నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా రూపొందించి ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా, ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నీ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో గ్రామపంచాయతీ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ పై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28 న సంబంధిత ఎంపీడీవోల ద్వారా మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని, ఈ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలను ఈ నెల 28 నుండి 30 వరకు సమర్పించవచ్చని తెలిపారు.
వచ్చిన అభ్యంతరాలను ఈనెల 31న పరిశీలించి, పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న( శనివారం ) ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా పై అభ్యంతరాలు తెలపవచ్చని కలెక్టర్ సూచించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
నల్గొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా, 7494 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 10 లక్షల 73,506 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైతే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అధికారం ఉంటుందని వివరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఉప ఎన్నికల అధికారి నారాయణ అమిత్ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రక్రియను వివరించారు.
ఈ సమావేశానికి బి ఆర్ఎస్ నుండి కంచర్ల భూపాల్ రెడ్డి ,మల్లికార్జున్, పంకజ్ యాదవ్, పిచ్చయ్య, బిజెపి నుండి లింగస్వామి, బిఎస్పీ నుండి యాదగిరి, టిడిపి తరఫున రఫీక్, సిపిఐఎం తరఫున హాజరైన నర్సిరెడ్డి లు పలు సూచనలు చేశారు. ముసాయిదా ఓటరు జాబితా కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందుగానే అందించాలని, డబుల్ ఓటర్లను తొలగించాలని, ఏ వార్డులోని ఓటర్లు అదే వార్డులో ఉండేలా చూడాలని, ఒక ఇల్లు ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారిగా వాట్స్అప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, అభ్యంతరాల సమర్పణకు తేదీ పొడిగించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులను మార్చాలని కోరారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి సైదిరెడ్డి ,ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్కే అన్సారి, అద్దంకి రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ,జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి ,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.