Thursday, August 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅసమానతల అంతమే… నిజమైన స్వాతంత్ర్యం

అసమానతల అంతమే… నిజమైన స్వాతంత్ర్యం

- Advertisement -

ఎందరో మహనీయుల త్యాగాలు, దేశ ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగా బ్రిటిష్ పాలకుల దుర్మార్గమైన వలస పాలన నుంచి మన దేశానికి 15 ఆగస్టు1947న విముక్తి లభించింది. దేశానికి రాజకీయ స్వేచ్ఛ సిద్ధించింది. ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా మన దేశాన్ని నిర్మించుకునే గొప్ప అవకాశం దేశ ప్రజలకు దక్కింది. ఇప్పటికి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఎనభయ్యవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆర్థిక, సామాజిక రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను సాధించడంలో నేటికీ ఎంతో వెనుకబడ్డాం. అయితే స్వాతంత్ర్యానంతరం దేశాభివృద్ధి కోసం మెరుగైన కృషి జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు, విశిష్టమైన రాజ్యాంగ రూపకల్పన, ఆర్థిక స్వావలంబన వంటి సమున్నతమైన ప్రక్రియలను చేపట్టడంతో దేశాభ్యుదయానికి గట్టి పునాదులు పడ్డాయి. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో పాలన చేపట్టిన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహనీయులు సంక్షేమ రాజ్య స్థాపన, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ నమూనా, ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు, పంచవర్ష ప్రణాళికలు, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, వ్యవసాయ రంగ ప్రాధాన్యత, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వరంగంలో కీలక పరిశ్రమల ఏర్పాటు వంటి పలు పురోగామి చర్యలు దేశ పురోగతికి బాటలు వేశాయి.

ప్రభుత్వ రంగంలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. నాటి దేశ అవసరాల మేరకు సోషలిస్టు మోడల్ అమల్లో భాగంగా ప్రజానుకూల సంక్షేమ చర్యలను నాటి ప్రభుత్వాలు చేపట్టాయి. వాటితో పాటు అత్యంత ఉన్నతమైన పార్లమెంటరీ సంప్రదాయాలు, పద్ధతులు, విలువలను నెలకొల్పడంలో ఆనాటి తరం విశేషమైన కృషి చేసింది. స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ, మూడవ ప్రపంచ దేశాల కూటమికి నాయకత్వం వహిస్తూ, అలీన విధానాన్ని రూపొందించడంలో కూడా మన దేశం ముఖ్య భూమిక పోషించింది. ఆ తర్వాత కాలంలో జరిగిన బ్యాంకుల జాతీయకరణ అన్ని రంగాల, అన్ని వర్గాల వారి ప్రగతికి ఉపకరించింది.1990 దశకంలో జరిగిన అంతర్జాతీయ మార్పుల్లో భాగంగా మన దేశం కూడా సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీ కరణ (ఎల్.పి.జి) బాట పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మార్కెట్ల మధ్య అనుసంధానం జరిగింది. ద్రవ్య పెట్టుబడికి స్వేచ్ఛ లభించింది. మన దేశంలోని పలు కీలక రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పాలకులు అనుమతించారు.

స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో ఎగుమతులు, దిగుమతులపై ఉన్నటువంటి ఆంక్షలను క్రమంగా సడలించారు. లాటిన్ అమెరికా దేశాలతో పాటు, మలేసియా, థాయిలాండ్, సింగపూర్ వంటి తూర్పు ఆసియా దేశాలు సరళీకరణ విధానాలను భారత్ కన్నా ముందే అమలు చేసి తీవ్రమైన దుష్ఫలితాలను, చేదు అనుభవాలను చవిచూశాయి. మన దేశంలో నయా ఉదారవాద విధానాల అమలును కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రారంభించగా, బీజేపీ నాయకత్వంలోని వాజపేయి ప్రభుత్వం, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అవే విధానాలను కొనసాగించాయి. ప్రస్తుత నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం సరళీకరణ విధానాలను అత్యంత దూకుడుతో అమలు చేస్తోంది. ప్రజల ఆస్తులైన పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను ఉపసంహరించింది. బీమా రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించింది. బ్యాంకుల్లో విదేశీ వాటాలను పెంచింది. 2008లో అమెరికాతో సహా పలు అగ్ర దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయినప్పుడు, సరళీకరణ విధానాల ఆర్ధిక నమూనాలోని డొల్లతనమేమిటో స్పష్టంగా బయటపడింది. అయితే ఘోరంగా విఫలమైన అదే ఔషధాన్ని (Failed Drug) ప్రస్తుత ప్రభుత్వాలు నేటికీ కొనసాగిస్తున్నాయి.

వివిధ రంగాల్లో ప్రభుత్వ పాత్ర తగ్గిపోయింది. విద్యా, వైద్యం అత్యంత ఖరీదయ్యాయి. ఫలితంగా ప్రజలకు అవి శాపంగా మారాయి.ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు సకల వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. రాజకీయ రంగంలో డబ్బు ప్రభావం తీవ్రంగా పడింది. పరిపాలనపై కార్పొరేట్ల పెత్తనం, ఆధిపత్యం పెరిగాయి. అనైతిక పద్ధతుల్లో పలువురు నేరగాళ్లు, బడా కోటీశ్వరులు నేరుగా చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. రాష్ట్రాలతో కూడిన మన సమాఖ్య వ్యవస్థను బలహీన పరచడం, చివరకు న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేయడం, చట్టసభల్లో చర్చల స్థాయి దిగజారిపోవడం, ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం, రైతులు, విద్యార్థుల న్యాయబద్ధమైన పోరాటాలను ఖాతరు చేయక పోవటం, సామాన్య మహిళలకు రక్షణ కొరవడటం వంటి ముఖ్య సమస్యలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ మన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లక్ష్యాలకు భిన్నమైన, విరుద్ధమైన పరిణామాలు. రాజకీయాల్లో మతపరమైన జోక్యం, ద్వేషపూరితమైన వ్యాఖ్యలు, నిందారోపణలు మితిమీరిపోయాయి. మరోపక్క దేశంలో ఆర్ధిక, సామాజిక అసమానతలు తీవ్రతరమయ్యాయి. కేవలం ఒక్క శాతం మంది సంపన్నుల వద్ద దాదాపు నలభై శాతం సంపద కేంద్రీకృతమైంది.

అట్టడుగునున్న కోట్లాదిమంది ప్రజలు కనీస జీవన భద్రత, కనీస జీవన ప్రమాణాలు లేకుండా బ్రతుకుతున్నారు. ఉపాధి కొరత తీవ్రరూపం దాల్చింది. లక్షలాది మంది పనిచేస్తున్న ఐ.టి రంగంలో కూడా పరిస్థితులు సవ్యంగా లేవు. అధిక ధరలు, అత్యధిక శాతం పన్నులు ప్రజల నిజ ఆదాయాలకు విలువ లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికీ సుమారు యాభై శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం, పర్యావరణం నేటికీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. మొదటగా జరగాల్సిన మార్పు – ఎన్నికల సంస్కరణలు. దామాషా విధానంలో ఎన్నికలు నిర్వహించాలి. రాజకీయాల్లో మతం, కులం, డబ్బు పాత్రను సమూలంగా నివారించాలి. రెండవది : సమీకృత, సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ఆర్ధిక విధానాలు రూపొందించి, కోట్లాది మందికి మేలు చేకూరేలా వాటిని అమలు చేయాలి. మూడవది : కనీస హక్కులైన విద్య, ఆరోగ్యం, ఉపాధి ప్రతి ఒక్కరికీ దక్కేలా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తూ, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను,వాటి స్ఫూర్తిని గౌరవించడమే నిజమైన దేశభక్తి. అదే జాతి యోధులకు, త్యాగధనులకు, దేశ స్వాతంత్య్ర సమరయోధులకు దేశ ప్రజల దీక్షాబద్ధమైన నివాళి.

వి.వి.కే.సురేష్,
9440345850

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -