ఇదేనా సమాఖ్య వాదమంటే? : రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో సీపీఐ(ఎం) ఎంపీ ఏఏ రహీమ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”ఏదైనా రాష్ట్రంలో బీజేపీ గెలవకపోతే, ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదా? ఇదేనా సమాఖ్య వాదమంటే..” అంటూ సీపీఐ(ఎం) ఎంపీ ఏఏ రహీమ్ ప్రశ్నించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా అప్రకటిత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ కేరళ అభివృద్ధి చెందిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని అన్నారు. సోమవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ”కేరళ అప్పుల ఊబిలో ఉందని బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రం అప్పు రూ.1.97 కోట్ల నుంచి రూ.2.14 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ పత్రాలు చూపిస్తున్నాయి. ఇది జీడీపీలో 56 శాతం, కానీ కేరళది కేవలం 38.47 శాతం. కేంద్రమంత్రి సురేశ్ గోపి కేరళకు ఎయిమ్స్ కేటాయిస్తామని మాట్లాడారు. ఇది కేవలం ఖాళీ వాగ్దానం. మాజీ మంత్రి కూడా అయిన కేరళ బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్రంలో ఆ పార్టీ ఎన్నికయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని అన్నారు.
ఇదేనా సమాఖ్యవాదం” అని రహీమ్ ప్రశ్నించారు.
దేశ యువతను నిరుద్యోగం వెంటాడుతోందనీ, జీవన వ్యయం పెరుగుతోందని తెలిపారు. దీనికి మూల కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి, బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న నయా ఉదారవాద విధానాలేనని స్పష్టం చేశారు. ”దేశంలో కాంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ పెరుగుతోంది. అగ్నివీర్‌తో సైన్యాన్ని కూడా కాంట్రాక్టుగా మార్చారు. శాశ్వత ఉద్యోగాలను తగ్గించడంతో ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సహా ప్రయివేట్ రంగంలో అధిక పనిభారం, లక్ష్యాల కారణంగా యువత ఇబ్బందులు పడుతున్నారు. అధిక పనిభారం కారణంగా ఆత్మహత్య చేసుకున్న అన్నా సెబాస్టియన్‌ను మనలో ఎవరూ మర్చిపోలేరు. గిగ్ ఎకానమీ పెరుగుతోంది. ఇది వ్యవస్థీకృత రంగం పతనం ఫలితంగానే జరిగింది” అని ఆయన తెలిపారు. దేశంలో కాంట్రాక్టీకరణను నిలిపివేయాలని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని రహీమ్ డిమాండ్ చేశారు.



