Saturday, December 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందమ్ముంటే హామీల అమలుపై శపథం చెయ్

దమ్ముంటే హామీల అమలుపై శపథం చెయ్

- Advertisement -

రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌
కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌కే సీఎంకు ముచ్చెమటలు
అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తరు
నేను ఆంధ్రలో చదివితే తప్పు… ఆయన ఆంధ్ర అల్లుడ్ని తెచ్చుకోవచ్చా ?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హామీల అమలుపై శపథం చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులు దోసల అనిల్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందని ప్రశ్నించారు. రోడ్ల మీద పెయింటింగ్‌ వేసుకునేటోడని అన్నారు. జీవితంలో ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావాలనీ, అందులో తప్పు లేదనీ, కానీ మంచి పనులు చేసి రావాలని చెప్పారు. లంగ పనులు, దొంగ పనులు చేసి బ్యాగులు, సంచులు మోసి దొరికిపోయి జైలుకు వెళ్లి అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు పోజులు కొడుతున్నారని ఆరోపించారు.

ఢిల్లీకి మూటలు మోస్తూ పైసలిచ్చి ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నారని అన్నారు. సీఎం పదవిలో ఉన్న వారికి సంతోషం ఉండాలి కానీ కేసీఆర్‌పై రోజూ ఏడుపేందుకని ప్రశ్నించారు. ఆయన మాట్లాడే భాష ఏందనీ, తమకు రాదా?అని అడిగారు. తాను హైదరాబాద్‌ గల్లీల్లో పెరిగిన వాడిననీ, ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌లో పొల్లు పోకుండా తిట్టే తెలివి ఉందన్నారు. కానీ సీఎం కుర్చీకి గౌరవం ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ను బయటకు రా అంటే వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి పోయిండని అన్నారు. దానికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టినయనీ, చలిజ్వరం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటున్నారని అన్నారు. బయటకు వస్తేనే తట్టుకోలేకపోయినవు, అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తావని రేవంత్‌రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. తాను గుంటూరులో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. ఆయన మాత్రం ఆంధ్రా నుంచి అల్లున్ని తెచ్చుకోవచ్చా?అని అడిగారు. ఆయన పేరు చిట్టినాయుడు కాకుండా భీమవరం బుల్లోడు అని పెడితే బాగుంటుందన్నారు.

మా నాయన పేరు బరాబర్‌ చెప్పుకుంటా
తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్నా అని రేవంత్‌రెడ్డి అంటారనీ, తమ నాయన గొప్పోడు, తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు అని బరాబర్‌ చెప్పుకుంటా ఇందులో తప్పేముందని కేటీఆర్‌ అన్నారు. తాను చెప్పుకోకుంటే ఇంకెవరు చెప్తారని అన్నారు. రేవంత్‌రెడ్డి కూడా సక్కటి పనులు చేస్తే ఆయన పిల్లలు, మనవడు కూడా ఆయన పేరు చెప్పుకుంటారని సూచించారు. రేవంత్‌రెడ్డి శపథం చేయాల్సింది వ్యక్తుల మీద కాదనీ, ఇచ్చిన హామీల అమలుపై అని తెలిపారు. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో శపథం చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేనోడు, కోటి మందిని కోటీశ్వరులను ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆడ పిల్లల పెండ్లికి తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని కోరారు. ఆసరా పెన్షన్‌ రూ.నాలుగు వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీమంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు కె కిశోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -