Saturday, December 27, 2025
E-PAPER
Homeమానవిప్రేముంటే తాగుడు మానుకో…

ప్రేముంటే తాగుడు మానుకో…

- Advertisement -

మద్యానికి బానిసైతే ఇక జీవితం అంతే. వారిపై ఆధారపడ్డ వారి జీవితాలను కూడా రోడ్డున పడేస్తున్నారు. మద్యం అలవాటుతో చాలా మంది ఆర్థికంగానే కాక శారీరికంగా, మానసికంగా చాలా నష్టపోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను సైతం నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మద్యంతాగే వారి వల్ల కుటుంబంలోని పిల్లలపై ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. అలాంటి ఓ సమస్యే గురించే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)లో తెలుసుకుందాం…

సాగర్‌కు సుమారు 40 ఏండ్లు ఉంటాయి. మనీషాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వారి పెండ్లి జరిగి 13 ఏండ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలున్నారు. బాబుకు పదేండ్లు, పాపకు ఐదేండ్లు. ‘నా భార్య మనీషా నన్ను పట్టించుకోవడం లేదు. నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమెకే మద్దతు ఇస్తున్నారు. మా అమ్మ, అక్క, తమ్ముడు ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు. అందరూ కలిసి నన్ను ఒంటరి వాడిని చేశారు. నాకు చనిపోవాలని ఉంది’ అంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు.

సాగర్‌ మాటలు విన్న తర్వాత మనీషాను, కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడితే అతను చెప్పిన దానికి వీళ్లు పూర్తి విరుద్దంగా చెప్పుకొచ్చారు. సాగర్‌ తల్లి మాట్లాడుతూ ‘నా కోడలు చాలా మంచిది. నా కొడుకే రోజు తాగి వచ్చి మా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెండ్లి అయ్యింది. నా భర్త ఈ మధ్యకాలంలోనే చనిపోయాడు. అతను కూడా ఎప్పుడూ నాతో సరిగ్గా ఉండలేదు. భర్తతో ఎలాగో సంతోషం లేకుండా పోయింది. కనీసం కొడుకులతో అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఆ సంతోషం కూడా నాకు దక్కనీయడం లేదు. ఏ పనీ చేయడు, తాగడానికి డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తాడు. ఇంట్లో తమ్ముళ్లు, మరదళ్లు ఉన్నారని కూడా చూడకుండా పిచ్చిగా ప్రవర్తిస్తాడు.

చేతిలో డబ్బులుంటే చాలు నిద్ర లేవగానే తాగడానికి వెళతాడు. రాత్రి వరకు ఇక అదే పని. ఎంత చెప్పినా వినిపించుకోడు. తాగకుండా ఉండటానికి డాక్టర్‌ దగ్గర మందులు తెచ్చి వేశాము. అవి వాడినప్పుడు కడుపులో నొప్పి అంటూ మూడు నెలలు తాగుడు జోలికి పోలేదు. మందులు ఆపేసిన తర్వాత మళ్లీ మొదలుపెట్టాడు. వాడు తాగి ఇల్లు, పిల్లల్ని పట్టించుకోకపోయినా నేనే పిల్లల స్కూల్‌ ఫీజు కడుతున్నాను. పిల్లల్ని నేను చూసుకుంటుంటే మనీషా ఉద్యోగం చేసుకుంటుంది. వాడి పిల్లల కోసం ఇంత చేస్తుంటే నా భార్యను, పిల్లల్ని నాకు కాకుండా చేస్తున్నానంటూ నన్నే మాటలు అంటాడు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

మనీషా మాట్లాడుతూ ‘మేము ప్రేమించి పెండ్లి చేసుకున్న మాట నిజమే. కానీ సాగర్‌ తాగుడుకు బానిసనే విషయం నాకు ముందు తెలియదు. సరదాగా అప్పుడప్పుడు తాగుతాడనే తెలుసు. ఇంట్లో ఎలాంటి బాధ్యతలూ తీసుకోడు. ఆయన సంపాదించింది ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. పైగా నేను సంపాదించిన డబ్బులు తీసుకొని తాగడానికి వెళతాడు. తాగొచ్చి గొడవ పెట్టుకుని అందరి ముందు మా పరువు తీస్తాడు. ఆయన్ని పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారు. ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే కావాలని గొడవ చేస్తాడు. పిల్లలకు ఒక్క బిస్కెట్‌ పాకెట్‌ కూడా ఇప్పించడం చేతకాదు. అయినా నేను అతన్ని ఏమీ అనలేదు. కనీసం పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లి తీసుకురమ్మన్నా వినడు. చిన్న పిల్లలు స్కూల్‌ నుండి ఎలా వస్తారు? మా అత్తయ్య తీసుకు వస్తే గొడవ చేస్తాడు. ఈ మధ్య నాలుగైదు సార్లు పిల్లలను స్కూల్‌ నుండి తీసుకురాకుండా స్నేహితులతో తాగుతూ కూర్చున్నాడు. సాయంత్రం వరకు చూసి స్కూల్‌ వాళ్లు నాకు ఫోన్‌ చేశారు.

ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇవి చాలవన్నట్టు అప్పులు కూడా చేస్తున్నాడు. అందుకే విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక ఇలాంటి మనిషితో నా వల్ల కాదు. నా నిర్ణయం సరైనది కాకపోతే మా అత్తయ్య నాకు ఎందుకు సపోర్ట్‌ చేస్తుంది’ అంటూ బాధపడింది. అందరూ చెప్పింది విన్న తర్వాత సాగర్‌తో ‘నీకు భార్యా పిల్లలు కావాలంటే తాగుడు మానుకోవాలి. సమస్యలన్నీ నీ దగ్గర పెట్టుకొని వాళ్లను అంటున్నావు. నన్ను ఒంటరి వాణ్ణి చేశారని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఇప్పటికైనా నువ్వు మారకపోతే నిజంగానే నువ్వు ఒంటరివాడివి అవుతావు. నీకు ఎలాంటి దిక్కూ ఉండదు’ అన్నాము. దానికి మనీషా ‘ఇప్పటి వరకు చాలా సార్లు పంచాయితీలు జరిగాయి. ప్రతిసారి ‘ఇక నుండి తాగను, మందు జోలికి పోను’ అంటాడు. రెండు రోజులు తర్వాత మళ్లీ మొదలుపెడతాడు. ఈయన విషయం మా బస్తీలో, పోలీస్‌స్టేషన్లో అందరికీ తెలుసు. పోలీసులు చెబితే అయినా మారతాడనుకున్నాము. అయినా ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే చివరకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అంది.

సాగర్‌ మాట్లాడుతూ ‘ఆమె నాకు అస్సలు గౌరవం ఇవ్వదు. ఆ బాధతోనే తాగుతున్నాను. అయినా ఆమె లేకపోతే నేను బతకలేను. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే ఇలా నాకు విడాకులు ఇస్తానంటూ బెదిరిస్తుంది’ అన్నాడు. దాంతో మేము ‘నిజంగా ఆమెంటే ఇష్టముంటే ముందు తాగడం మానుకొని మా దగ్గరకు వచ్చి మాట్లాడు. అప్పుడు మీ భార్యకు మేము నచ్చజెబుతాము. మీ అమ్మ, మనీషా నువ్వు మారాలని కోరుకుంటున్నారు. కానీ నువ్వు ఇలాగే నాటకాలు అడుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పుడు మేము నీ భార్యకు ఏమీ చెప్పలేము. ముందు నువ్వు మారావని ఆమె నమ్మాలి. తాగుడు మానుకొని ఉద్యోగం చూసుకొని వస్తే అప్పుడు ఆలోచిస్తాము’ అని గట్టిగా చెప్పాము.

దాంతో సాగర్‌ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక మనీషా తనకు దక్కదనే విషయం గ్రహించాడు. అప్పటి నుండి మెల్లగా తాగడం మానుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం కూడా చూసుకొని మా దగ్గరకు వచ్చాడు. మేము ముందు మనీషా అకౌంట్లో పిల్లల ఖర్చుల కోసం ప్రతి నెల డబ్బులు వేయమని చెప్పాము. అలాగే ఆరు నెలలు చేశాడు. మనీషాకు కూడా సాగరపై నమ్మకం వచ్చింది. అయితే మేము ‘నువ్వు ఇలాగే బాధ్యతగా ఉండూ. మళ్లీ మందు జోలికి పోతే మాత్రం ఇక నీ భార్యా పిల్లలు నీకు దక్కరు’ అన్నాము. దానికి సాగర్‌ ‘మందు మానేసిన తర్వాత జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో అర్థమయింది మేడం. ఇక ఎప్పుడూ దాని జోలికి పోను. నా భార్యా, పిల్లలను, అమ్మను ప్రేమగా చూసుకుంటాను. నా జీవితాన్ని నిలబెట్టినందుకు మీకు ధన్యవాదాలు’ అని చెప్పి వెళ్లిపోయాడు.

  • వై వరలక్ష్మి,
    9948794051
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -