Friday, March 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం ముగియాలంటే. .

యుద్ధం ముగియాలంటే. .

- Advertisement -

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ మూడు షరతులు
హార్ముజ్‌ జలసంధిపై కీలక వ్యాఖ్యలు

టెహ్రాన్‌ : అమెరికా, ఇజ్రాయిల్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ మూడు షరతులు విధించారు. ఇరాన్‌ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలనీ, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలనీ, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగబోవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.
ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్‌ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదనీ, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని మసూద్‌ పెజెష్కియాన్‌ హెచ్చరించారు.

హార్ముజ్‌ జలసంధి గుండా నౌకలు వెళ్లేందుకు మా అనుమతి తప్పనిసరి’
హార్ముజ్‌ జలసంధిపై కూడా ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించాలనుకునే నౌక ఇరాన్‌ ఆమోదం పొందాలని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషన్‌ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) నావల్‌ ఫోర్స్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ అలిరేజా టాంగ్సిరి తెలిపారు. లేదంటే ఆ నౌక ఇరాన్‌ దాడులకు లక్ష్యంగా మారవచ్చని పేర్కొన్నారు. ఇరాన్‌ హెచ్చరికలను పట్టించుకోని రెండు నౌకలను బుధవారం హార్ముజ్‌ జలసంధిలో లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ”హార్ముజ్‌ జలసంధి గుండా నౌకలు సురక్షితం గా ప్రయాణించాలంటే ఇరాన్‌ అనుమతి ఉండాలి. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్‌ రోమ్‌, మయూరీ నరీ అనే నౌకల సిబ్బందిని అడగాలి. వారు ఎవరో ఇచ్చిన హామీలను నమ్మి మా హెచ్చరికలను విస్మరించారు.

హర్మూజ్‌ జలసంధిని దాటాలని అనుకున్నారు. కానీ మాకు దొరికిపోయారు. జలసంధి దాటాలనుకునే ఏ నౌక అయినా ఇరాన్‌ నుంచి పర్మిషన్‌ పొందాల్సిందే.” అని అలిరేజా టాంగ్సిరి వార్నింగ్‌ ఇచ్చారు. తమపై యూఎస్‌-ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధి గుండా నౌకల ప్రయాణంపై ఆంక్షలను మరింత తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయిల్‌కు సహకరించని నౌకలు సురక్షితంగా హార్మూజ్‌ గుండా ప్రయాణించవచ్చని ఇరాన్‌ చెబుతోంది. ప్రతిరోజూ 20 మిలియన్‌ బ్యారెళ్లకుపైగా ముడి చమురు ఇరాన్‌ తీరాన్ని ఒమన్‌ నుంచి వేరు చేసే ఇరుకైన ఛానల్‌ గుండా వెళ్తుంది. ఆ పరిమాణం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతు. మొత్తం సముద్రమార్గ చమురు వాణిజ్యంలో దాదాపు పావు వంతు ఉంటుంది.

శత్రుదేశాలపై ఇరాన్‌ క్షిపణుల దాడి : ఐఆర్‌జీసీ
శత్రుదేశాల్లోని పలు ప్రాంతాలపై నిర్ణయాత్మక దాడులను ప్రారంభించామని ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ ) తెలిపింది. ఈ క్రమంలో ఖాదర్‌, ఎమాద్‌, ఖైబార్‌ షెకాన్‌, ఫట్టా వంటి క్షిపణులను ప్రయోగించామని పేర్కొంది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాతో కలిసి సంయుక్తంగా ఈ దాడులు చేపట్టినట్లు స్పష్టం చేసింది. జియోనిస్ట్‌ (ఇజ్రాయిల్‌) మీడియా వర్గాలు ధ్రువీకరించినట్టుగా గత 24 గంటల్లో ఇజ్రాయిల్‌పై క్షిపణుల దాడులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. దీంతో ఇజ్రాయిల్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ జోర్డాన్‌లోని అల్‌ అజ్రాక్‌, సౌదీ అరేబియాలోని అల్‌ ఖార్జ్‌ ప్రాంతాల్లో అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఇది అబద్ధాలాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, దురుద్దేశపూరిత ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తీసుకువచ్చిన యుద్ధ ఫలితమని పేర్కొంది.

ఇరాన్‌లో 16 వేలకుపైగా నివాస యూనిట్లపై దాడులు
ఇరానియన్‌ స్టేట్‌ మీడియా ప్రకారం…అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌లోని 16,000కి పైగా నివాస యూనిట్లపై దాడులు చేశాయి. అలాగే 19,734 సైనికేతర భవనాలపై దాడులు చేపట్టాయి. ఈ దాడులు జరిగిన వాటిలో 77 వైద్య కేంద్రాలు, 16 రెడ్‌ క్రెసెంట్‌ సౌకర్యాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -