సాధారణంగా మహిళ వయసు పెరిగే కొద్దీ ఇక వీళ్లేం చేయలేరు అని అనుకుంటారు. ఆశయం, దృఢ సంకల్పం వంటివి కేవలం యువతకు చెందినవిగానే భావిస్తుంటారు. కానీ వయసు కేవలం ఒక సంఖ్య అని నిరూపిస్తున్న మహిళలు మన చుట్టూ ఎందరో ఉన్నారు. తమ విజయాలతో అలా భావించే వారి అంచనాలను తారుమారు చేస్తున్నారు. మలి వయసుకు వచ్చినా లక్ష్యం వైపు పరుగులు పెడుతున్నారు. దీనికోసం సాహసాలు సైతం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో వారు చూడాలనుకునే మార్పుగా ఉంటూనే వృద్ధాప్యాన్ని పునరాలోచించి, తిరిగి ఆవిష్కరిస్తున్న ఐదుగురు మహిళల గురించి ఈ రోజు తెలుసుకుందాం…
ఖైదీలలో మార్పుకోసం…
అరుణ సరీన్… 83 ఏండ్ల వయసున్న ఈమె రిటైర్డ్ టీచర్. జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్ జైలులో తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. గత 25 ఏండ్లుగా జైళ్లను సందర్శిస్తూ ఖైదీలలో మార్పు కోసం కృషి చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే కార్యక్రమం ద్వారా జైళ్లలోని ఖైదీలకు దగ్గరయ్యారు. ఎవరిలోనైనా మార్పు తీసుకురాగలం అని బలంగా నమ్మారు. పదవీ విరమణ తర్వాత ఆమె పని ప్రారంభమైంది. మొదట స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా ప్రారంభించినది ఇప్పుడు పూర్తికాలంగా మారింది. నిరాశ, కోపం, ఒంటరితనంతో బాధపడుతున్న ఖైదీలను గుర్తించి వారి గాయాలను మాన్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం యోగా, ధ్యానం, శ్వాస పద్ధతుల వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఏండ్లుగా ఈ పనిలో ఉన్న అరుణ ఖైదీలలో ఎంతో మార్పును గమనించారు. చాలా మంది ఖైదీలు వృత్తి నైపుణ్యాలను సంపాదించారు. దెబ్బతిన్న కుటుంబాలను బాగు చేసుకుంటున్నారు. జైలు గోడలకు అతీతంగా వారి జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఇవన్నీ చేయడానికి వయసు ఎప్పుడూ పరిమితి కాదని గుర్తు చేసుకుంటున్నారు. తన 80వ దశకంలో కూడా సేవ చేయడమే జీవితంగా బతుకుతున్నారు.
సవాళ్లను స్వీకరించి
విద్యా సింగ్… 5,895 మీటర్ల ఎత్తులోని కిలిమంజారో పర్వతంపై నిలబడ్డారు. 72 ఏండ్ల వయసులో చెన్నైకి చెందిన ఈమె ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అతి పెద్ద భారతీయ మహిళగా నిలిచారు. ఫిట్‌నెస్, సాహసంతో ఈమెకు ఏండ్లుగా అనుబంధముంది. కిలిమంజారో ఎక్కడానికి చాలా కాలం ముందు ఆమె భారతదేశంతో పాటు విదేశాలలో ఎన్నో పర్వతారోహణలు చేశారు. ఆ అనుభవంతో క్రమశిక్షణ, శక్తిని వృద్ధి చేసుకున్నారు. ఎవరికైనా కిలిమంజారో ఎక్కడం ఓ సవాలుతో కూడుకున్నది. దీనికోసం ఆమె తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. గాలి, తీవ్రమైన చలిలో ఎక్కువ గంటలు ఎక్కాలి. కానీ విద్య స్థిరమైన శిక్షణ, శ్వాస నియంత్రణ, మానసిక దృడత్వంపై ఆధారపడ్డారు. క్రీడలకు అతీతంగా మహిళలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆమె అంతర్జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు, FICCI FLO, సోరోప్టిమిస్ట్ ఇంటర్నేషనల్‌తో దగ్గరగా పనిచేశారు. అంతేకాదు నిరాశ్రయులైన మానసిక వికలాంగ పిల్లల కోసం కరుణై స్కూల్ పోషకురాలిగా ఉన్నారు. నేడు విద్యా ప్రయాణం ఎంతో మందిని, ముఖ్యంగా మహిళలను ఏ వయసులో ఉన్నా సవాళ్లను స్వీకరించగలరని ప్రేరేపిస్తుంది.
వెయిట్‌లిఫ్టర్ మమ్మీ
రోష్ని సంగ్వాన్… హర్యానాలోని భివానీకి చెందిన ఈమె మొదట్లో జారిపడిపోయేది. నడవడం కూడా కష్టంగా ఉండేది. తర్వాత రెండు మోకాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. భర్త మరణం తర్వాత కొడుకు అజరుతో కలిసి ఢిల్లీకి వెళ్లిన తర్వాత 68 ఏండ్ల వయసులో బల శిక్షణ వైపు ప్రయాణమయింది. ఎంతో ఓపికతో, ఉత్సాహంతో, జాగ్రత్తగా తన శిక్షణ కొనసాగించారు. చివరికి ఆమె కీళ్ల నొప్పులను తగ్గించడానికి అవసరమైన వ్యాయామాలు కూడా ప్రారంభించారు. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో @weightliftermummy అని ప్రేమగా పిలువబడే 70 ఏండ్ల ఆమె ట్రాప్ బార్‌పై 97 కిలోల డెడ్‌లిఫ్టింగ్, 50 కిలోల స్క్వాటింగ్, 120 కిలోల లెగ్ ప్రెస్సింగ్‌ను చూపించే వీడియోలను పోస్ట్ చేశారు. వేలాది మంది అనుచరులతో ఆమె ఆన్‌లైన్ ఉనికి వృద్ధాప్యం ఎలా ఉంటుందో రుజువు చేస్తుంది. ఆమె నొప్పులనీ మాయమైపోయాయి.
అధికారిక శిక్షణ లేకున్నా…
వసంతి చెరువువీట్టిల్… కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఈమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. తన ఇంటికి సమీపంలోని కొండ ప్రాంతాలలో ప్రతిరోజూ నాలుగు నెలలు నడిచారు. అధికారిక శిక్షణ లేకున్నా, ఎదురుదెబ్బలకు నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్లారు. వాతావరణం వల్ల లుక్లాకు ఆమె తొలి విమానం రద్దు చేసిన తర్వాత, ఆమె తన ప్రణాళికను మార్చుకున్నారు. తోటి ప్రయాణికులతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. నేపాల్‌లోని సుర్కేకు ప్రత్యామ్నాయ మార్గంలో నావిగేట్ చేశారు. ఫిబ్రవరి 15న ఆమె తొమ్మిది రోజుల పాటు ఎత్తుపల్లాల భూభాగంలో తన దృఢ సంకల్పాన్ని పరీక్షించుకునేందుకు పర్వతారోహణను ప్రారంభించారు. అక్కడి చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు అవసరమైన శిక్షణను స్వయంగా నేర్చుకున్నారు. ఫిబ్రవరి 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నప్పుడు ఆమె ప్రయత్నాలు ఫలించాయి. సంస్కృతి, విజయాల సంకేతమైన సాంప్రదాయ కేరళ కసావు చీరతో ఆమె విజయాన్ని అలంకరించారు. ట్రెక్ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన కుట్టుపని మొదలుపెట్టారు. ఆమె కథ ఆమె వయసులోని ఇతర మహిళలను వారి కలలను నిజం చేసుకునేందుకు స్ఫూర్తిగా నిలిచింది.
ఆటలతో ఉత్సాహపరుస్తూ…
వి.కిట్టమ్మాళ్.. తమిళనాడులోని పొల్లాచికి చెందిన ఈమె నేటి యువతకు శక్తివంతమైన చిహ్నంగా మారింది. తన జీవితంలో ఎక్కువ భాగం ఇంటి బాధ్యతలను నిర్వహించిన ఈ అమ్మమ్మ తన 80 ఏండ్ల వయసులో బార్‌బెల్స్, డెడ్‌లిఫ్ట్‌లతో పాటు ప్రజలను ఉత్సాహపరిచే ఆటలను పరిచయం చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికీ ఆమె ఈ ఆటల్లో క్రమం తప్పకుండా శిక్షణ పొందుతుంది. పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లలో పోటీపడుతుంది. వయసు, శారీరక బలం గురించి అనేక విధాలుగా మాట్లాడే వారిని సవాలు చేస్తుంది. మనవడి ప్రోత్సాహంతో ఈమె పవర్‌లిఫ్టింగ్‌లోకి ప్రవేశించింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు ఆమెను ఫిట్‌నెస్ వైపు మళ్లించాడు. తేలికపాటి వ్యాయామంగా ప్రారంభమైనది క్రమంగా నిర్మాణాత్మక బల శిక్షణ వైపు మార్పు చెందారు. ఆత్మవిశ్వాసం పెరిగేకొద్దీ ఆమె ఎత్తిన బరువులు ఆమెలో నమ్మకాన్ని పెంచాయి. పవర్‌లిఫ్టింగ్‌లో ఆమె సాధించిన రికార్డులు ఇప్పుడు ఎందరికో ప్రేరణగా నిలిచాయి.



