత చర్చలుగా మారుస్తాయి తప్ప, సమస్యను సరిగ్గా పరిష్కరించే మార్గాలు కావు. సరైన మార్గం ఏమిటంటే ఇటు వంటి సమస్యలన్నీ ప్రజల ఆర్థిక స్థాయితో ముడిపడి ఉంటాయని గుర్తించటం. ఈ విషయాల్లో ప్రభుత్వాల బాధ్యత ప్రజల ఆర్థిక, సామాజిక హక్కులను గుర్తించడం అవుతుంది. భారతదేశంలో పౌర రాజకీయ హక్కుల కంటే ఆర్థిక, సామాజిక హక్కులు ముందు వరుసలో ఉండాలి. విచారకరంగా, మన రాజ్యాంగం పౌర రాజకీయ హక్కులను ప్రాథమిక హక్కులు చేసి ఆర్థిక, సామాజిక హక్కులను ఆదేశిక సూత్రాల్లో మాత్రమే పెట్టుకోగలిగింది. ఆదేశిక సూత్రాలు పరిపాలనకు ఆదర్శాల లాంటివే కానీ, వాటిని అమలు చేసి తీరాల్సిన బాధ్యత తమకు లేదని పాలకులు భావిస్తారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా కాలంగా ఈ ఆర్థిక సామాజిక హక్కులను పౌర, రాజకీయ హక్కుల్లోని అతి ముఖ్యమైన జీవించే హక్కుకు అనుసంధానం చేయటానికి తంటాలు పడుతున్నది. అలా గత నలభై ఏళ్లుగా జీవించే హక్కును విశ్వాంతరాలం లాగా విస్తరింపజేస్తూ వెళ్తున్నది. గౌరవప్రదం, జీవనోపాధి, గృహవసతి, విద్యా , వైద్యం, పర్యావరణం వంటి వాటిని కలుపుకుని ఇప్పటికి 26 అంశాలను అలా జీవించే హక్కులో భాగం అన్నారు. ఈ పరంపరలో ఇప్పుడీ నెలసరి ఆరోగ్య హక్కు ఇరవై ఏడవది. తప్పనిసరి ప్రాథమిక విద్య అనే అంశం ఒక్కటే రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరింది. మిగతావేవీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానాల పరిధి దాటి ముందుకు కదలలేదు. అసలు జీవించే హక్కునే రోజూ ‘ఎన్‌ కౌంటర్‌’ చేస్తున్న కాలంలో ఈ కొసరు జీవించే హక్కులకు హామీ పడేదెవరు?

ఒక సమస్యకు పరిష్కారం ప్రాథమిక హక్కుల జాబితాలో ఉందా? ఆదేశిక సూత్రాల జాబితాలో ఉందా?అని చూడటం ఒక ఎత్తయితే, ఆ సమస్యకు పరిష్కార బాధ్యతను తీసుకునే పాలకులే ఉంటే, ఆచరణలో ఏ సమస్య పరిష్కారానికీ ఇది అడ్డంకి కాదు. ఒకవైపు, సమాజంలో ఆర్థిక సామాజిక అంతరాలను మరింత పెంచే పరిపాలనల మధ్య, ఏ అవసరాన్ని ఎంత పెద్ద హక్కులో భాగం చేస్తే మాత్రం పరిస్థితిలో మార్పు వస్తుందా? ప్రజల చైతన్యమే పరిస్థితిల్లో మార్పు తెస్తుంది.

డా.ఎస్‌ తిరుపతయ్య
9849228212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -