Tuesday, February 3, 2026
E-PAPER
Homeమానవిహక్కులిస్తే తీసుకుంటం..లేదంటే లాక్కుంటాం...

హక్కులిస్తే తీసుకుంటం..లేదంటే లాక్కుంటాం…

- Advertisement -

కనినిక ఘోష్‌… ఓ సాధారణ విద్యార్థిగా ఎస్‌.ఎఫ్‌.ఐ ఉద్యమాలకు ఆకర్షితురాలయ్యారు. విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఓ నాయకురాలిగా ఎదిగారు. విద్యార్థిగా ఉన్నపుడే మహిళల కోసం ఐద్వా చేస్తున్న పోరాటాలు చూసి స్ఫూర్తిపొందారు. మహిళా సమానత్వం కోసం తన వంతు కృషి చేయాలని భావించి మహిళా ఉద్యమాల్లోకి ప్రవేశించారు. అంచలంచలుగా ఎదుగుతూ పశ్చిమబెంగాల్‌ ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ఇటీవలె హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా అఖిల భారత మహాసభల్లో ఆలిండియా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆమెతో మానవి సంభాషణ…

ఉద్యమాలతో పరిచయం ఎలా ఏర్పడింది?
మాది పార్టీ కుటుంబం. అమ్మానాన్న ఇద్దరూ సీపీఐ(ఎం)లో పని చేసేవారు. అలా నాకూ పేదల పక్షం నిలబడే పార్టీ అంటే మొదటి నుండి ఎంతో అభిమానం. నేను 1984లో ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశాను. నా స్కూలింగ్‌ తర్వాత విద్యార్థి ఉద్యమంలోకి వచ్చాను. 1985లో విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానంటే దానికి బీజం పడింది ఎస్‌.ఎఫ్‌.ఐలోనే. సమాజం గురించి అధ్యయనం చేసే శక్తిని నాకు విద్యార్థి సంఘం ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కత్తాకు ఎస్‌.ఎఫ్‌.ఐ కార్యదర్శిగా పని చేశాను. అలా పని చేసిన మొదటి మహిళను నేనే. అనేక సమస్యలపై పోరాటం చేసేవాళ్లం. కేవలం విద్యార్థుల సమస్యలపైనే కాక అనేక సమస్యలపై పోరాటాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా భర్త, నా పిల్లలు కూడా నాకు సపోర్ట్‌ చేస్తున్నారు. వీళ్లు కూడా పార్టీ సభ్యులే. నా భర్త కూడా అభ్యుదయ ఉద్యమాల్లో ఉన్నారు. అలా విద్యార్థి సంఘం నుండి ప్రారంభమైన నా ఉద్యమ ప్రయాణం నేటికీ కొనసాగుతుంది.

ఐద్వాలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
విద్యార్థి సంఘం తర్వాత ఐద్వాలో పని చేయడం మొదలుపెట్టాను. విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుండే ఐద్వా కార్యక్రమాలు చూస్తున్నాను. లింగ వివక్షపై ఐద్వా చేస్తున్న పోరాటాలు నన్ను బాగా ఆకర్షించాయి. మహిళా సమానత్వం కోసం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తున్న ఐద్వాలో నేను కూడా పని చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. సమాజంలో మహిళలంటే చిన్నచూపు. అడుగడుగునా వివక్ష. ఆ భావన తొలగిపోవాలనే ఉద్దేశంతో మహిళా సమానత్వం కోసం ఐద్వా పోరాటం చేస్తుంది. ఇదే లక్ష్యంతో నేనూ ఐద్వాలోకి వచ్చాను. మొన్నటి వరకు ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాను.

ఐద్వా అఖిల భారత కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. మీరు ఎలా ఫీలవుతున్నారు?
ఇప్పుడు నాపై చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఐద్వా అఖిల భారత కార్యదర్శిగా నన్ను 14 అఖిల భారత మహాసభ ఎంపిక చేసింది. మా ముందు పని చేసిన గొప్ప గొప్ప మహిళా నాయకులను దగ్గరగా చూశాను. సుశీలా గోపాలన్‌, బృందాకరత్‌, మరియం లాంటి వాళ్లు నా ముందు ఈ బాధ్యతలు చూశారు. ఐద్వా ఓ లక్ష్యం కోసం అవిశ్రాంతిగా కృషి చేస్తుంది. మా ముందుతరం వారి స్ఫూర్తితో ఈ పోరాటాలను ముందుకు తీసుకెళ్లడం నా కర్తవంగా భావిస్తున్నాను.

దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందంటారు?
ప్రస్తుతం మహిళలు అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి దారుణంగా ఉంది. ఒక పక్క అనేక విజయాలు సాధిస్తున్నా అణచివేతకు గురవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ పాలనలో మనుధర్మం పేరుతో మహిళలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. బయటకు రాకుండా నాలుగ్గోడలకే పరిమితం చేయాలనుకుంటున్నారు. ఐద్వా ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న హక్కులను నేటి మహిళలకు దూరం చేయాలని చూస్తున్నారు. మరీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే కనీసం నేటి మహిళలు తాము సమస్యలు ఎదుర్కొంటున్నాం అనే అవగాహన కూడా లేకుండా వారి మెదళ్లను మార్చేస్తున్నారు. మీరు పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చోండి చాలు అన్నట్టు చేస్తున్నారు. కానీ మేము ఈ మనువాదులను చూస్తూ ఊరుకోం. కచ్చితంగా పోరాడతాం. వీరి చెర నుండి దేశాన్ని తద్వారా మహిళా హక్కులను కాపాడుకుంటాం.

ఐద్వాకి ఇది సాధ్యమే అంటారా?
ఒక్క ఐద్వానే కాదు అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. దానికి తగ్గట్టే ఈ మహాసభల్లో మేము తీర్మానాలు చేసుకున్నాం. సామ్రాజ్యవాదం, మనువాదం తిప్పికొట్టడం, మహిళల హక్కులను కాపాడుకోవడం ఇదే ప్రస్తుతం మా లక్ష్యం. బీజేపీ వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనీయం. ఎందుకంటే దేశ మహిళల వెంట ఐద్వా ఉంది. మహిళలు ఇప్పుడిప్పుడే అవగాహన చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు మాకు భిక్ష వేయడం లేదు. మాకు దక్కాల్సిన హక్కులనే మేము అడుగుతున్నాం. హక్కులు ఇస్తే తీసుకుంటాం. లేదంటే లాక్కుంటాం. సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గం. ఈ మహాసభల స్ఫూర్తితో మా అఖిల భారత నూతన కమిటీ చాలా ఉత్సాహంగా పని చేసేందుకు పూనుకుంది.

నేటి అమ్మాయిలకు మీరేం చెబుతారు?
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల ను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలు తమచుట్టూ ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవాలి. ఇప్పటికే చాలా మంది ఆలోచిస్తున్నారు. తమ జీవితంలో ఏం చేయాలనుకుం టున్నారో స్పష్టంగా ఉన్నారు. ఇలాంటి అవగాహన మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సమాజానికి అర్థం చేసుకోవాలి. సమస్యలపై స్పందించే గుణం పెంచుకోవాలి.

– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -