– అక్కడ బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు ఓకే
– ఈవీఎంలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ సర్కారు
– రాయబరేలీ ఓటర్‌లిస్టుపై అనుమానాల పట్ల ఈసీకి ఫిర్యాదు చేస్తాం : బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈవీఎంలపై నమ్మకం లేకుంటే రాయబరేలీలో రాహుల్‌గాంధీ రాజీనామా చేయాలనీ, అక్కడ బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణకు తమ ప్రభుత్వం సిద్ధమేనని బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్‌రావు చెప్పారు. అక్కడ గెలిచి చూపాలని సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తలు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేసి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్‌లలో దొంగ ఓట్లు గుర్తించారనీ, రాహుల్ గాంధీ ఎన్నికను రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. ప్రియాంక గాంధీ గెలిచిన వయనాడ్, బెంగాల్‌లో మమతాబెనర్జీ గెలిచిన స్థానంపైనా, డింపుల్, అఖిలేశ్ నియోజకవర్గాలపైనా తమకు అనుమానం ఉందని చెప్పారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షనేతకు దేశంలోని వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం బాధాకర మన్నారు.
బ్యాలెట్ పేపర్లకు, ఈవీఎంలకు మధ్య తేడా ఏంటని రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా శాస్త్రీయంగా స్టడీ చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు సరే ఓడిపోతే తప్పు అని మాట్లాడటం సరిగాదన్నారు. దేశప్రతిష్టను దిగజార్చే పనిలో రాహుల్‌గాంధీ ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓపిక ఉంటే తెలంగాణలో స్థానిక సంస్థలను బ్యాలెట్ పేపర్లతోనే పెట్టాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించే రీతిలో, విశ్వాసం లేకుండా వ్యవహరించకూడదని కోరారు.
నమ్మకం లేకుంటే రాహుల్‌గాంధీ రాజీనామా చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES