Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅనుకూలంగా ఉంటే అందలం ప్రశ్నిస్తే వేధింపులు

అనుకూలంగా ఉంటే అందలం ప్రశ్నిస్తే వేధింపులు

- Advertisement -

– నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పలువురు అధికారుల తీరు
– యూనియన్‌ పేరుతో విధులకు ఎగనామం
– పైరవీలు చేస్తూ పనులు చక్కబెడుతున్న మరికొందరు
– విధుల్లో లేకున్నా.. రిజిస్టర్‌లో ప్రజెంట్‌
– ఎవరైనా ప్రశ్నిస్తే వేతనాలు ఆపుతూ.. ఉద్యోగం నుంచి తొలిగిస్తామని బెదిరింపులు
కమిషనర్‌, మేయర్‌ దృష్టిసారించాలని కోరుతున్న కార్మికులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ రెక్కలు ముక్కలుగా చేసుకుంటూ పలువురు కార్మికులు పారిశుధ్య పనులు చేపడుతుండగా.. మరికొందరు మాత్రం పేరుకు కార్మికుల పేరిట నియమితులై కార్యాలయంలో దర్జాగా కాలం వెల్లదీస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం.. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏసీ రూంలో కూర్చొని దర్పం ప్రదర్శిస్తున్నారు. పేరుకు వేల సంఖ్యలో కార్మికులున్నట్టు అంకెలు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారి సంఖ్య వందల్లోకి మారుతుంది. ఫలితంగా వాస్తవంగా విధుల్లో ఉన్న వారిపై పనిభారం పెరుగుతుంది. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే.. వేధింపులు నిత్యకృత్యం అవుతున్నాయి. పలువురు కిందిస్థాయి అధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కిస్తుండగా.. ప్రశ్నించిన వారికి మాత్రం వేధింపులు తప్పడం లేదు. వేతనాలు నిలిపివేస్తామని, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు కార్మికులు వాపోతున్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌, మేయర్‌ దృష్టిసారించాలని కోరుతున్నారు.

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్‌లలో 5 లక్షల పైనే జనాభా ఉంది. పారిశుధ్య పనులు నిర్వహించేందుకు కార్పొరేషన్‌లో మొత్తం 1033 మంది శానిటేషన్‌ కార్మికులు ఉన్నారు. కానీ లెక్కల్లో ఉన్న కార్మికులకు, క్షేత్రస్థాయిలో పని చేసే కార్మికులకు ఎక్కడా పొంతన కుదరని పరిస్థితి. ఔట్‌సోర్సింగ్‌ కింద శానిటేషన్‌ వర్కర్‌గా నియమితమైన వారిలో కొందరు ఆ విధుల్లో లేరని సమాచారం. పలువురి అధికారులు, నాయకుల అండదండలతో సుమారు 150 మంది మున్సిపల్‌ కార్యాలయానికే పరిమితమవుతున్నట్టు వినికిడి. మరికొందరు విధుల్లో ఉండకుండా పైరవీలు చేపడుతూ పనులు చక్కబెడుతున్నట్టు తెలిసింది. దీనికి తోడు సర్కిల్‌ సెంటర్‌లో అటెండెన్స్‌లో ప్రజెంట్‌ ఉంటున్నా.. విధుల్లో నుంచి మాత్రం ఇద్దరు ముగ్గురు గాయబ్‌ అవుతున్నారు. దీనికి తోడు సుమారు 50 మందితో వాటర్‌ సెక్షన్‌ పనులు చేయిస్తున్నారు. కేటాయించిన లెక్కకు, వాస్తవంగా విధుల్లో ఉన్న కార్మికుల సంఖ్యకు పొంతన లేకపోవడంతో ఉన్న వారిపై అదనపు భారం పడుతుంది.

వేధింపులు నిత్యకృత్యం
తమపై పడుతున్న అదనపు భారంపై కార్మికులు ప్రశ్నిస్తే కిందిస్థాయి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అధికారులు కొందరు కార్మికులను తమ ఇష్టానికి వేరే పనుల్లోకి వినియోగించుకుంటుండటంతో క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న వారిపై అదనపు భారం పడుతుంది. మున్సిపల్‌ కమిషనర్‌, మేయర్‌, పాలకవర్గం స్పందించి లేబర్‌ పోస్టు కింద నియమితులైన వారితో పారిశుధ్య పనులే చేయించాలని కోరుతున్నారు. ఒక వేళ చదువుకున్న వారు ఈ పనులు చేయలేకపోతే.. అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరుతున్నారు.

మెమో జారీ చేశా :మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌
సానిటేషన్‌ వర్కర్‌ కింద నియమితులైన వారిలో కొందరు మున్సిపల్‌ ఆఫీస్‌లో విధులు చేపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేయిస్తున్నా. అలా సుమారు 75 మంది వరకు ఉన్నట్టు తెలిసింది. ఏ పోస్టుతో ఎవరు నియమితులయ్యారో వారు ఆ విధులే చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. వాస్తవంగా పనుల్లో ఉంటున్న వారి సంఖ్యను తెలుసుకునేందుకు తెల్లవారు జామున సర్కిల్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నా. 5వ సర్కిల్‌లో రిజిస్టర్‌లో 9 మంది కార్మికులకు ప్రజెంట్‌ ఉంటే విధుల్లో ఏడుగురే ఉండటంతో సదరు ఇన్‌చార్జికి మెమో జారీ చేశా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -