గత పది ఏళ్లలో ఆరూరును అభివృద్ధి పథంలో నడిపించాను – మాజీ సర్పంచ్ నాయికోటి మధు
నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండలంలోని ఆరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాయికోటి లావణ్యమధు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ నాయికోటి మధు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేసే అవకాశం ఇచ్చిన గ్రామ యువతీ–యువకులు, వృద్ధులు సహా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం లేకున్నా గ్రామాభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో సిసి రోడ్లు వేయించడం, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆరూరుకు కూరగాయల మార్కెట్‌ను తీసుకురావడం, ప్రభుత్వ పాఠశాలను స్థాపించడంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అందించిన సహకారం విశేషమని తెలిపారు. “ఇప్పుడు మూడోసారి నాయికోటి లావణ్యమధును ఆశీర్వదిస్తే గ్రామం మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంది. ఆరూరు పరిధిలో ప్రభుత్వ భూమిలో 187 ఎకరాల్లో 0% పొల్యూషన్‌తో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతోంది. ఇది పూర్తయిన తర్వాత గ్రామ యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి” అని వెల్లడించారు.
అలాగే గతంలో ఆరూరు గ్రామస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున గ్రామం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుంది. అందుకే ఉంగరం గుర్తు గల నాయికోటి లావణ్యమధును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను అని నాయికోటి మధు పిలుపునిచ్చారు.




