No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజిప్రణాళికలుంటే జనాభా కూడా వరమే!

ప్రణాళికలుంటే జనాభా కూడా వరమే!

- Advertisement -

జనాభా అంశంపై ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ అధిక జనాభాతో బాధపడుతున్నట్లు భావించి నియంత్రణ చర్యలు పాటిస్తుండగా.. మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదల కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణ కోసం కఠిన చట్టాలు అమలు చేసిన దేశాలు కూడా ఇప్పుడు సడలింపులు ఇస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని, చక్కని ప్రణాళికలతో జనాభాను వినియోగించుకుంటే అది దేశానికి శాపంగా కాకుండా వరంగా మారే అవకాశాలే ఎక్కువని పలు దేశాలు ఇప్పటికే నిరూపించాయి.అలా చూస్తే అధిక జనసాంద్రత ఉన్నప్పటికీ సింగపూర్‌ దేశం సమర్థవంతమైన ప్రణాళిక ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లకు పైనే. 2080 నాటికి ఇది 1030 కోట్లకు చేరవచ్చని అంచనా. జనాభా పెరుగుదల సమ స్యలు దేశాల ఆర్థిక, సామాజిక, పర్యావరణ సందర్భాలపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రణాళిక లేనప్పుడు జనాభా పెరుగుదల ఒత్తిడిని సృష్టిస్తుంది, కానీ సమర్థవంత మైన విధానాలతో ఈ సవాళ్లను అధిగమించ వచ్చు. జనాభాను అంకెల పరంగానే కాకుండా జనసాంద్రత పరంగా పరిశీలిస్తే కూడా కొన్ని దేశాలు సరైన ప్రణాళికలతో ఎలా అభివృద్ధిపథంలో నడిచాయో తెలుస్తున్నది. జనాభాలో మొన్నటి వరకు ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండి ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న చైనా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. చైనా జనాభా ప్రస్తుతం 142 కోట్లు. అయితే జనసాంద్రత పరంగా ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా 83వ స్థానంలో ఉంది. చదరపు కిలోమీటర్‌ కు 153 మంది నివసిస్తున్నారు. అయితే 1980 నుంచి 2015 వరకు చైనా వన్‌ చైల్డ్‌ పాలసీని కఠినంగా అమలు చేసింది. దీని ద్వారా సుమారు 40 కోట్ల జనాభాను నియంత్రించగలిగింది. అయితే ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఆ దేశం జనాభా వన రులను సమర్థవంతంగా ఉపయోగించింది. ఫలితంగా ఇప్పుడు చైనా రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. వృద్ధ జనాభా ఎక్కువ కావడం, లింగ నిష్పత్తిలో తేడాలు రావడంతో ఆ దేశం వెంటనే అప్రమత్తమైంది. 2015లో టూ చైల్డ్‌ పాలసీ, 2021లో మూడు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది.
భారతదేశం 3,287,263 చ.కి.మీ. వైశాల్యంతో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉన్నది. కానీ 143 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడ జనసాంద్రత (485/చ.కి.మీ.) కూడా ఎక్కువే. అయితే ఉత్తర, భారత దేశాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను కఠినంగా పాటించాయి. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే దేశంలో యువ జనాభా 65శాతం (35 ఏళ్లలోపు) ఉంది. ఈ అంశం సరైన ప్రణాళికతో ఆర్థికవృద్ధికి దోహద పడగలదు. సరైన అర్బన్‌ ప్లానింగ్‌ పాలసీ, ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక వినియోగం వంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. విద్య, ఆరోగ్యం, సాంకేతికతను ఉపయోగించి జనాభాను ఒక శక్తిగా మార్చాలి. ఎక్స్‌ పోర్ట్‌-ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువ జనాభాను ఉత్పాదక శక్తిగా మార్చవచ్చు. సాంకేతికతను ఉపయోగించి, గ్రామీణ-నగర అసమానతలను తగ్గించవచ్చు.సమర్థవంతమైన ప్రణాళికల ద్వారా, జనాభా సమస్యల సవాళ్ల నుండి అధిగమించవచ్చు.
(నేడు ప్రపంచ జనాభా దినోత్సవం)
-ఫిరోజ్‌ ఖాన్‌,
9640466464

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad