Saturday, July 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభద్రత లేని బతుకులు

భద్రత లేని బతుకులు

- Advertisement -

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల నేపథ్యంలో భారతదేశ కార్మిక రంగంలో గణనీ యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు శాశ్వత ఉద్యోగాలు కార్మికులకు ఆర్థిక భద్రత, సామా జిక గౌరవాన్ని కుటుంబ స్థిరత్వాన్ని కల్పించేవి. కానీ, నేడు ఫిక్స్డ్‌టర్మ్ కాంట్రాక్ట్ ఔట్‌‌సోర్సింగ్ క్యాజువల్ వంటి నాన్ రెగ్యులర్ ఉద్యోగాల విస్తరణ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రయివేటు సంస్థలు ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ విధానాన్ని ప్రభుత్వాలు ముందుకు తెస్తున్నాయి. దీని ఫలితంగా ఫిక్స్‌డ్‌టర్మ్, నాన్ రెగ్యులర్ ఉద్యోగాలు యాజమాన్యాలకు లాభదాయకంగా ఉన్నది. కార్మిక వర్గం తీవ్ర శ్రమదోపిడీకి గురై అస్థిరతను ఎదుర్కొంటోంది. తెలంగాణ ఫ్యాక్టరీల శాఖ గణాంకాల ప్రకారం.. 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 10,368 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 8,37,000 మందికి పైగా కార్మికులు ఉండగా, ఈ పరిశ్రమల్లో 83 శాతం మంది కాంట్రాక్ట్ (నాన్ రెగ్యులర్) కార్మికులు, 17 శాతం మాత్రమే శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. వీరే శాశ్వత ఉద్యో గులు చేస్తున్న పనిని చేస్తున్నారు. కానీస శాశ్వత ఉద్యోగులకున్న వేతనం, పని గంటలు, ఈఎ‌స్‌ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, ఇతర హక్కులు, సౌకర్యాలు నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్‌కు లేవు. మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

ఈ విధానం ద్వారా శాశ్వత ఉద్యోగాలను తగ్గించి తక్కువ వేతనాలు చెల్లిస్తూ, హక్కులు, సౌకర్యాలు లేకుండా కార్మికులను యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. వేతనం పొందే కార్మికుల స్థానంలో స్టైఫండ్ ఇచ్చి శాశ్వత ఉద్యోగులు చేసే పనిని చేయించుకుంటున్నారు. ఉపాధి భద్రత, కనీస వేతనం, ఈఎస్‌ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ వంటి కార్మిక హక్కులను యాజమాన్యాలు కాలరాస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భువనగిరి జిల్లా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజీవ్ పరిశ్రమ ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోగా ,పదహారు మంది గాయపడ్డారు, షాద్‌నగర్ ముర్గుల గ్లాస్ పరిశ్రమలో ఆరుగురు మృతి చెందగా ఇరవై మంది గాయపడ్డారు, జహీరాబాద్‌లోని మంగళా ట్యూబ్, అల్ఫ్‌లో ఒక్కొక కార్మికుడు డ్యూటీలోనే సేఫ్టి లేక చనిపోగా ముంగి, పోలార్ పరిశ్రమల్లో చెయ్యి పోయి అంగవైకల్యంగా మారారు. మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీలో ఒక్కనెలలోనే కనీసం పది మంది గాయాల పాలయ్యారు. ఈ మధ్య ఒక కార్మికుడి కాలు ఫ్యాక్చర్ కావడం, సిఐఇ, మహింద్రా, మహింద్రా, అల్ఫ్, ముంగి, మంగళా ట్యూబ్, పోలార్, రాష్ట్రంలో అనేక పరిశ్రమల్లో కనీసం నెలలో పది మందికైన గాయలవుతున్నాయి.

గ్లోబల్ సిటీ, స్మార్ట్ సిటీ పేరుతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారార్భాటం చేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు రాయితీల వర్షం కురిపిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘ఆరు గ్యారెంటీల’ను గాలికొదిలేసింది. ఈ కాలంలోనూ అన్ని రంగాల్లోని కార్మికులు పోరాటంలోకి వస్తున్నారు. కార్మికవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తి క్రమంగా పెరుగు తున్నది. మేడ్చల్ జిల్లా షాహి ఎక్స్‌పోర్ట్ కార్మికులు పోరాడి కొంత వేతనాలు, సమస్యలను పరిష్కరించు కున్నారు. హెచ్‌బిఎల్, సంగారెడ్డి జిల్లాలోని బిస్లరీ కంపెనీ కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులపై పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో పాటు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, పనిభారాలు పెంచుతూ యాజమాన్యాలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పాలకులు మారినా కార్మిక, ప్రజా సమస్యలు, కష్ట జీవుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. సమస్యల పరిష్కారం వైపు చిత్త శుద్ధి ప్రదర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. సమ్మెలు, పోరాటాలు చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రావని బెదిరిస్తున్నది. కార్మికోద్యమంపై నిర్భంధ చర్యలను కొనసాగిస్తున్నది.

సంపదను సృష్టించి దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులే నేడు ఉద్యోగ భద్రత లేకుండా, అభివృద్ధికి దూరంగా జీవించాల్సిన పరిస్థితికి ప్రభుత్వాలు నేడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ టర్మ్, నాన్ రెగ్యులర్ ఉద్యోగాలతో లక్షలాది కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతుంది. ఈ విధానం వల్ల శాశ్వత ఉద్యోగాలు భవిష్యత్‌లో ఉండవు. ప్రతి క్షణం ఉద్యోగ భద్రతపై ఆందోళనతో అభద్రత భావంతో జీవించాల్సిన దుస్థితికి కార్మికులు దిగజారిపోతున్నారు. భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్‌ను తెచ్చిన బీజేపీ విధానం వల్ల కార్మిక రంగంలో ఫిక్స్‌డ్‌టర్మ్ ఉద్యోగ విధానం ఒక ముఖ్యమైన అంశంగా మారింది. కార్మికులను ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే నియమించుకుంటున్నారు. ఒప్పందంలో ఈ పేర్కొన్న కాలం పూర్తయిన తర్వాత ఎటువంటి తొలగింపు ఉత్తర్వులు ఇవ్వకుండానే ఉద్యోగం ముగుస్తుంది. ఫిక్స్‌డ్ టర్మ్ విధానంతో యాజమాన్యాలు తమ అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియ మించుకునే తొలగించే సౌలభ్యం ఉన్నది. ఇది కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ఫిక్స్ టర్మ్ ఉద్యోగాల ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత లేకపోవడం శాశ్వత ఉద్యోగాలు ఉండే స్థిరత్వం వీరికి ఉండదు ఒప్పంద కాల ముగిసిన తర్వాత తిరిగి ఉద్యోగం ఇస్తారో లేదో అనే అని అనిశ్చితి నిరంతరం వెంటాడుతుంది. దీంతో కార్మికులు నిరంతరం భయాందోళన మధ్య పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితిలో కుటుంబం ఉంటుంది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేసినప్పటికీ వారికి తక్కువ వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంటోంది. ఇది ఉద్యోగ అనిశ్చితి కుటుంబం జీవితంపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగ భద్రత అనేది కేవలం ఉపాధి కొనసాగింపునకు సంబంధించిన విషయం మాత్రమే కాదు అది కుటుం బ ఆర్థిక స్థిరత్వానికి పిల్లల విద్య, వైద్యం వృద్ధాప్య భద్రతకు గౌరవప్రదమైన జీవితానికి పునాది. ఉద్యోగం శాశ్వతంగా ఉంటుందని నమ్మకం ఉన్నప్పుడు కార్మికుల తన భవిష్యత్తును ప్రణాళికాబద్ధంగా నిర్మించుకోగలుగుతాడు. మానసికంగా ప్రశాంతంగా కుటుంబంతో జీవించగలడు. అది కార్మికుడి ఆలోచన స్వేచ్ఛను హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఫిక్స్‌డ్‌టర్మ్ నాన్ రెగ్యులర్ ఉద్యోగులు నిర్దిష్ట కాలపరిమితిలో ఉన్న ఒప్పందాలపై పనిచేస్తారు వారి ఉద్యోగం కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయం యాజమాన్యాల చేతిలోనే ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో కార్మికులు కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని విధానం, అదనపు పనికి రెట్టింపు వేతనం, ఈఎస్‌ఐ, పిఎఫ్ వంటి చట్టబద్ధ సదుపాయాలు అమలు కావడం లేదని లేదా పని ప్రదేశంలో భద్రత ప్రమాణాలు పాటించడంలేదని అధికపని భారంపై ఉద్యోగి ప్రశ్నిస్తే యాజమాన్యం కార్మికుడిని ఉద్యోగం నుండి తీసివేయడం లేదా ఒప్పంద కాలం తర్వాత తిరిగి ఉద్యోగం కొనసాగించే పరిస్థితి ఉండదు. ఈ భయం కారణంగా అనేకమంది ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిన మౌనంగానే భరించాల్సి వస్తున్నది. చట్టపరంగా తమ హక్కులు ఉన్నాయని తెలిసినా వాటిని డిమాండ్ చేయడానికి వెనుకడుగు వేస్తు న్నారు. ఎందుకంటే ఉద్యోగం కోల్పోతే కుటుంబ పోషణ, పిల్లల చదువు, ఇంటి అద్దె, వైద్యం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా ఉద్యోగం నిలబెట్టుకోవడమే కార్మికుడికి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.

వ్యక్తిగత స్థాయిలోనే కాదు సామూహిక స్థాయిలో కూడా ప్రభావం చూపుతోంది ఉద్యోగ భద్రత లేని పరిస్థితిలో కార్మికులు యూనియన్ పెట్టుకుని సంఘటితంగా యాజమాన్యాన్ని తమ సమస్యలను పరిష్కరిం చాలని నినదించేందుకు వెనకాడుతున్నారు. దీనివల్ల కార్మికుల సంఘటితశక్తి బలహీనపడుతున్నది. యాజమాన్యాల దోపిడీ మరింత పెరుగుతోంది. అందువల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం కార్మికుడు ఉపాధిని మాత్రమే కాదు అతని హక్కులపై ప్రశ్నించే సంఘటిత పోరాట స్ఫూర్తిని కూడా పరిమితం చేస్తుంది. ఉద్యోగం కోల్పోతామనే భయం ఉన్నచోట హక్కుల కోసం స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉండదు అందుకే ఉద్యోగ భద్రతను కార్మికుల ప్రజాస్వామిక హక్కులతో ముడిపడిన అంశంగా చూడాలి. ఫిక్స్డ్ టర్మ్ నాన్ రెగ్యులర్ ఉద్యోగుల జీవితాలను అనిశ్ఛితిలోకి నెట్టే విధానాలు ఎంత పెరిగిన కార్మికుల శ్రమ విలువను ఎవరు తగ్గించలేరు. పరిశ్రమలు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కార్మి కుల శ్రమతోనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల కార్మికులు తమను తాము బలహీనంగా భావించాల్సిన అవసరం లేదు. హక్కులను ఎవరు దానం చేయరు. ఐక్యత పోరాటం ద్వారానే సాధించుకోవలసి ఉంటుంది. చరిత్ర చెబుతున్న సత్యమిదే.

కూరపాటి రమేష్, 9490098048

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -