నవతెలంగాణ – హైదరాబాద్ : నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్‌కు ఉన్న ఏకైక గేటును గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున ఎత్తడంతో గ్రామంలో కలకలం రేగింది. భారీగా నీరు బయటకు రావడంతో రిజర్వాయర్ కట్ట తెగిపోయిందని భావించిన గ్రామస్థులు భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొండపైకి పరుగులు తీశారు. పిల్లలు, వృద్ధులు సహా సుమారు వెయ్యి మంది సెల్ఫోన్ల వెలుగులో కొండపైకి చేరుకుని దాదాపు గంటపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మంగళవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో గేటును ఎత్తడంతో రిజర్వాయర్‌లోని నీరు భారీగా బయటకు ప్రవహించింది. ఆ సమయంలో రిజర్వాయర్‌లో సుమారు 9.5 టీఎంసీల నీరు ఉండగా.. గంటకు పైగా మూడువేల క్యూసెక్కులకుపైగా నీరు బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎస్సార్బీసీ కాలువలోకి సామర్థ్యానికి మించి నీరు రావడంతో కాలువకు ఆనుకుని ఉన్న మట్టికట్ట పలుచోట్ల కొట్టుకుపోయింది. బండరాళ్లు, మట్టి కొట్టుకురావడంతో రోడ్డు, పొలాలు నీటమునిగాయి. గోరుకల్లు-పాణ్యం రహదారిపై సుమారు 200 మీటర్ల మేర బండరాళ్లు పేరుకుపోయాయి.
రెగ్యులేటర్ వద్ద సిబ్బంది లేకపోవడంతో అధికారులు సమీపంలోని జయజ్యోతి సిమెంట్స్ పంపుహౌస్‌లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ కోటయ్యకు సమాచారం ఇచ్చారు. ఉదయం 5.50 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఆయన.. కరెంటు లేకపోయినా గేటును మాన్యువల్‌గా దించే విధానం తెలిసి ఉండటంతో గేటును మూసివేశారు. దీంతో నీటి ప్రవాహం నిలిచిపోయి పెనుముప్పు తప్పింది.
రిజర్వాయర్ గేటు ఎత్తిన ఆకతాయి..ఎలక్ట్రీషియన్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



