Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంకాలపరిమితి లేకుంటే వేతన కోడ్‌ లక్ష్యమే దెబ్బతింటుంది

కాలపరిమితి లేకుంటే వేతన కోడ్‌ లక్ష్యమే దెబ్బతింటుంది

- Advertisement -

ఆర్థికవేత్తల హెచ్చరిక
న్యూఢిల్లీ
: మూల వేతనాన్ని సవరించే విషయంలో కాలపరిమితిని నిర్ణయించకపోవడంతో ఇటీవల నోటిఫై చేసిన వేతన కోడ్‌ తన లక్ష్య సాధనలో విఫలమయ్యే అవకాశం ఉన్నదని కొందరు కార్మిక ఆర్థికవేత్తలు అభిప్రాయ పడ్డారు. వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న కనీస వేతనాల్లో కన్పిస్తున్న వ్యత్యాసా లను తగ్గించడానికి వేతన కోడ్‌ జాతీయ స్థాయిలో ఫ్లోర్‌ వేతనాన్ని ప్రవేశ పెట్టింది. ఫ్లోర్‌ వేతనం అంటే కనీస వేతనపు దిగువ స్థాయి. ఇది కార్మికులకు చెల్లించాల్సిన కనిష్ట వేతనం. ఏ రాష్ట్రమైనా దీని కంటే తక్కువ వేతనాన్ని చెల్లించకూడదు. అయితే ఫ్లోర్‌ వేతనాన్ని సవరించడానికి కోడ్‌ నిర్దిష్ట కాలక్రమాన్ని నిర్ణయించలేదు. ఫలితంగా లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో లేదా ప్రాంతాలవారీగా ఫ్లోర్‌ వేతనాన్ని నిర్ణయించేం దుకు వేతనకోడ్‌ కేంద్రానికి అధికారం ఇచ్చింది. రాష్ట్రాలు నిర్ణయించే కనీస వేతనం ఫ్లోర్‌ వేతనం కంటే తక్కువ ఉండకూడదు.

అయితే జాతీయ ఫ్లోర్‌ వేతన రేటు సవరణకు వేతన కోడ్‌ ఎలాంటి కాలపరిమితిని నిర్ణయించలేదు. 1948వ సంవత్సరపు కనీస వేతన చట్టం ప్రకారం రాష్ట్రాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాన్ని సవరించాల్సి ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలు దానిని ఉల్లంఘిస్తున్నాయి. దీంతో రాజస్థాన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం వంటి రాష్ట్రాల్లో నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు రూ.200 వేతనం మాత్రమే లభిస్తోంది. అదే ఢిల్లీలో రూ.600, కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో రూ.500 ఇస్తున్నారు. ‘ఫ్లోర్‌ వేతన సవరణకు కాలపరిమితి ఏదీ లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను జాప్యం చేయవచ్చు. ఫలితంగా ఫ్లోర్‌ వేతనం తక్కువగానే ఉంటుంది. మరోవైపు రాష్ట్రాలు కూడా కనీస వేతనాల సవరణను ఆలస్యం చేస్తున్నాయి.

ఫ్లోర్‌ వేతనాన్ని కాలపరిమితికి లోబడి సవరిస్తూ ఉంటే రాష్ట్రాలు విధిగా తమ కనీస వేతనాలను సవరించాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఫ్లోర్‌ వేతనం కంటే తక్కువ ఉండకూడదు. కేంద్రం ఆలస్యం చేస్తే రాష్ట్రాలు కూడా అదే బాట పడతాయి. దీనివల్ల కనీస వేతనంలో సవరణ అస్థిరంగా ఉంటుంది. అసమానతలు పెరుగుతాయి’ అని ఓ కార్మిక ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు. యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ చెల్లించకూడదని పాట్నాలోని ఏఎన్‌ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌ మాజీ డైరెక్టర్‌, ఆర్థికవేత్త సునీల్‌ రే తెలిపారు. ‘కానీ వేతనాలు, ఇతర సంక్షేమ నిబంధనల వ్యవహారాలను బడా సంస్థలకు అప్పగిస్తున్నారు. ఫ్లోర్‌ వేతనం అనే ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే అది చట్టపరంగా అనుమతించిన మూల వేతనం అయింది. కనీస వేతనం కంటే ఎప్పుడూ తక్కువగానే ఉండేలా దీనిని అనుమతించారు. అంటే దీనర్థం కనీస వేతనం అనేది ఇప్పుడు అసంబద్ధం. దానివల్ల ప్రయోజనం ఏముంది?’ అని రే ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -