కార్మిక, రైతు ఐక్య పోరాటమే సమాధానం
దేశాన్ని అవమానిస్తోన్న మోడీ సర్కార్
పార్లమెంట్‌కు, ప్రజలకు తెలియకుండా అమెరికా ఒప్పందాల దాచివేత
9,10 తేదీల్లో దేశవ్యాప్త నిరసనలు
12న సార్వత్రిక సమ్మెకు విస్తృత ప్రచారం
సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐడబ్ల్యూయూ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజలకు ద్రోహం చేసే మోడీ ప్రభుత్వ విధానాలకు కార్మిక, రైతు ఐక్య పోరాటమే గట్టి సమాధానమని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐడబ్ల్యూయూ నేతలు పేర్కొన్నారు. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందాలను పార్లమెంట్‌కు, ప్రజలకు వెల్లడించకుండా దాచిపెట్టి, దేశాన్ని మోడీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ బీటీఆర్ భవన్ (సీఐటీయూ కేంద్ర కార్యాలయం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు సుదీప్ దత్తా, ఎలమారం కరీం, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడారు. అమెరికా ప్రకటనల ద్వారానే ఇండియా-యూఎస్ ఒప్పందాలు బయటకు వస్తున్నాయని, ఇది దేశానికి అవమానకరమని, ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు.
మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకుంటున్న ట్రేడ్ ఒప్పందాల వివరాలను ఇప్పటివరకు పార్లమెంట్‌కు గానీ, దేశ ప్రజలకు గానీ తెలియజేయలేదని తెలిపారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కినట్టేనని అన్నారు. ఇండియా-యూఎస్ ట్రేడ్ ఒప్పందాల పూర్తి వివరాలను వెంటనే పార్లమెంట్‌లో ఉంచి చర్చించాలని, ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశ వ్యవసాయాన్ని అమెరికా అగ్రో-కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నమని విమర్శించారు. ఇది రైతులు, వ్యవసాయ కూలీల జీవనాధారాలపై దాడి అని, దేశీయ పరిశ్రమలు, ఉపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. జాతీయ విదేశీ విధాన స్వతంత్రత, భద్రతపై ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యతిరేక ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందాలను నిరసిస్తూ ఈనెల 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రజా వ్యతిరేక, కార్పొరేట్-సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల12న దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఇండియా-యూఎస్ ట్రేడ్ ఒప్పందాల ప్రమాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గేట్ మీటింగులు, గ్రామ సభలు, సమావేశాలతో విస్తృత ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. ఈ సమ్మెను దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాల్లో, వేల పారిశ్రామిక కేంద్రాల్లో కోట్ల మంది పాల్గొని చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో అతిపెద్ద ప్రజా ఉద్యమంగా సమ్మె
కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్‌లను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెలో భాగంగా వెయ్యికి పైగా కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది పాల్గొని నిరసన సమావేశాలు నిర్వహిస్తారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం తెలిపారు. అదనంగా, సమ్మెకు మద్దతు ఇచ్చే ఇతర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు సమ్మె రోజు నిరసనలు నిర్వహిస్తాయని అన్నారు. ఈ సమ్మె దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారుతుందని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్, అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా ప్రకటించిన వాణిజ్య ఒప్పందం దేశంలోని కార్మిక, రైతు వర్గాల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. అలాగే ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఎత్తి చూపిన తీవ్రమైన దేశీయ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి కేంద్ర బడ్జెట్‌లో ఎటువంటి ప్రణాళిక లేదని పేర్కొన్నారు.
నిరుద్యోగం, ఆకలి, ఆదాయం లేకపోవడం వంటి వాటికి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లేవని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని త్యాగం చేసిన ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పంద ప్రకటన ప్రజా వ్యతిరేక బడ్జెట్ తరువాత వచ్చిందని, ఈ ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారని, ఇది పూర్తిగా అమెరికాకు అనుకూలంగా ఉందని విమర్శించారు. అమెరికా ఉత్పత్తుల సుంకం లేని ప్రవాహం భారతదేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నాశనం చేస్తుందని విమర్శించారు. పార్లమెంటులో చర్చ లేకుండా, రాష్ట్రాలను సంప్రదించకుండా ఈ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. దేశ విధ్వంసానికి దారితీసే ఒప్పందం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. మోడీ విధానాల వల్ల సామాజిక తరగతులపై బహుముఖ దాడి జరుగుతోందని బి.వెంకట్ విమర్శించారు.
ప్రజలకు ద్రోహం చేస్తే బుద్ధి చెబుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



