– అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ – సిటీబ్యూరో/కీసర
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వకుంటే తామే తాళాలు పగులగొట్టి పేదలకు ఇస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. ప్రజాసమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజాదర్బార్‌లో జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిపౖౖె మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జిల్లాలో లబ్దిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వర్షం వస్తే కురుస్తున్నాయని, పెచ్చులు ఉడుతున్నాయని, నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూం ఇండ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. కేటాయించిన ఇండ్లలో తాగు నీరు, రవాణా సౌకర్యం లేదన్నారు. మిగిలిన ఇండ్లను కలెక్టర్ వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని, లేకపోతే ఇండ్ల తాళాలు పగులగొట్టే కార్యాచరణ సీపీఐ(ఎం) తీసుకుంటుందని హెచ్చరించారు. ఇండ్లు లేని పేదలకు జాగాలు, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఫ్రీ బస్ సరే.. మహిళలకు రూ.2,500, ఉచిత గ్యాస్, నిరుద్యోగ భృతి, పెంచిన పెన్షన్ ఎప్పడు ఇస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీ హబ్, ఫార్మా హబ్ ఏర్పాటు చేస్తాం అంటున్న సీఎం.. పేదల బతుకులను మాత్రం మురికిబట్టి పోయేలా చేస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురి కాక తప్పదన్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించే విధంగా అధికార యంత్రాగం కదలకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.రమ మాట్లాడుతూ.. జిల్లాలో తమ పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేస్తే అనేక సమస్యలు వెలుగు చూశాయన్నారు. పేదలకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్స్ వద్ద సౌకర్యాలు లేకపోతే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. పింఛన్ రూ.6 వేలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, ఏఅశోక్, ఐ.రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాథోడ్ సంతోష్, ఎ.నరేష్, లింగస్వామి, లక్ష్మణ్, ఎం.శంకర్, వెంకన్న, నాయ కులు గణేష్, నర్సింగ్‌రావు, కిష్టప్ప, ఆంజనేయులు, మంగ పాల్గొన్నారు.