Saturday, May 17, 2025
Homeఆటలు90 మార్క్‌ అందినా.. రజతమే!

90 మార్క్‌ అందినా.. రజతమే!

- Advertisement -

నీరజ్‌ చోప్రా కెరీర్‌ బెస్ట్‌ 90.23 మీ త్రో
91.06 మీ త్రోతో జులియన్‌ వెబర్‌కు పసిడి

దోహా (ఖతార్‌) : ఒలింపిక్‌ పసిడి పతకం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌, డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ సహా ఆసియా, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బంగారు పతకాలు అతడి సొంతం. కెరీర్‌ ఆరంభంలోనే ఘనతలు అన్నీ సాధించేశాడు భారత సూపర్‌స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా. అయినా, అతడి కెరీర్‌లో ఓ వెలితి. అదే 90 మీటర్ల త్రో. ఈ ఏడాది జావెలిన్‌ త్రో సీజన్‌ ఆరంభంలో నీరజ్‌ చోప్రా ఎన్నాండ్లుగానో ఊరిస్తున్న 90 మీటర్ల త్రోను అందుకున్నాడు. శుక్రవారం రాత్రి ఖతార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ పోటీల్లో నీరజ్‌ చోప్రా అదరగొట్టాడు. ప్రపంచ మేటీ 12 మంది జావెలిన్‌ త్రో అథ్లట్లు పోటీపడిన ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా కెరీర్‌ అత్యుత్తమ త్రోతో పాటు జాతీయ రికార్డును సైతం నెలకొల్పాడు. మూడో ప్రయత్నంలోనే బల్లెంను 90.23 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌ చోప్రా భారత్‌లో సంబురాలకు తెరతీశాడు. 90 మీటర్ల మార్క్‌ అందుకున్న తొలి భారత అథ్లెట్‌గా నిలిచిన నీరజ్‌ చోప్రా.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 25వ అథ్లెట్‌గా నిలిచాడు. ఆసియాలో 90 మీటర్ల మార్క్‌ చేరుకున్న మూడో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మాత్రమే!.
రికార్డు త్రో విసిరినా.. రన్నరప్‌తో సరి
దోహాలో నీరజ్‌ చోప్రా రికార్డు నెలకొల్పినా, ఏండ్లుగా ఊరించిన 90 మీటర్ల మార్క్‌ అందుకున్నా.. అంతిమంగా మెడల్‌ పోడియంపై పసిడి సాధించలేదు. జర్మనీ జావెలిన్‌ త్రోయర్‌ జులియన్‌ వెబర్‌ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో 88.44 మీటర్లు సంధించిన నీరజ్‌.. రెండో ప్రయత్నంలో బల్లెంను విసరలేదు. మూడో ప్రయత్నంలో ఏకంగా 90.23 మీటర్ల త్రో విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. నాల్గో ప్రయత్నంలో 80.56 మీటర్లే విసిరిన చోప్రా.. ఐదో ప్రయత్నంలో బల్లెంను అందుకోలేదు. ఆఖరు ప్రయత్నంలో 88.20 మీటర్లతో సరిపెట్టాడు. జర్మనీ అథ్లెట్‌ జులియన్‌ వెబర్‌ ఆరో ప్రయత్నంలో అద్భుతం చేశాడు. వరుసగా ఐదు ప్రయత్నాల్లో 83.82మీ, 85.57మీ, 89.06మీ, 88.05మీ, 89.84మీ త్రో విసిరిన వెబర్‌ ఆఖరు ప్రయత్నంలో బల్లెంను ఏకంగా 91.06 మీటర్ల దూరం విసిరాడు. నీరజ్‌ను అధిగమించి పసిడి రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 85.64 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్‌ కిశోర్‌ జెనా 78.60 మీటర్ల త్రో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పారుల్‌ మెరుపుల్‌!
దోహా డైమండ్‌ లీగ్‌లో మరో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌదరి సైతం మెరిసింది. 3000మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్‌ చౌదరి ఆరో స్థానంలో నిలిచింది. 9.13.39 సెకండ్లలో రేసును ముగించిన పారుల్‌ చౌదరి గత రికార్డును రెండు సెకండ్లు మెరుగుపర్చుకుంది. దీంతో పారుల్‌ మరోసారి జాతీయ రికార్డును తిరగరాసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -